కర్నూలు, అనంతపురం జిల్లాల్లో విషాదం
తాడిపత్రి రూరల్/తుగ్గలి: అప్పులు బాధ తాళలేక ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పి.కొత్తూరుకి చెందిన కట్లపొడి రంగనాయకులు(45) తనకున్న 5 ఎకరాలతో పాటు, మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకుని కంది, సజ్జ పంటలు సాగు చేశాడు. ఈ క్రమంలో పెట్టుబడులకు చేసిన అప్పులు రూ.10 లక్షలకు చేరుకున్నాయి. దిగుబడులు రాక, చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక భరోసా లేకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించక తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి గ్రామ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
అలాగే, అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం భోగసముద్రం గ్రామానికి చెందిన రైతు మల్లికార్జునరెడ్డి(50) అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాడిపత్రి అప్‌గ్రేడ్ పోలీసుస్టేషన్ సీఐ నారాయణరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మల్లికార్జునరెడ్డికి పదెకరాల పొలం ఉంది. ఈసారైనా పంట పండకపోతుందా అనే ఆశతో ఏటా అప్పులు తెచ్చి సాగు చేసేవాడు.
ఇలా తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగి రూ.13 లక్షలకు చేరింది. ఈ ఏడాది కూడా అప్పులు చేసి పదెకరాల్లో పత్తి పంట వేశాడు. అది ఎండిపోయే పరిస్థితి రావడంతో తీవ్ర ఆందోళనకు గురై ఈ నెల 17న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని కుటుంబ సభ్యులు అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు.


