డీఎంఈలో వైద్యుల ఉద్యోగ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచే యోచన
ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన డీఎంఈ
200 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయనే సాకుతో రిటైర్మెంట్ వయసు పెంపు?
దీనివల్ల యువ వైద్యులు, ఇప్పటికే సర్వీస్‌లో ఉన్నవారికి తీవ్ర అన్యాయం
త్వరలో రిటైర్ కానున్న కీలక స్థానాల్లోని అస్మదీయులకు మేలు చేసేందుకే ప్రభుత్వం నిర్ణయం?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యువ వైద్యుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చేలా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేస్తూ యువ వైద్యులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలకు గండి కొట్టింది. వారికి మరింత ద్రోహం తలపెడుతూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధిలో అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయసును ఏకంగా 65 ఏళ్లకు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ ప్రతిపాదనలను ఇప్పటికే డీఎంఈ ప్రభుత్వానికి పంపారు.
17 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 800 ప్రొఫెసర్ పోస్టులకు గాను, 200 ఖాళీగా ఉన్నాయనే సాకుతో వైద్యుల ఉద్యోగ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో ఇదో తలతిక్క నిర్ణయమని యువ వైద్యులతోపాటు ఇప్పటికే ప్రభుత్వ సర్వీసులో కొనసాగుతున్న వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకటి, రెండేళ్లలో ఉద్యోగ విరమణ పొందనున్న కీలక స్థానాల్లోని అస్మదీయులకు మేలు చేయడం కోసం ప్రభుత్వం రిటైర్మెంట్ వయసు పెంపు దిశగా అడుగులు వేస్తోందని మండిపడుతున్నారు.
సాకులు చెప్పి.. యువతకు మోసం..
రాష్ట్రం మొత్తం ఉన్న 800 ప్రొఫెసర్ పోస్టుల్లో అత్యధికంగా సూపర్ స్పెషాలిటీ విభాగాల్లోనే ఖాళీలు ఉన్నాయి. 16 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో 159 ప్రొఫెసర్ పోస్టులకు గాను 106 (66శాతం) ఖాళీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంబీబీఎస్, పీజీ సీట్లపై ప్రభావం పడుతోందని, దాన్ని అధిగవిుంచడం కోసం వయోపరిమితి పెంచడమే మార్గమని ప్రభుత్వం సాకులు చెబుతోంది. ఈ నేపథ్యంలో వాస్తవాలు గమనిస్తే... సూపర్ స్పెషాలిటీ ప్రొఫెసర్‌లతో ఎంబీబీఎస్ సీట్లకు ఏ మాత్రం సంబంధం ఉండదు. మెడిసిన్, సర్జరీ, అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, ఆప్తమాలజీ, గైనిక్, పీడియాట్రిక్ వంటి బ్రాడ్ స్పెషాలిటీల్లో ప్రొఫెసర్‌ల కొరత ఏర్పడితే ఎంబీబీఎస్ సీట్లపై ప్రభావం పడుతుంది.
అయితే, సూపర్ స్పెషాలిటీలో ప్రొఫెసర్‌ల కొరతను సాకుగా చూపి ప్రభుత్వం అసిస్టెంట్ నుంచి డీఎంఈ వరకు అన్ని క్యాడర్‌లకు ఉద్యోగ విరమణ వయసు పెంచేందుకు సిద్ధమైనట్లు సమాచారం. డీఎంఈలో రాష్ట్రవ్యాప్తంగా 4,971 ట్యూటర్, అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టులు ఉండగా, వాటిలో జూన్ నెలాఖరు నాటికి 881 ఖాళీగా ఉన్నాయి. వీటిలో 490 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, ప్రమోషన్‌పై భర్తీ చేసే అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 185, ప్రొఫెసర్ పోస్టులు 200 మేర ఖాళీగా ఉన్నాయి.
ఇప్పటికే సర్వీసులో ఉన్న అసిస్టెంట్లు, అసోసియేట్‌లకు ప్రమోషన్‌లు కల్పించడం, అర్హులు లేని విభాగాల్లో నిబంధనల్లో వన్ టైమ్ రిలాక్సేషన్స్ ఇస్తే అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ ఖాళీలు మెజార్టీ శాతం భర్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాకాకుండా కుంటి సాకులతో ఉద్యోగ విరమణ వయసు పెంచి యువ వైద్యులను ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శలు వస్తున్నాయి.
యువ వైద్యులు, సర్వీస్‌లో ఉన్న వారికి అన్యాయం
ఉద్యోగ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచడం వల్ల కొత్తగా యువ వైద్యులతోపాటు ఇప్పటికే సర్వీస్‌లో ఉన్న వారికి కూడా అన్యాయం జరుగనుంది. ఏటా రాష్ట్రవ్యాప్తంగా స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో పీజీ చదివి వేల మంది బయటకు వస్తున్నారు. వీరితోపాటు సెకండరీ హెల్త్, డీహెచ్‌లో పనిచేసే వైద్యులకు డీఎంఈలో నియామక అవకాశాలు తగ్గిపోతాయి. మరోవైపు ఇప్పటికే అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లుగా సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న సీనియర్ వైద్యులకు ప్రొఫెసర్, ఏడీఎంఈ పదోన్నతులు నిలిచిపోతాయి.
వైఎస్ జగన్ హయాంలో నెలకొల్పిన 10 కొత్త ప్రభుత్వ కళాశాలలను ప్రైవేట్‌కు చంద్రబాబు కట్టబెడుతున్నారు. ఈ కళాశాలలు అన్ని ప్రభుత్వ రంగంలో ప్రారంభమై ఉంటే ఒక్కో కళాశాలలో 50కి పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్, 40 అసోసియేట్ ప్రొఫెసర్, 20 ప్రొఫెసర్ పోస్టులు అందుబాటులోకి వచ్చేవి. చంద్రబాబు సర్కార్ నిర్వాకంతో 500 అసిస్టెంట్ ప్రొఫెసర్, 400 అసోసియేట్ ప్రొఫెసర్, 200 మేర ప్రొఫెసర్ పోస్టులను రాష్ట్ర వైద్యులు నష్టపోయారు.


