పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అంతర్గత విభేదాల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తిరుగుబాటు ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని రెబల్స్ గ్రూప్‌లో తాజాగా కలకలం రేగింది. ఎమ్మెల్యే మహమ్మద్ కాసెం సిద్ధిఖీ తిరిగి మమతా బెనర్జీ శిబిరంలో చేరారు. అంతేకాదు.. తిరుగుబాటు నేతలు తమను తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించారు.
సోమవారం ఎమ్మెల్యే కునాల్ ఘోష్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో సిద్ధిఖీ తన నిర్ణయాన్ని వెల్లడించారు. తాను ఎప్పటికీ మమతా బెనర్జీతోనే ఉంటానని స్పష్టం చేశారు. తిరుగుబాటు వర్గంలో చేరిన సమయంలో మమతా బెనర్జీ కూడా తమ నాయకురాలిగా కొనసాగుతారని భావించానని చెప్పారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమెకు ఆ వర్గంతో ఎలాంటి సంబంధం లేదని తెలిసిందన్నారు.
‘‘మమతా బెనర్జీ ఉన్నారని భావించి ఆ వర్గంలోకి వెళ్లాను. కానీ అక్కడ ఆమె కనిపించలేదు. ఆ వర్గానికి మమతతో ఎలాంటి సంబంధం లేదని తర్వాత అర్థమైంది. ప్రజలు మమతను చూసే ఓటు వేశారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆమె పోస్టర్లతోనే తిరిగాను. మమత ఎక్కడ ఉంటే.. మేమూ అక్కడే ఉంటాం’’ అని సిద్ధిఖీ పేర్కొన్నారు.
‘గందరగోళంలో సంతకాలు చేయించారు’
తిరుగుబాటు వర్గంలోకి తన చేరిక ఎలా జరిగిందో కూడా సిద్ధిఖీ వివరించారు. రితబ్రత బెనర్జీ తమను ఒక్కసారి సమావేశానికి పిలిచి.. మమతా బెనర్జీయే తమ నాయకురాలిగా కొనసాగుతారని చెప్పారని తెలిపారు. ఆ సమయంలో నెలకొన్న గందరగోళంలో తమతో ఒక లేఖపై సంతకాలు చేయించారని ఆరోపించారు. తర్వాత అసలు విషయం అర్థమైందని, మమతా బెనర్జీకి ఆ వర్గంతో సంబంధం లేదని తెలుసుకున్నానని చెప్పారు. సిద్ధిఖీ వ్యాఖ్యలకు కునాల్ ఘోష్ కూడా మద్దతు తెలిపారు. గందరగోళం, తప్పుడు సమాచారంతోనే ఎమ్మెల్యేల నుంచి సంతకాలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు.
రెబల్ క్యాంపులో కలకలం
రితబ్రత బెనర్జీ నేతృత్వంలో టీఎంసీ వేరు కుంపటి పెట్టింది. అంతేకాదు.. తమదే అసలైన టీఎంసీ అని చెప్పుకుంటోంది. అయితే కాసెం సిద్ధిఖీ తిరిగి మమతా శిబిరంలోకి రావడం తిరుగుబాటు వర్గానికి ఎదురుదెబ్బగా మారింది. మరోవైపు సిద్ధిఖీ తిరిగి టీఎంసీలోకి వచ్చిన సమయంలోనే ఆమ్‌డాంగా మాజీ ఎమ్మెల్యే రఫీకుర్ రహ్మాన్ తిరుగుబాటు నేత రితబ్రత బెనర్జీని కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఎన్నికల్లో రఫీకుర్ రహ్మాన్‌ను కాదని ఆ స్థానంలో కాసెం సిద్ధిఖీని మమతా బెనర్జీని టీఎంసీ అభ్యర్థిగా బరిలోకి దించారు.
ఎవరీ కాసెం సిద్ధిఖీ?
ఆమ్‌డాంగా ఎమ్మెల్యేగా ఉన్న కాసెం సిద్ధిఖీ.. ఫుర్‌ఫురా షరీఫ్‌కు చెందిన ప్రముఖ పీర్జాదా కుటుంబానికి చెందినవారు. ఫుర్‌ఫురా షరీఫ్ ‘బోరో పీర్’గా ప్రసిద్ధి చెందిన అబు బకర్ సిద్ధిఖీ వారసుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. 2024 నుంచి మమతా బెనర్జీకి సన్నిహితంగా ఉన్న సిద్ధిఖీ.. 2026 ఎన్నికల్లో ఆమ్దంగా నుంచి బీజేపీ అభ్యర్థి అరిందమ్ డేను ఓడించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
తిరుగుబాటు వర్గంలో చేరిన కొద్ది నెలలకే సిద్ధిఖీ తిరిగి మమతా బెనర్జీ శిబిరానికి రావడం బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా తిరిగి ఆమె గూటికే చేరతారనే ప్రచారం అక్కడ జోరుగా కొనసాగుతోంది.
ఇదీ చదవండి: రాజకీయ సన్యాసమా? దీదీ ఏమన్నారంటే..


