పార్వతీపురం మన్యం: వంగర మండలం సంగాంలో వెలసిన పవిత్ర సంగమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నాగుపాము కలకలం సృష్టించింది. ఆలయం గర్భగుడిలో ప్రధాన అర్చకుడు సిద్ధాంత గణపతి పూజలు చేస్తున్న సమయంలో నాగుపాము దర్శనమిచ్చింది. వీటిని చూసిన భక్తులు బయటకు పరుగులు తీశారు. శివ సన్నిధిలో నాగుపాము దర్శనమివ్వడం, భక్తులు ఒకింత అదృష్టంగా భావించినప్పటికీ, భారీ నాగుపాము కావడంతో భక్తులు భయాందోళన చెందారు. అర్చకులు నాగుపామును సమీప తోటల్లోకి మళ్లించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
నాగావళికి జలకళ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండురోజులుగా నాగావళి నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నదిలో నీటి ఉద్ధృతి పెరిగింది. సంతకవిటి మండలం రంగరాయపురం వద్ద ఉన్న నారాయణపురం ఆనకట్టవద్ద 10,460 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని, వచ్చిన నీటిని వచ్చినట్టుగా కిందకు విడిచిపెడుతున్నట్టు ఆనకట్ట ఏఈ శివాజీ తెలిపారు. నదిలోకి ఎవరూ దిగొద్దని తీర గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు. – సంతకవిటి


