వార్డుల పునర్విభజనే తేలలేదు.. ఎన్నికల ఏర్పాట్లా?
సెప్టెంబర్ 3లోగా ఓటర్ల జాబితా ఖరారుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు.. కానీ, 123 పట్టణాలకుగాను 100 చోట్లే వార్డుల పునర్విభజన ప్రక్రియ మొదలు
వాటిలో 39 చోట్ల కోర్టు కేసులతో నిలిచిపోయిన ప్రక్రియ
కేవలం సగం పట్టణాల్లోనే వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తి
ఇది తేలకుండా ఓటర్ల జాబితాలు ఎలా సాధ్యమంటున్న అధికారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాటు కార్యక్రమాలు గందరగోళంగా మారాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 3న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 నగర కార్పొరేషన్లు, 82 మున్సిపాలిటీలు, 24 నగర పంచాయతీల్లో కార్పొరేషన్ డివిజన్లు, మున్సిపల్ వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రకటించాల్సి ఉంది. అయితే, సగానికిపైగా నగర కార్పొరేషన్లు, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో వార్డుల సంఖ్య, ఆయా వార్డుల పరిధిపై ఇప్పటికీ స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన గడువుకు ఇంకా వారం రోజులే ఉండడంతో ఓటర్ల జాబితా ప్రకటన ఎలా సాధ్యమన్న చర్చ సాగుతోంది.
రాష్ట్రంలో అన్ని నగరాలు, మున్సిపాలిటీల్లో ప్రస్తుతమున్న వార్డుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసి, ఆ మేర కసరత్తును ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించింది. మొత్తం 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకుగాను 23 చోట్ల పట్టణాలకు చుట్టుపక్కల గ్రామాల విలీనానికి సంబంధించి కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండడంతో మున్సిపల్ అధికారులు అసలు వార్డుల పునర్విభజన ప్రక్రియనే అక్కడ మొదలుపెట్టకుండా పక్కన పెట్టారు.
మరోవైపు.. మిగిలిన 100 చోట్ల వార్డుల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమయ్యాక 39 పట్టణాల్లో దీనిని వ్యతిరేకిస్తూ కోర్టులో కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ ఆ ప్రక్రియ నిలిచిపోయింది. మిగిలిన 61 పట్టణాల్లోనే అది పూర్తయింది. మొత్తంమ్మీద సగానికి పైగా వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తికాలేదు.
రిజర్వేషన్లకు ఆ ఓటర్ల జాబితాలే కీలకం..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠ ఎప్పుౖడెనా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా అన్నిచోట్లా ఓటర్ల జాబితాలను సిద్ధంచేసి వాటిని సెప్టెంబరు 3కల్లా ప్రకటించాలని ఇటీవల ఆదేశించారు. దీని ప్రకారం.. ఓటర్ల జాబితాల ప్రకటన పూర్తయితేగానీ వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించడం.. అలాగే రిజర్వేషన్లు ఖరారు చేయడం, ఎన్నికల నోటిఫికేషన్ జారీచేయడం సాధ్యంకాదని అధికారులు తేలి్చచెబుతున్నారు.


