మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీరాఘవేంద్రస్వామి కొలువైన శ్రీమఠం హుండీ ఆదాయం రూ.2,81,69,135 సమకూరింది. సోమవారం శ్రీమఠం రాజ్యాంగణ భవనంలో హుండీ లెక్కింపు చేపట్టారు. ఆగస్టు 5 నుంచి 23వ తేదీ వరకు సంబంధించి 19 రోజుల హుండీ కానుకలు శ్రీమఠం అధికారులు లెక్కగట్టారు. ఇందులో నగదు రూపంలో రూ 2,73,34,635, నాణేలా రూపంలో రూ.8,34,500 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే 94 గ్రాముల బంగారం, 515 గ్రాముల వెండి కానుకలు సమకూరినట్లు మేనేజర్ ఎస్.కె శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్–2 వెంటేష్ జోషి, ఇంజనీర్ సురేష్‌కోనాపూర్, అనంతపురాణిక్ పాల్గొన్నారు.
29న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను ఈ నెల 29న ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ ఆర్.సుధాకర్‌రెడ్డి తెలిపారు. జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వుల మేరకు ఏడు స్థాయీ సంఘాల్లో భాగంగా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, విద్య–వైద్యం, మహిళాభివృద్ధి–శిశు సంక్షేమం, పనులు ఆర్థిక ప్రణాళిక శాఖలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. సమావేశాలకు ఆయా స్థాయీ సంఘాల చైర్‌పర్సన్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తమకు కేటాయించిన సమయానికి తప్పక హాజరు కావాలని సీఈఓ కోరారు.
డీసీసీబీ సీఈఓగా రాంప్రసాద్?
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా రాంప్రసాద్ నియమితులు కానున్నారు. ఈ పోస్టు కొన్ని నెలలుగా ఖాళీగా ఉంది. ఇదే బ్యాంకులో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్న పి.రామాంజనేయులు కొన్ని నెలల పాటు ఇన్‌చార్జి సీఇవోగా పనిచేశారు. ప్రస్తుతం ఆప్కాబ్‌లో డీజీఎం అయిన బాలాజీరావు ఈ పోస్టులో తాత్కాలికంగా పనిచేస్తున్నారు. ఇటీవల చైర్మన్ డి.విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన డీసీసీబీ బోర్డు సమావేశంలో రెగ్యులర్ సీఇవోగా ప్యానల్‌లో ఉన్న రాంప్రసాద్‌ను ఎంపిక చేశారు. ఈయన ప్రస్తుతం అనంతపురం జిల్లా సహకార కేంద్రబ్యాంకులో డీజీఎంగా పనిచేస్తున్నారు. ఈ నియామకాన్ని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆమోదించాల్సి ఉంది. ఆర్‌బీఐ ఆమోదానికి డీసీసీబీ అధికారులు ప్రతిపాదనలు పంపినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
పీజీ పరీక్ష తేదీల్లో మార్పు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వ విద్యాలయం పరిఽధిలో నిర్వహిస్తున్న పీజీ రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల్లో స్వల్ప మార్పు చేసినట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ నాగస్వరం నరసింహులు తెలిపారు. మిలాద్ ఉన్ నబి పండుగను పురస్కరించుకొని పరీక్ష తేదీలను మార్చినట్లు వెల్లడించారు. 26వ తేదీ నిర్వహించాల్సిన పరీక్షను 27న, 28న జరగాల్సిన పరీక్షను 29న నిర్వహిస్తామని, 31వ తేదీ పరీక్ష యథాతథమని పేర్కొన్నారు.
ఆర్డీఎస్‌కు చేరిన స్వల్ప నీరు
కోసిగి: తుంగభద్రడ్యామ్ నుంచి నదికి విడుదల చేసిన స్వల్ప స్థాయి నీరు సోమవారం సాయంత్రానికి కోసిగి మండలం కందుకూరు గ్రామ సమీపంలోని రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్)కు చేరింది. చాలా తక్కువగా నీరు విడుదల చేయడంతో నదిలో నెమ్మదిగా ప్రవహిస్తోంది. ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద ఆంధ్ర వైపు ఒక స్లూయిస్ గేటు నుంచి దిగువకు పారుతోంది. నదిలో అక్కడక్కడ గుంతలలోకి చేరుతోంది. కొందరు రైతులు మోటార్లు ఏర్పాటు చేసుకుని పంట పొలాలకు నీటిని తరలిస్తున్నారు.ఎక్కువ మోతాదులో నదికి నీటిని విడుదల చేసి సాగు చేసుకున్న పంటలను కాపాడాలని రైతులు కోరారు.


