ముంబై: మహారాష్ట్రలోని ముంబై వరుస పేలుళ్ల కేసు(1993)లో దోషిగా తేలిన గ్యాంగ్‌స్టర్ అబూ సలేంను అంతర్జాతీయ నేరస్థునిగా మహారాష్ట్ర ప్రభుత్వం అభివర్ణించింది. తన సోదరుడి మరణానంతరం నిర్వహించే కార్యక్రమాలకు హాజరయ్యేందుకు అబూ సలేం 14 రోజుల పెరోల్ కోరగా, ప్రభుత్వం దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. అతను అత్యంత ప్రమాదకర వ్యక్తి అని, కేవలం రెండు రోజుల అత్యవసర పెరోల్ మాత్రమే మంజూరు చేయగలమని కోర్టు స్పష్టం చేసింది. అది కూడా పోలీసు బందోబస్తు మధ్యే సాధ్యమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మంఖువర్ దేశ్‌ముఖ్ బాంబే హైకోర్టుకు తెలిపారు.
జైలు నిబంధనల ప్రకారం సలేంకు పోలీసు ఎస్కార్ట్‌తో కూడిన రెండు రోజుల పెరోల్ ఇచ్చేందుకు జైలు అధికారులు సుముఖత వ్యక్తం చేశారని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ భద్రతా ఏర్పాట్లకు అయ్యే ఖర్చును అబూ సలేం స్వయంగా భరించాలని షరతు విధించింది. దీనిపై సలేం తరపు న్యాయవాది ఫర్హానా షా స్పందిస్తూ, ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌కు వెళ్లి రావడానికి రెండు రోజులు సరిపోవని వాదించారు. అతను గత రెండు దశాబ్దాలుగా జైలులోనే ఉన్నాడని, అతను భారతీయ పౌరుడేనని పేర్కొంటూ, పోలీసు ఎస్కార్ట్ అవసరం లేదని ఫర్హానా షా కోర్టును కోరారు.
ఈ వివాదంపై విచారణ చేపట్టిన జస్టిస్ అజయ్ గడ్కరీ, జస్టిస్ శ్యామ్ చందక్లతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. అబూ సలేంకు 14 రోజుల పెరోల్ ఇవ్వడంలో ఉన్న అభ్యంతరాలు, భద్రతాపరమైన ఆందోళనలను వివరిస్తూ, అఫిడవిట్ దాఖలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. గతంలో తల్లి మరణించిన సమయంలో కూడా సలేంకు కొద్దిరోజుల పెరోల్ లభించిన విషయాన్ని ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది.
అబూ సలేం సోదరుడు అబూ హకీం అన్సారీ 2025, నవంబర్‌లో మరణించారు. నాడు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సలేం 14 రోజుల పెరోల్ కోసం దరఖాస్తు చేసుకోగా, నవంబర్ 20న జైలు అధికారులు దానిని తిరస్కరించారు. కోర్టుకు క్రిస్మస్ సెలవులు ఉండటంతో తన పిటిషన్ ఆలస్యమైందని సలేం డిసెంబర్ 2025లో హైకోర్టును ఆశ్రయించారు. 2005లో అరెస్ట్ అయినప్పటి నుండి జైలులోనే ఉన్న తనకు, తన కుటుంబ సభ్యుల మరణానంతర కార్యక్రమాలకు హాజరయ్యే హక్కు ఉందని సలేం తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రంలో బంగారు నిక్షేపాలు.. తవ్వాలంటే..


