ఒంటరి మహిళల భూమి కబ్జా | Single Women Land Encroachment by TDP Leaders | Sakshi
Sakshi News home page

ఒంటరి మహిళల భూమి కబ్జా

Aug 25 2026 4:47 AM | Updated on Aug 25 2026 4:47 AM

Single Women Land Encroachment by TDP Leaders

కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన నల్లమాడ మండలం రాగానిపల్లికి చెందిన బాధిత మహిళలు

అధికారులను అడ్డుపెట్టుకుని

ఆక్రమించిన తెలుగు తమ్ముళ్లు

ఆరుగురు రైతులకు సంబంధించిన 8.23 ఎకరాల కాజేత

కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసిన బాధితులు

పుట్టపర్తి అర్బన్‌: రూ.కోట్ల విలువైన భూమి. నెల రోజుల క్రితం జేసీ కోర్టులో మొదటి విచారణ కూడా జరిగిన భూమి. అలాంటి భూమిని టీడీపీ వర్గీయులు కబ్జా చేశారు. రెవెన్యూ అధికారులను అడ్డుపెట్టుకుని తమ పేరుపై రికార్డుల్లో మార్చుకుని ఎవరికి చెప్తారో చెప్పుకోండి అంటూ బెదిరిస్తున్నారు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండలం రాగానిపల్లిలో చోటుచేసుకుంది. దీంతో బాధితులైన ఒకే కుటుంబానికి చెందిన ఒంటరి మహిళలు సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టరుకు ఫిర్యాదు చేయడానికి పుట్టపర్తికి వచ్చారు. వారు తెలిపిన వివరాల మేరకు... గ్రామ సర్వే నంబర్‌ 76లోని 8.23 ఎకరాల భూమి ప్రమీలమ్మ, మంజుల, సంపూర్ణ, ఆదిలక్ష్మి, కిష్టమ్మ అనుభవంలో ఉంది. 

వీరి భర్తలు చనిపోవడంతో ఒంటరి మహిళలుగా మిగిలారు. ఇదే అదనుగా భావించిన అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు సదరు భూమిని 15 రోజుల క్రితం వారి పేరుపై రెవెన్యూ రికార్డుల్లో మార్చుకున్నారు. ఈ విషయంలో పుట్టపర్తి ఆర్డీఓ కూడా వారి పక్షాన నిలిచినట్లు బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ భూమి తాతల కాలం నుంచి తమ కుటుంబ అనుభవంలోనే ఉందని తెలిపారు. టీడీపీ వర్గీయుల వల్ల ఈ భూమి వివాదం మూడేళ్ల నుంచి నడుస్తోందని, ఈ క్రమంలోనే మనోవేదనతో కుటుంబంలోని ముగ్గురు మృతి చెందారని వివరించారు. 

భూ వివాదంపై ఇటీవల పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణను కలిశామని, ఆమె కూడా ఇష్టానుసారంగా మాట్లాడారని వెల్లడించారు.  ‘నా కోర్టు నా ఇష్టం.. ఎవరికి చెప్తారో చెప్పుకోండి’ అంటూ దబాయించారని ఆరోపించారు. అలాగే సోమవారం పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌కు ఫిర్యాదు చేయగా ఆ రికార్డు తీసుకురండి, ఈ రికార్డు తీసుకురండి అంటూ పట్టించుకోలేదని,  జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ మాత్రం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. కాగా.. ఎవరి లాగిన్‌లో రికార్డులు మార్చారో వెంటనే తెలుసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement