చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు: వైఎస్సార్‌సీపీ బీసీ నేతలు | YSRCP BC Leaders Express Anger Against Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు: వైఎస్సార్‌సీపీ బీసీ నేతలు

Aug 24 2026 6:27 PM | Updated on Aug 24 2026 8:21 PM

YSRCP BC Leaders Express Anger Against Chandrababu
  • బీసీల వెన్నుముక విరిచిన చంద్రబాబు
  • వెన్నుముక పార్టీ మోసాలపై వైఎస్సార్‌సీపీ 'బీసీ గర్జన
  • రాష్ట్రవ్యాప్త ప్రజాక్షేత్ర పోరాటానికి కార్యాచరణ సిద్ధం!
  • వైఎస్‌ జగన్‌ హయాంలోనే బీసీలకు అసలైన రాజ్యాధికారం, ఆత్మగౌరవం
  • కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు బీసీ సమాజం ఏకతాటిపైకి రావాలి
  • పిలుపునిచ్చిన వైఎస్సార్‌సీపీ బీసీ నేతలు

తాడేపల్లి : చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం బీసీ వర్గాలను దగా చేస్తోందని వైఎస్సార్‌సీపీ బీసీ నేతలు ధ్వజమెత్తారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య బీసీ నేతలు  వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన సదస్సు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... వెన్నుపోటు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలైన 50 ఏళ్లు దాటిన మహిళలకు రూ.4 వేల పెన్షన్, కురువ, చేనేత, రజక, నాయిబ్రాహ్మణ తదితర కులవృత్తుల సంక్షేమ పథకాలను నిలిపివేసి తీరని ద్రోహం చేశారని  దుయ్యబట్టారు. 

ముఖ్యంగా స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల అంశంలో చట్టబద్ధత లేకుండా కేవలం జీవో నంబర్ 105 ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని, గతంలో వైఎస్.జగన్  34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయిస్తే కోర్టుల ద్వారా అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుదేనని తేల్చి చెప్పారు. మరోవైపు మంత్రివర్గంలో బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా అవమానించిన చంద్రబాబు, ప్రశ్నించే బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులపై అక్రమ కేసులు, భౌతిక దాడులతో కక్షసాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

వైఎస్.జగన్  ప్రభుత్వంలో బీసీలంటే 'బ్యాక్‌వర్డ్ క్లాసెస్' కాదు, వారు సమాజానికి 'బ్యాక్ బోన్ క్లాసెస్'గా గుర్తించారని గుర్తుచేశారు. డీబీటీ ద్వారా రూ.1.70 లక్షల కోట్లకు పైగా సంక్షేమ నిధులను నేరుగా బీసీల ఖాతాల్లో జమ చేయడమే కాకుండా, 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, రాజ్యసభ, లోకల్ బాడీస్, నామినేటెడ్ పదవుల్లో సింహభాగం కేటాయించి రాజకీయంగా, ఆర్థికంగా వారికి ఆత్మగౌరవం కల్పించారని వివరించారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న వెన్నుపోటు, వంచనా పూరిత రాజకీయాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టేందుకు గ్రామ, మండల, నియోజకవర్గ, జోనల్ స్థాయిలలో విస్తృతంగా సదస్సులు నిర్వహించి రాబోయే ఎన్నికల్లో కూటమి సర్కారుకు బీసీ సమాజం ద్వారా తగిన గుణపాఠం చెబుతామని వైఎస్సార్‌సీపీ బీసీ నాయకులు స్పష్టం చేశారు.

చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలపై రీజనల్ స్థాయి నుంచి పోరాటం
తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం నుంచి సుదీర్ఘంగా బీసీ నేతల సమావేశం నిర్వహించాం. ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు అబద్ధాలు చెబుతూ బీసీలను మోసం చేస్తున్నారు. బీసీలకు వెన్నుముక అని చెప్పి వెన్నుపోటు పొడిచిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. టీడీపీ మోసపూరిత విధానాలను ప్రజల్లో ఎండగట్టేందుకు రీజనల్, జిల్లా, మండల స్థాయిల్లో సదస్సులు నిర్వహిస్తాం. చంద్రబాబు నాయుడు పాలనలో బీసీలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు కాలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జగన్‌మోహన్‌రెడ్డిగారు నేరుగా డీబీటీ ద్వారా రూ.1.70 లక్షల కోట్లు బీసీల ఖాతాల్లో వేశారు. అమ్మ ఒడి, అన్నదాత సుఖీభవ, చేనేతలకు ఇచ్చే సాయం వంటి పథకాలను కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది.

