జూడాల సంక్షేమానికి పెద్దపీట వేసింది వైఎస్ జగన్ ప్రభుత్వమే
అప్పట్లో జీవో 287లో నిర్దేశించిన 15 శాతం కంటే అధికంగా.. మొత్తంగా 42.4 శాతం స్టైపెండ్ పెంపు
సూపర్ స్పెషాలిటీ కోర్సును అభ్యసిస్తున్న వారికి సీనియర్ రెసిడెంట్స్‌గా గుర్తింపు
వారికి నిర్దేశించిన దాని కంటే పెంచి.. మొత్తంగా 77 శాతం పెంపు
2022లో అధికారుల అంతర్గత కమ్యూనికేషన్ కోసం జారీ చేసిన మెమోను తెరపైకి తెచ్చి మరీ వెన్నుపోటు పార్టీ కుట్రలు.. ఆ మెమోను కనీసం పరిగణనలోకి తీసుకోని జగన్ ప్రభుత్వం
కొద్దినెలలకే సూపర్ స్పెషాలిటీ జూడాల స్టైపెండ్ పెంచుతూ 624 జీఓ జారీ చేసిన వైఎస్ జగన్
కోవిడ్ విపత్కర పరిస్థితులున్నా.. 2020, 2022, 2023, 2024 సంవత్సరాల్లో భారీగా స్టైపెండ్ పెంచిన అప్పటి ప్రభుత్వం
స్టైపెండ్ పెంచకపోగా వాస్తవాలను దాచి పెట్టి చంద్రబాబు సర్కారు దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: జూనియర్ వైద్యుల(జూడాల) స్టైపెండ్ పెంచకుండా తీరని అన్యాయం చేస్తున్న చంద్రబాబు సర్కారు.. పచ్చి అబద్ధాలతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వంపై బురద జల్లుతోంది. జూడాల స్టైపెండ్ తగ్గింపును గత ప్రభుత్వం సమర్థించిందని మంగళవారం ఓ మెమోను తెరపైకి తెచ్చి దుష్ప్రచారం చేసి లబ్ధి పొందేందుకు కుటిలయత్నం చేసింది. అయితే, వాస్తవానికి జూనియర్ డాక్టర్ల సంక్షేమానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేసింది. వారి స్టైపెండ్‌నూ పెంచి మేలు చేసింది. దీనికి బలమైన ఆధారాలు ఉండడంతో చంద్రబాబు సర్కారు దుష్ట కుయుక్తులు పారలేదు. జూనియర్ వైద్యులు గతంలో వైఎస్ జగన్ చేసిన మేలును గుర్తు చేసుకుని దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ఛీకొడుతున్నారు.


2020లో జూడాల స్టైపెండ్ పెంచుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు
అసలేం జరిగిందంటే..
జూడాలకు స్టైపెండ్ చెల్లింపులకు వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు, కేంద్ర ప్రభుత్వ నిబంధనలపై వైద్య విభాగాధిపతుల మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు జరిగాయి. ఈ నేపథ్యంలో 2022లో నవంబర్ 28న వైద్య శాఖ ముఖ్యకార్యదర్శి.. డీఎంఈకి ఓ మెమో జారీ చేశారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న స్టైపెండ్ విధానాన్ని పరిశీలించాలని మాత్రమే ఆ మెమోలో సూచించారు. ఈ మెమోను గత వైఎస్ జగన్ సర్కారు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు.
ఇది జరిగిన కొద్దినెలలకే అంటే 2023లో బ్రాడ్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్స్‌తో సమానంగా తమ స్టైపెండ్స్ పెంచాలని సూపర్ స్పెషాలిటీ పీజీ విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో కొద్ది నెలల వ్యవధిలోనే స్టైపెండ్స్ పెంచుతూ 2023 అక్టోబర్ 10న వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో 624 విడుదల చేసింది. దీంతో మొదటి ఏడాది విద్యార్థులకు నెలకు రూ.70 వేలు, రెండో ఏడాదికి నెలకు రూ.72 వేలు, మూడో ఏడాదికి నెలకు రూ.74 వేల మేరకు అప్పట్లో స్టైపెండ్‌లు పెరిగాయి. దీన్నిబట్టి పరిశీలిస్తే ఆ మెమో.. వైద్య శాఖ అధికారుల మధ్య సమాచార మార్పిడికి జారీచేసింది మాత్రమేనని తేటతెల్లమైంది. దీనిని అప్పటి ప్రభుత్వం కనీసం పరిగణనలోకి తీసుకోకపోయినా చంద్రబాబు సర్కారు దానిపై దుష్ప్రచారం చేస్తోంది.
కోవిడ్ విపత్తులోనూ స్టైపెండ్ పెంపు
2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది తిరగకుండానే కోవిడ్ మొదలైంది. 2021, 2022లో వైరస్ వ్యాప్తి తీవ్రమైంది. ఆ సంక్షోభ పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ సర్కార్ జూడాల స్టైపెండ్ కోతకు ఆలోచన కూడా చేయలేదు. వరుసగా 2020, 2022, 2023, 2024లలో జూడాల స్టైపెండ్‌లను వైఎస్ జగన్ ప్రభుత్వం పెంచింది. ఆయుష్ వైద్య విద్యార్థులకూ అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా స్టైపెండ్ పెంపును వర్తింపజేసింది.
2009లో ఇచ్చిన 287 జీవో ప్రకారం 15 శాతానికంటే అధికంగా మొత్తంగా 42.4శాతం స్టైపెండ్ వైఎస్ జగన్ పెంచారు. సూపర్ స్పెషాలిటీ కోర్సును అభ్యసిస్తున్న వారిని సీనియర్ రెసిడెంట్స్‌గా గురిస్తూ, వారి విజ్ఞప్తినీ పరిగణనలోకి తీసుకుని నిర్దేశించిన దాని కంటే పెంచి.. మొత్తంగా 77 శాతం పెంపు వర్తింపజేశారు. ఇలా వైఎస్ జగన్ చేసిన మేలు కళ్లెదుటే కనిపిస్తుంటే బాబు సర్కార్ దుష్ప్రచారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


