సాక్షి, చెన్నై: రాజకీయం లేదా పబ్లిక్ లైఫ్‌లో ఉన్న మహిళల దుస్తులు, బాహ్య రూపం, వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం దిగజారిన రాజకీయాలకు సంకేతమని డీఎంకే ఎంపీ కనిమొళి, కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి తీవ్రంగా ఖండించారు. తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి కీర్తనను ఉద్దేశించి సోషల్ మీడియాలో జరుగుతున్న విమర్శలపై వారు స్పందిస్తూ మంత్రికి మద్దతు తెలిపారు.
వివాదం నేపథ్యం
ఇటీవల సోషల్ మీడియాలో ఒక మహిళ కారు దిగుతున్న వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ వీడియోలో ఉన్నది తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన అని ప్రచారం చేస్తూ, ఆమె వేసుకున్న దుస్తులు, బాహ్య రూపాన్ని లక్ష్యంగా చేసుకుని నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. అయితే, ఆ వీడియోలో ఉన్నది నేను కాదు అని స్పష్టం చేసిన మంత్రి కీర్తన, తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని, విమర్శలను తీవ్రంగా ఖండించారు.
మహిళా నేతల మద్దతు:
ఈవ్యవహారంపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందిస్తూ.. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా జీవితంలో ఉన్న మహిళలపై అనాగరిక దాడులు జరగడం పదేపదే చూస్తున్నాం. పురుషాధిక్య రాజకీయంలో ధైర్యంగా పనిచేస్తున్న మహిళలను సిద్ధాంతపరంగా ఎదుర్కోలేక... వారి దుస్తులు, రూపం, వ్యక్తిగత జీవితంపై కామెంట్లు చేయడం దిగజారిన రాజకీయం. ఇలాంటి దాడులకు పాల్పడే వారి సంకుచిత మనస్తత్వమే ఇందులో కనిపిస్తోంది. మహిళలు వీటన్నింటినీ అధిగమించి విజయం సాధించాలి. అని ఆకాంక్షించారు.
కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి స్పందిస్తూ, ‘‘ప్రజా జీవితంలో ఉన్న మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలో నిర్ణయించే హక్కు ఇతరులకు ఎవరు ఇచ్చారు? మహిళలను పూర్తి స్థాయి మనుషులుగా చూడకుండా, కేవలం ఒక శరీరంగా మాత్రమే చూసే భయంకరమైన మనస్తత్వానికి ఇది నిదర్శనం. ఒకవేళ ఆ వీడియోలో ఉన్నది కీర్తన అయినప్పటికీ, ఆమె దుస్తులను విమర్శించే హక్కు ఎవరికీ లేదు. ఈ దుష్ప్రచారాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న మంత్రి కీర్తనను అభినందిస్తున్నాను. మారాల్సింది మహిళల దుస్తులు కాదు... సమాజపు చూపు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగైతేనే విజయ్ టీవీకే ఇండియా కూటమిలో చేరొచ్చు: కాంగ్రెస్


