ఆంక్షలు.. అడ్డంకులు! | - | Sakshi
Sakshi News home page

ఆంక్షలు.. అడ్డంకులు!

Aug 25 2026 2:03 AM | Updated on Aug 25 2026 2:03 AM

‘చలో పోతిరెడ్డి’లో ఉద్రిక్తత

జూపాడుబంగ్లా: శ్రీశైలం రిజర్వాయర్‌లో నీళ్లున్నా రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్ట్‌లకు నీటిని విడుదల చేయడంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు చేపట్టిన ‘చలో పోతిరెడ్డి’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. అడుగడుగునా పోలీసులు మోహరించి.. బారికేడ్లు అడ్డుగా పెట్టి నేతలను అడ్డుకున్నారు. గ్రేటర్‌ రాయలసీమ ప్రాంతానికి తాగు, సాగునీరు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన సమితి అధ్యక్షుడు, మాజీ మంత్రి శైలజనాథ్‌ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, శ్రీశైలం, బనగానపల్లె, రాప్తాడు మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, నందికొట్కూరు ఇన్‌చార్జి దారా సుధీర్‌, జెడ్పీ చైర్మన్‌ పాపిరెడ్డి, వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, పీపీ నాగిరెడ్డి తదితరులు ఉదయం 10.45 గంటలకు 80 బన్నూరు గ్రామం వద్దకు చేరుకున్నారు. గ్రామ సమీపంలోని పోతిరెడ్డిపాడు వద్దకు వెళ్లే క్రాస్‌రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద పోతిరెడ్డిపాడు వద్దకు వెళ్లేందుకు ఎలాంటి అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా ఎస్పీ సునీల్‌షోరాణ్‌ అనుమతిస్తేనే పోతిరెడ్డిపాడు వద్దకు పంపుతామని ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయనాయక్‌ తెలిపారు. వెంటనే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి జిల్లా ఎస్పీకి ఫోన్‌ చేయటంతో.. ప్రభుత్వ ఒత్తిడి ఉండటంతో ఎట్టిపరిస్థితుల్లో పోతిరెడ్డిపాడుకు అనుమతివ్వమని ఎస్పీ తేల్చిచెప్పారు. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం శారు.

మిన్నంటిన నినాదాలు..

పోలీసులు, ప్రభుత్వ తీరుపై వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. సొంత రాష్ట్రంలో రోడ్లపై తిరగాడేందుకు, శాంతియుతంగా ప్రాజెక్టులను చూసేందుకు కూడా స్వేచ్ఛ లేకుండా సీఎం చంద్రబాబునాయుడు పోలీసులతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని మండిపడ్డారు. ‘మేము ఏమైనా నక్సల్స్‌మా.. టెర్రరిస్టులమా.. ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా అటకాయించటం సమంజసం కాదు’ అంటూ డీఎస్పీతో వాగ్వాదానికి దిగారు. రైతులపై పోలీసు జులం నశించాలంటూ నినాదాలు చేశారు. రైతులకు సాగునీరివ్వని చంద్రబాబునాయుడు డౌన్‌ డౌన్‌.. రైతులకు సాగునీరివ్వకపోవటం సిగ్గు..సిగ్గు.. సాగునీరిచ్చేవరకు పోరాడతాం.. రైతుల ఐక్యత వర్దిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు. చివరికి బారికేడ్లు తీసుకొని నడుచుకుంటూ పోతులపాడు వైపు వెళ్లేందుకు నాయకులు యత్నించగా పోలీసులు నిలువరించారు. ‘పోలీసు వ్యవస్థ దిగజారి పనిచేయడం మొట్టమొదటిసారిగా చూస్తున్నాం, పోలీసులే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్లుగా ఉంది.. అన్ని రోజులు ఒకేలా ఉండవని పోలీసులు గుర్తుంచుకోవాలి’ అంటూ శైలజానాథ్‌, కాటసాని, శిల్పా హెచ్చరించారు. విలేకరుల సమావేశం అనంతరం వారు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ వద్దకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. అనుమతితో రావాలని నేతలకు డీఎప్పీ సర్దిచెప్పడంతో మధ్యాహ్నం 1.10 గంటలకు వెనుదిరిగారు.

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద బారికేడ్లతో పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement