దేశంలో ఎక్కడైనా సరే పండుగలు అనగానే ముందుగా పిండివంటలు గుర్తుకు వస్తాయి. అయితే జనవరిలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుపుకునే పండుగల్లో ఒక ఏకత్వం కనిపిస్తుంది. మకర సంక్రాంతి, లోహ్రీ, పొంగల్, మాఘ బిహు ఇలా అన్ని పండుగల్లో ఒకే రుచిని అందరూ చవిచూస్తారు. అదే నువ్వులతో చేసే వంటకాలు. ఇలా అన్ని ప్రాంతాల్లో నువ్వులతో పిండివంటలు ఎందుకు చేస్తారు? నువ్వులను ఈ సీజన్‌లో ప్రత్యేకంగా ఎందుకు వినియోగిస్తారు?
భారతదేశంలో జనవరి మాసం వస్తూనే పండుగల సందడి తెస్తుంది. మకర సంక్రాంతి, లోహ్రీ, పొంగల్, మాఘ బిహు.. ఇలా పేర్లు వేరైనా ఈ పండుగలన్నింటిలోనూ ‘నువ్వులు’కు ఎంతో ప్రాధాన్యత కనిపిస్తుంది. సూర్యుడు తన దిశను మార్చుకుని, ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఈ సమయంలో, ఆధ్యాత్మికంగానూ, శాస్త్రీయంగానూ నువ్వులకు ఒక విశిష్ట స్థానం ఉంది. అందుకే జనవరి పండుగల్లో ప్రతి ఇంటిలోనూ నువ్వుల వంటకాలు ఘుమఘుమలాడుతుంటాయి.
విష్ణుమూర్తి స్వేద బిందువులు
హిందూ పురాణాల ప్రకారం, నువ్వులు విష్ణుమూర్తి శరీరం నుండి రాలిన స్వేద బిందువులుగా భావిస్తారు. వీటిని 'అమరత్వానికి ప్రతీక' అని కూడా అంటారు. యమధర్మరాజు కూడా వీటిని ఆశీర్వదించినట్లు అనేక కథలు కనిపిస్తాయి. అందుకే పితృ దేవతలకు తర్పణం ఇచ్చేటప్పుడు గానీ, సంక్రాంతి పూజలో గానీ నువ్వులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, గత జన్మ పాపాలను హరించే ఒక పవిత్ర పదార్థంగా శాస్త్రాలు చెబుతున్నాయి.
శరీరానికి ఆరోగ్య కవచం
నువ్వులలో ఉండే ‘ఉష్ణ గుణం’ శీతాకాలపు చలిని తట్టుకోవడానికి శరీరాన్ని సిద్ధం చేస్తుంది. చలికాలంలో సాధారణంగా మన జీవక్రియ మందగిస్తుంది. దానిని క్రమబద్ధీకరించేందుకు నువ్వులు ఎంతో దోహదపడతాయి. నువ్వులలో లభించే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఈ విటమిన్ మెదలైనవి ఎముకల బలానికి, చర్మం పొడిబారకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి. నువ్వులను తింటే శరీరంలో అంతర్గతంగా వేడి పుట్టి, రోగనిరోధక శక్తి పెరుగుతుందని శాస్త్రవేత్తలు కూడా చెబుతుంటారు.
నువ్వులు-బెల్లం అనుబంధం
తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో నువ్వులు, బెల్లంతో చేసిన వంటకాలను పంచుకోవడం ఒక ఆచారంగా వస్తోంది. ఎన్నో పోషకాలు కలిగిన నువ్వులు-బెల్లంలను కలిపి తినడం వలన చలికాలంలో ఆరోగ్యం సమకూరుతుందని చెబుతుంటారు. అలాగే వీటిని పంచుకోవడం వలన మనుషుల మధ్య స్నేహ మాధుర్యం పెరుగుతుందని పెద్దలు అంటారు. ఇది సామాజిక ఐక్యతకు ఒక చిహ్నంగా కూడా నిలుస్తుంది.
లోహ్రీ మంటల్లో నువ్వులు వేస్తూ..
పంజాబ్‌లో జరుపుకునే లోహ్రీ పండుగలో నువ్వులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పండించిన పంట చేతికి వచ్చిన ఆనందంలో అగ్ని దేవునికి కృతజ్ఞతగా నువ్వులను, పల్లీలను, పేలాలను మంటల్లో వేస్తారు. దీనిని ‘తిల్ చౌలీ’ అని కూడా అంటారు. ఆ మంటల నుండి వచ్చే వేడి, ఆ నువ్వుల సువాసన చుట్టుపక్కల వాతావరణాన్ని పవిత్రం చేస్తుందని అక్కడివారు నమ్ముతారు.
అస్సాంలో ‘బిహు’ వేళలో..
ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో ‘మాఘ బిహు’ పండుగ వేళ నల్ల నువ్వులతో ‘తిల్ పితా’ అనే ప్రత్యేక వంటకాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. నువ్వుల్లో పోషకాలు అధికంగా ఉంటాయని వారి నమ్మకం. నువ్వులను కేవలం తీపి వంటకాల్లోనే కాకుండా, మాంసాహార వంటకాల్లో కూడా కలిపి వండటం అస్సాం సంప్రదాయంలో కనిపిస్తుంది. ఇది వారి ప్రాంతీయ ఆహార అలవాట్లలోని భిన్నత్వాన్ని చాటిచెబుతుంది.
గిరిజన ప్రాంతాల్లో ‘తిల్-మహువా’
జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో గిరిజనులు తమ ఆచారాల్లో భాగంగా నువ్వులను ‘మహువా’ పూలతో కలిపి, మెత్తగా నూరి, ఒక పేస్ట్‌లా తయారు చేస్తారు. దీనిని అటవీ సంపదకు నైవేద్యంగా పెడతారు. తద్వారా అటవీ సంపద వృద్ది చెందుతుందని వారు నమ్ముతారు. మహువా పుష్పాలు శ్రేయస్సు సూచిస్తాయని వారు చెబుతుంటారు. మొత్తంగా చూస్తే వాతావరణ మార్పులకు అనుగుణంగా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు నువ్వులు దోహదపడతాయని మనం గ్రహించవచ్చు.
ఇది కూడా చదవండి: ఒంటరి జీవుల వింత యాప్.. అత్యధిక డౌన్‌లోడ్‌లతో..


