పారిశ్రామికవేత్త మాదాల శ్రీనివాసు ఫిర్యాదుపై పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు
ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశం
సాక్షి, అమరావతి: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కోట్ల రూపాయల మేర ప్రజాధనాన్ని బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకుని దారి మళ్లించిన వ్యవహారంలో తన వద్ద ఉన్న ఆధారాలను సీబీఐ, ఎస్‌ఎఫ్‌ఐఓకి ఇవ్వొద్దంటూ బెదిరిస్తున్నారని, ఈ నేపథ్యంలో తగిన భద్రత కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వ్యాపారవేత్త మాదాల శ్రీనివాసు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. రఘురామకృష్ణరాజు రుణాల ఎగవేతలకు సంబంధించిన ఆధారాలను తమకిచ్చేయాలంటూ దాదాపు 30 మంది తన ఇంటికి వచ్చి కిడ్నాప్ చేసేందుకు యత్నించారంటూ శ్రీనివాసు ఇచి్చన ఫిర్యాదు మేరకు ఎందుకు కేసు నమోదు చేయలేదో చెప్పాలని గుంటూరు, పట్టాభిపురం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఫిర్యాదు అందినప్పుడు కేసు నమోదు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టంచేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచెం మహేశ్వరరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకు ముందు శ్రీనివాసు తరఫున మద్రాసు హైకోర్టుకు చెందిన సీనియర్ న్యాయవాది మణిశంకర్ వాదనలు వినిపిస్తూ, ‘ఎన్‌సీఎల్‌ఏటీలో ఉన్న రూ. 267.88 కోట్ల రికవరీ వ్యాజ్యాలు, సీబీఐ, ఎస్‌ఎఫ్‌ఐఓ దర్యాప్తు ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే క్రిమినల్ విచారణ భయంతో రఘురామకృష్ణరాజు భౌతిక దాడులకు పాల్పడుతూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
దీంతో రఘురామకృష్ణరాజుపై పట్టాభిపురం పోలీసులకు అన్ని ఆధారాలతో పిటిషనర్ ఫిర్యాదు చేశారు. అయితే వారు ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వారు నిర్వర్తించాల్సిన చట్టబద్ధ బాధ్యతలను నిర్వర్తించడం లేదు. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అయినంత మాత్రాన ఆయన చేసే నేరపూరిత చర్యలకు చట్టపరమైన రక్షణ ఏదీ లేదు. పిటిషనర్‌కు భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలి’ అని విన్నవించారు.