స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల పేరుతో జీవో నంబర్ 105 ఇచ్చి చంద్రబాబు మరో పెద్ద డ్రామాకు తెరలేపారు. గతంలో వైయస్. జగన్‌మోహన్‌రెడ్డి 34 శాతం రిజర్వేషన్ ఇస్తే కోర్టుల ద్వారా అడ్డుకున్న ఘనత చంద్రబాబుదే. ఉప ముఖ్యమంత్రి స్థానంలో బీసీ నేతను కూర్చోబెట్టకుండా కూటమి ప్రభుత్వం తీవ్ర అవమానం చేసింది.
-చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి

34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబుకు దమ్ముంటే తేల్చి చెప్పాలి
అసెంబ్లీ సాక్షిగా 34 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలకు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారు. స్థానిక సంస్థల్లో బీసీలకు నిజంగా 34 శాతం రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా?. అమలు కాని జీవోలను అడ్డుపెట్టుకుని పాలాభిషేకాలు చేయించుకుంటూ బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా 139 కులాల ప్రతినిధులం ఒక్కటయ్యాం. ఇందుకోసం  జోనల్, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో కార్యాచరణ చేపడతాం. ఐదేళ్ల పాలనలో బీసీలను రాజ్యాధికారంలో నిలబెట్టి బ్యాక్ బోన్‌గా మార్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి.

ప్రశ్నించే బీసీ నేతలపై చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి, భౌతిక దాడులకు దిగుతోంది. కారుమూరి నాగేశ్వరరావు,వారి కుమారుడు కారుమూరు సునీల్, డాక్టర్ సీదిరి అప్పలరాజు, నేను, నా తమ్ముడు, అదే విధంగా చింతాడ రవికుమార్, విడదల రజిని సహా పలువురు వైఎస్సార్‌సీపీ బీసీ నేతలపై అక్రమ వేధింపులు కొనసాగుతున్నాయి. కూటమి నేతలు ఊదరగొడుతున్న రెడ్ బుక్ ఇప్పటికే డెడ్ బుక్ అయిపోయింది, త్వరలోనే డెత్ బుక్ కాబోతోంది. బీసీల గొంతు నొక్కాలని చూస్తే రాబోయే రోజుల్లో ప్రజలే ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెబుతారు.బలహీన వర్గాల వారందరం ఒక తాటి మీదకు వచ్చి వైయస్.జగన్ ని సీఎం చేసుకోబోతున్నాం.
-జోగి రమేశ్, మాజీ మంత్రి

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే రాజీనామా చేస్తారా?
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ నాయకులందరం గళమెత్తాం. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే చెల్లని 34 శాతం రిజర్వేషన్ బిల్లును తెరపైకి తెచ్చి బీసీలను వాడుకుంటున్నారు.తెచ్చిన జీవో ప్రకారం 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే కూటమి ప్రభుత్వం రాజీనామా చేస్తుందా?.వైయస్. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ముగ్గురు బీసీలకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చి సముచిత గౌరవం కల్పించారు.చంద్రబాబు తన మంత్రివర్గంలో బీసీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టడం బీసీలకు తీవ్ర అవమానం.
పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన చంద్రబాబుకు ఒక బీసీని తన పక్కన కూర్చోబెట్టుకునే మనసు రాలేదు.బీసీ అంటే బ్యాక్‌వర్డ్ కాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని నిరూపించిన గొప్ప నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.ఎన్నికల ముందు బీసీలను వెన్నుముక అని పొగిడి, గెలిచాక తలలోని వెంట్రుకలా తీసిపారేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను బీసీలంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు రాష్ట్రవ్యాప్తంగా బీసీలందరం ఐక్యంగా పోరాటం చేస్తాం.
-రమేష్ యాదవ్, ఎమ్మెల్సీ

మేనిఫెస్టో హామీలను తుంగలో తొక్కిన కూటమి ప్రభుత్వం
ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీసీలను తీవ్రంగా వంచిస్తున్నారు. భవిష్యత్తులో వైఎస్సార్‌సీపీ తరపున చేపట్టబోయే బీసీ ప్రజా పోరాట కార్యాచరణపై విస్తృతంగా చర్చించాం.వైయస్.జగన్‌మోహన్‌రెడ్డిహయాంలో రూ.4.5 లక్షల కోట్ల సంక్షేమంలో రూ.2 లక్షల కోట్లకు పైగా బీసీలకే నేరుగా అందించాం. కూటమి 27 నెలల పాలనలో బీసీలకు ఇచ్చిన ఒక్క ప్రధాన హామీ కూడా అమలు కాలేదు. 50 ఏళ్లు నిండిన బీసీ మహిళలకు ఇస్తామన్న రూ.4,000 పెన్షన్ హామీపై ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ లేదు. బీసీలకు రక్షణ చట్టం తెస్తామని చెప్పి, వైఎస్సార్‌సీపీ బీసీ నేతలపైనే అక్రమ కేసులు, దాడులు చేయిస్తున్నారు. 

