గండి బాబ్జి అనుచరులపై విరుచుకుపడుతున్న జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు
పెందుర్తిలో బయటపడ్డ విభేదాలు
పెందుర్తి (విశాఖ): ‘ఏయ్.. నువ్వెవడివి నన్ను ప్రశ్నించడానికి. వాడు టీడీపీ మాజీ కార్పొరేటర్. నాకు ఎదురు మాట్లాడతాడా. నువ్వు వాడికి వత్తాసు పలుకుతావా. మీ అందరి సంగతి తేలుస్తా’ అంటూ మిత్రపక్షమైన టీడీపీ నాయకులపై పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు విరుచుకుపడ్డారు. టీడీపీ, మిత్రపక్షం జనసేన నాయకులు నడి రోడ్డుపై తన్నుకున్నారు. విశాఖ జిల్లా జీవీఎంసీ 88వ వార్డు నరవలోని ఓ కార్యక్రమంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
పెందుర్తి నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమే బాబు, టీడీపీ ఇన్‌చార్జి గండి బాబ్జి అనుచరుల మధ్య చాన్నాళ్లుగా ఉన్న గొడవలు మంగళవారం ఒక్కసారిగా బయటపడ్డాయి. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు సమక్షంలోనే రెండు పార్టీల నేతలు బాహాబాహీకి దిగారు. పచ్చిబూతులతో జనసేన, టీడీపీ నాయకులు కొట్టుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల సైతం సహనం కోల్పోయి టీడీపీ నాయకులపై పరుషపదజాలంతో విరుచుకుపడ్డారు. టీడీపీ ఇన్‌చార్జి గండి బాబ్జి అనుచరులైన మాజీ కార్పొరేటర్ మొల్లి ముత్యాలనాయుడు, గవర సత్తిబాబుపై తీవ్ర పదజాలంతో బెదిరింపులకు దిగారు. ‘మీ సంగతి తేలుస్తా’ అంటూ తీవ్రంగా హెచ్చరించారు.
అసలేం జరిగిందంటే..
జీవీఎంసీ ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో 88వ వార్డు కార్పొరేటర్ టికెట్ విషయంలో జనసేన–టీడీపీ నాయకుల మధ్య పోటీ మొదలైంది. ఈ క్రమంలో గండి బాబ్జి అనుచరుడు, టీడీపీ నాయకుడు గవర సత్తిబాబు, జనసేన నాయకుడు, పంచకర్ల అనుచరుడు గల్లా శ్రీను మధ్య టికెట్ విషయంలో బహిరంగంగానే వివాదం నడుస్తోంది. వార్డులో సోషల్ మీడియాలో సైతం వీరి ప్రచారం కొనసాగుతోంది.
ఈ క్రమంలో మంగళవారం వార్డులో అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం జనసేన ఎమ్మెల్యే పంచకర్ల వచ్చారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న టీడీపీ నాయకులు మిత్రపక్ష ధర్మం పాటించి టికెట్ విషయం తేల్చాలని పట్టుబట్టారు. అలా జనసేన, టీడీపీ నాయకుల మధ్య వివాదం రాజుకుంది. దాంతో ఇరువర్గాలు పంచకర్ల సమక్షంలోనే రోడ్డుపై వీధిరౌడీల్లా కొట్టుకున్నారు. సహనం కోల్పోయిన ఎమ్మెల్యే పంచకర్ల సైతం టీడీపీ నాయకులపై హెచ్చరికలకు దిగడంతో టీడీపీ నాయకులు ఎమ్మెల్యేపై తిరగబడ్డారు. దీంతో అక్కడి నుంచి పంచకర్ల వెళ్లిపోగా పోలీసులు రెండువర్గాల వారినీ శాంతింపజేశారు.


