శ్రీశైలంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ఆత్మహత్య
మూడు రోజుల క్రితం బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తింపు
వడ్డెర సత్రంలో 26 రోజులుగా బస మృతులంతా శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి వాసులు
శ్రీశైలం టెంపుల్: కుటుంబ కష్టాలకు ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన పల్లపు సుధాకర్ (36), అతడి పెద్దక్క గోగుల ఆదిలక్ష్మి (50), చిన్నక్క మల్లేశ్వరి (45), చెల్లెలు పల్లపు శ్రీదేవి (33), మల్లేశ్వరి కుమారుడు మణికంఠ విగత జీవులై కనిపించారు. సత్రంలోని రూమ్ నంబర్–11లో సుధాకర్, అతని మేనల్లుడు మణికంఠ గదిలోని హాల్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకోగా, మిగిలిన ముగ్గురు మహిళలు స్నానాల గదిలో చీరతో ఉరేసుకున్నారు.
మూడు రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన మంగళవారం వెలుగు చూసింది. సత్రం గదినుంచి దుర్వాసన రావడంతో నిర్వాహకులు వెళ్లి చూడగా మృతదేహాలు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. 26 రోజుల నుంచి వీరంతా వడ్డెర సత్రంలో బస చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్ మాట్లాడుతూ.. ‘గత నెల 28న సుధాకర్‌తో పాటు ఆయన ముగ్గురు తోబుట్టువులు, మేనల్లుడు శ్రీశైలం వచ్చారు. రోజుకు రూ.800 అద్దె చెల్లిస్తూ వడ్డెర సత్రం గదిలో ఉంటున్నారు. ఇన్ని రోజులు ఉండకూడదని చెప్పినా ఆరోగ్యం బాగాలేదంటూ కొనసాగారు.
సుధాకర్‌కు ఇంకా వివాహం కాలేదు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లి చేసినా భర్తలను వదిలేసి ఇంటివద్దే ఉంటున్నారు. వారంతా ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డారు. బత్తలపల్లిలోని వారి బంధువులకు సమాచారం ఇచ్చాం. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం’ అని చెప్పారు. ఆలయ ఛైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వసతి గదుల్లో భక్తుల బసకు 48 గంటలే అనుమతి ఉందన్నారు. కానీ, సత్రం నిర్వాహకులు నిబంధనల్ని ఉల్లంఘించి గదులు కేటాయించారన్నారు. ప్రైవేటు సత్రాలన్నీ నిబంధనల ప్రకారం గదులు కేటాయించాలని ఆదేశించారు.