సాధ్యం కాదని తెలిసి కూడా కేవలం రాజకీయ లబ్ధి కోసమే అసెంబ్లీలో 34 శాతం రిజర్వేషన్ డ్రామా ఆడారు. గతంలో వైయస్. జగన్ ప్రభుత్వంలో  రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తే కోర్టులకు వెళ్లి అడ్డుకున్న చంద్రబాబు ఇప్పుడు కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో నిరుపేద బీసీలు తీవ్ర వైద్య ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్లకు నేటికీ చైర్మన్లను నియమించకుండా నిధులు నిలిపివేశారు.
-విడదల రజని, మాజీ మంత్రి

బీసీ డిక్లరేషన్ అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి
గత రెండు ఆర్థిక సంవత్సరాలు, మూడు బడ్జెట్లలో బీసీలకు కేటాయింపుల్లో లయన్ షేర్ ఎక్కడా కనిపించలేదు. 50 ఏళ్లు దాటిన మహిళలకు రూ.4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు దానిపై నోరు మెదపడం లేదు.బీసీ సంక్షేమ శాఖ మంత్రి మహిళ అయి ఉండి కూడా బీసీ మహిళల సమస్యలపై చర్చకు రావడం లేదు.కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 34 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత తేవాలి.గతంలో వైయస్. జగన్ రిజర్వేషన్లు ఇస్తుంటే కోర్టు ద్వారా అడ్డుకున్న చంద్రబాబు నేడు బీసీల ముందు నవ్వులపాలయ్యారు.

కురువ కులస్తులకు గుడికట్లు పూజారుల గౌరవ వేతనం రూ.5,000 ఇస్తామన్న హామీని పూర్తిగా విస్మరించారు. చేనేతలకు ఇచ్చే పథకాల్లో తీవ్ర కోతలు పెట్టి, అర్హులైన వేలాది మంది పేర్లను తొలగించారు.టైలర్లు, రజకులు, నాయిబ్రాహ్మణులకు జగన్‌మోహన్‌రెడ్డి అందించిన ప్రోత్సాహకాలను కూటమి సర్కార్ రద్దు చేసింది. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రాష్ట్రంలో శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి. రాష్ట్ర జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలను మోసం చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారు.
-ఉషశ్రీ చరణ్, మాజీ మంత్రి

బీసీలకు నిజమైన సాధికారత అందించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే
చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో బీసీలకు జరిగిన లబ్ధికి, జగనన్న ఐదేళ్ల పాలనలో జరిగిన లబ్ధికి  నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. దాదాపు రెండు దశాబ్దాల రాజకీయాల్లో చంద్రబాబు బీసీలను రాజ్యసభకు ఒకరిద్దరిని పంపించి ఉంటారు.  కానీ వైయస్.జగన్ నలుగురు బీసీలను పెద్దల సభకు పంపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓసీ జనరల్ స్థానాల్లోనూ బీసీలకు మేయర్లు, చైర్మన్లుగా జగన్ గారు అవకాశం కల్పించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు సింహభాగం ఇచ్చి జగన్‌మోహన్‌రెడ్డి ముందు నిలిచారు. 

కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉన్నా 34 శాతం రిజర్వేషన్లకు ఎందుకు చట్టబద్ధత తీసుకురాలేకపోయారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోవడానికే ఎన్నికల ముందు చంద్రబాబు ఉత్తుత్తి జీవోలను తెస్తున్నారు. చంద్రబాబు బీసీలను కేవలం పాత కులవృత్తులకే పరిమితం చేయాలని చూశారు తప్ప ఉన్నత స్థానాలకు చేర్చలేదు. గతంలో నాయిబ్రాహ్మణులపై చంద్రబాబు చూపిన అహంకారపూరిత వైఖరిని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు.27 నెలల కూటమి పాలనలో బీసీ నేతలపై పీడీ యాక్ట్‌లు, 307 అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు.నేటి యువత, బీసీలు చైతన్యవంతంగా ఉన్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి చావుదెబ్బ తప్పదు.
-మార్గాని భరత్, మాజీ ఎంపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement