● ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు
కర్నూలు: రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు తక్కువ ధరకే బంగారం ఇస్తామని రూ.10 లక్షలు తీసుకుని తొలుత ఒరిజినల్ బంగారం శ్యాంపిల్ చూపించి నమ్మించారని, డబ్బులు తీసుకున్న తర్వాత నకిలీ బంగారం ఇచ్చి మోసం చేసి వెళ్లిపోయారని ఆదోని పట్టణానికి చెందిన తాహెర్ బాషా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 96 ఫిర్యాదులు వచ్చాయి. వీటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు శివశంకర్, పార్థసారధి, మస్తాన్ వలి తదితరులు పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.


