సాక్షి, తిరుపతి: పురాతన ఆలయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా.. సనాతనిగా తనను తాను చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఇవేవీ కనిపించడం లేదా? అని నిలదీశారు.
మంగళవారం ఈ వ్యవహారం భూమన కరుణాకర్ స్పందించారు. కడప–చెన్నై రహదారి వెంట ఉన్న అనేక ఆలయాలను కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రేణిగుంట–రైల్వే కోడూరు మార్గంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆంజనేయస్వామి ఆలయాన్ని కూల్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతించడంపై తీవ్రంగా మండిపడ్డారు.
అంజనేయపురం గ్రామానికి ఆ ఆలయం వల్లే ఆ పేరు వచ్చిందని భూమన పేర్కొన్నారు. తొలి వాగ్గేయకారుడు అన్నమయ్య తిరుమలకు అడవి మార్గంలో వెళ్తూ ఇక్కడి స్వయంభూ ఆంజనేయస్వామిని పూజించిన చరిత్ర ఉందన్నారు. బ్రిటిష్ కాలంలో 1871లోనే అంజనేయపురంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.
‘తెల్లోడు కాపాడితే.. నల్లోడు కూల్చేస్తున్నాడు’
బ్రిటిష్ పాలకులు ఆలయాలను సంరక్షిస్తే.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పాలకులు వాటిని కూల్చేందుకు సిద్ధమవుతున్నారని భూమన వ్యాఖ్యానించారు. తిరుపతి–చెన్నై మార్గంలోని నగరి సమీపంలోని కీలపట్టు సర్కిల్‌లో ఆంజనేయస్వామి ఆలయాన్ని ఇప్పటికే కూల్చివేశారని చెప్పారు. 1993లో చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభమైన ఆలయాన్ని ఇప్పుడు ధ్వంసం చేశారని ఆరోపించారు.
‘పవన్‌కు కనిపించడం లేదా?’
సనాతన ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆలయాల ధ్వంసం కనిపించడం లేదా? అని భూమన ప్రశ్నించారు. ‘‘అన్న ఆలయాన్ని ప్రారంభిస్తే.. తమ్ముడు అధికారంలో ఉండగా అదే ఆలయాన్ని కూల్చివేశారు. ఇదేనా సనాతన ధర్మ పరిరక్షణ?’’ అంటూ నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం ఆలయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్న భూమన.. ఆలయాల పరిరక్షణ కోసం ప్రజలతో కలిసి వైఎస్సార్‌సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రఘురామరాజుపై కేసు ఏదీ?


