బన్నూరు–చాబోలు క్రాస్‌వద్ద రోడ్డుపై బైఠాయించిన వైఎస్సార్‌సీపీ నేతలు
ఉద్దేశపూర్వకంగానే సీమ ప్రాజెక్టులను ఎండబెడుతున్నారు
వైఎస్సార్‌సీపీ రాయలసీమ నాయకుల ధ్వజం
వైఎస్సార్‌సీపీ నేతల పోతిరెడ్డిపాడు పర్యటనకు పోలీసుల అడ్డంకులు.. రోడ్డుపై బైఠాయించిన నాయకులు
న్యాయమైన హక్కుల గురించి అడిగితే పోలీసులతో నిర్బంధమా అంటూ ఆగ్రహం.. కూటమి ప్రభుత్వం కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక
సాక్షి ప్రతినిధి,కర్నూలు: కరెంటు ఉత్పత్తి పేరుతో శ్రీశైలం నుంచి నీటిని కిందకు వదిలి చంద్రబాబు సర్కారు రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తోందని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. శ్రీశైలం నీటి మట్టం తగ్గితే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు చుక్క నీరు కూడా అందదని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాజెక్టులు నిండేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు పరిశీలనకు వైఎస్సార్‌సీపీ నేతలను అనుమతించకపోవడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
రాయలసీమ రైతుల హక్కుల కోసం అందరూ చైతన్యవంతులై ఉద్యమించాలని కాటసాని పిలుపునిచ్చారు. కరెంటు ఉత్పత్తి పేరుతో శ్రీశైలం డ్యాంను ఖాళీ చేస్తూ రాయలసీమ ప్రాజెక్టులను ఎండబెడుతున్నారని శైలజానాథ్ ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ హక్కులను అడగడానికి వచ్చిన వారిని అడ్డుకోవడం సరికాదని నేతలు మండిపడ్డారు. రాయలసీమకు నీళ్లు అందే వరకు వైఎస్సార్‌సీపీ రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రాయలసీమకు నీటి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం పోతిరెడ్డిపాడు పరిశీలనకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
పోతిరెడ్డిపాడుకు ఐదు కిలోమీటర్ల దూరంలోని బన్నూరు–చాబోలు క్రాస్‌వద్ద ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయ నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు అనుమతులు లేవంటూ అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నేతలను అడ్డుకునేందుకు పోతిరెడ్డిపాడు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం, పోతిరెడ్డిపాడు గేటుకు తాళం వేయడంపై ప్రతిపక్ష నేతల్లో ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో బన్నూరు క్రాస్‌వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, సాకే శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శిల్పాచక్రపాణిరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఆలూరు పరిశీలకుడు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, నంద్యాల పరిశీలకురాలు శశికళారెడ్డి తదితరులు అక్కడే రోడ్డుపై బైఠాయించి గంటపాటు నిరసన తెలిపారు.
చంద్రబాబు డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. రైతులకు సాగు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరోవైపు పోతిరెడ్డిపాడు పరిశీలనకు వస్తున్న మాజీ ఎమ్మెల్యేలు అమర్‌నాథరెడ్డి, రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, గంగుల ప్రభాకరరెడ్డి తదితర నేతలనూ ఎస్‌ఆర్‌ఎంసీ ఎడమగట్టు కాలువ 0.6వ కిలోమీటరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.


