ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరినీ ఆకర్షించే స్వర్ణ లోహం ఘనత వెనుక కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. భూమిపై అత్యంత విలువైనదిగా భావించే ఈ లోహం కేవలం ఆభరణాలకే పరిమితం కాలేదు. ఇదొక అద్భుతమైన రసాయన మూలకంగా గుర్తింపు పొందింది. దీని మెరుపును చూసిన ప్రాచీన గ్రీకులు ‘షైనింగ్ డాన్ (ప్రకాశించే ఉషోదయం) అని అభివర్ణించారు. అలాంటి బంగారం ఇప్పుడు కేరళ భూముల్లో నిక్షిప్తం కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
భూమిలో ఆవిర్భావం..
భూమి ఆదిలో ద్రవ రూపంలో ఉన్నప్పుడు, దానిలోని గురుత్వాకర్షణ శక్తి వల్ల బంగారం వంటి బరువైన లోహాలన్నీ కేంద్ర భాగం (Core) వైపు వెళ్లిపోయాయి. తదుపరి కాలంలో అంతరిక్షం నుంచి పడిన ఉల్కాపాతం వల్లే భూమి ఉపరితలంపై బంగారం చేరిందని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. అందుకే భూమి పైపొర అయిన 'క్రస్ట్' భాగంలో బంగారం లభ్యత చాలా తక్కువగా ఉంటుందని అంటారు. భూమి లోపలి పొరల నుంచి బంగారం ఉపరితలానికి చేరుకోవడానికి అగ్నిపర్వత ప్రక్రియలు, మాగ్మా ప్రధాన కారణాలుగా నిలుస్తాయి. భూగర్భంలోని వేడి ద్రవాలు, వాయువులు కలిసి శిలల మధ్య ఖాళీల్లోకి చొచ్చుకుపోతాయి. మాగ్మా చల్లబడినప్పుడు, అందులోని సల్ఫైడ్ ఖనిజాలతో కలిసి బంగారం స్ఫటికాలుగా లేదా స్వచ్ఛమైన లోహంగా మారుతుంది.
టన్ను మట్టిలో..
కేరళ కేవలం ప్రకృతి సోయగాలకే కాదు, భూగర్భ నిధులకు కూడా నిలయమని ఇటీవలి పరిశోధనల్లో నిరూపితమైంది. ముఖ్యంగా రాష్ట్రంలోని నిలంబూర్, వయనాడ్, అట్టప్పాడి, పునలూర్, పలు తీర ప్రాంతాల్లో స్వర్ణ నిక్షేపాలు ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. నిలంబూర్-పంతలూర్ బెల్ట్ బంగారానికి పెట్టింది పేరు. ఇక్కడ టన్ను మట్టి లేదా రాయిని వెలికితీస్తే సుమారు 0.5 నుంచి 4.5 గ్రాముల బంగారం లభించే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. బ్రిటిష్ కాలంలోనే ఇక్కడి పున్నప్పుళ, కరక్కోడ్ వంటి ప్రాంతాల్లో మైనింగ్ జరిగేది. ఇప్పటికీ అక్కడి నదుల్లో బంగారు రేణువుల కోసం స్థానికులు అన్వేషణ సాగిస్తుండటం గమనార్హం.
వాయనాడ్, అట్టప్పాడిలో పసిడి జాడలు
కేరళలోని వయనాడ్ ప్రాంతంలోని మానంతవాడి, మేప్పాడి, తరియోడ్ వంటి చోట్ల స్వర్ణ నిక్షేపాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే అట్టప్పాడిలోని భవానీ నదీ తీర ప్రాంతాల్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జరిపిన పరిశోధనల్లో టన్నుకు 1.2 గ్రాముల వరకు బంగారం దొరకవచ్చని తేలింది. అలాగే అలప్పుజ, చవర తదితర తీర ప్రాంతాల్లో సముద్రపు ఇసుకలో కూడా అత్యల్ప పరిమాణంలో పసిడి రేణువులు కనిపించడం విశేషం.
మైనింగ్‌కు అడ్డంకులు
కేరళలో బంగారం నిక్షేపాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, మైనింగ్ చేయడం ఆర్థికంగా లాభదాయకమా కాదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. చాలా చోట్ల బంగారం పరిమాణం చాలా తక్కువగా ఉండటం, పర్యావరణపరంగా ఇబ్బందులు ఏర్పడే ప్రాంతాలు కావడంతో తవ్వకాలు జరపడం అనేది సవాలుతో కూడుకున్న పనిగా మారింది. ఏదిఏమైనప్పటికీ కేరళ భూగర్భంలో దాగున్న ఈ స్వర్ణ సంపద శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
ఇది కూడా చదవండి: దేశమంతటా నువ్వుల నైవేద్యాలు.. రహస్యం ఇదే!


