సంపద సృష్టించడంలో బాబు ఘోర వైఫల్యం
తన రికార్డును తానే తిరగరాస్తూ ప్రజలపై భారీ రుణ భారం
పన్నుల రాబడి మించి అప్పులు
తాజాగా సెక్యూరిటీల వేలం ద్వారా రూ.2,600 కోట్లు అప్పు
సాక్షి, అమరావతి: సంపద సృష్టించడంలో ఘోర వైఫల్యం చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక విధ్వంసంతో అరాచక పాలన సాగిస్తున్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించకపోగా రాష్ట్రంపై అంతులేని అప్పుల భారం మోపుతున్నారు. దొరికిన చోటల్లా అప్పులు చేస్తూ ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారు. ఖజానాపై ప్రైవేట్ సంస్థలకు పెత్తనం కట్టబెడుతున్నారు. మద్యం ఆదాయంతో పాటు గనుల ఆదాయాన్ని సైతం తాకట్టు పెడుతున్నారు. నెలలో 20 రోజుల పాటు చేబదుళ్లకు వెళ్తున్నారు. వివిధ కార్పొరేషన్లకు ఆర్థిక సంస్థలు ఇచ్చే అప్పులకు గ్యారంటీ ఇస్తూ చంద్రబాబు సర్కారు ఏకంగా జీవోల మీద జీవోలు జారీ చేస్తోంది. 
రికార్డు అప్పులు..
తన రికార్డును తానే తిరగరాస్తూ చంద్రబాబు అప్పుల మోత మోగిస్తున్నారు. గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు సర్కారు రూ.2.49 లక్షల కోట్లు అప్పు చేసింది. తాజాగా మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రూ.2,600 కోట్ల బడ్జెట్ అప్పులు చేశారు. దీంతో 26 నెలల్లోనే చంద్రబాబు సర్కారు బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట అప్పులు ఏకంగా రూ.3,86,348 కోట్లకు చేరాయి. ఇక ఈ ఆర్థిక ఏడాది ఐదు నెలల్లో బడ్జెట్ అప్పులు రూ.55,534 కోట్లకు ఎగబాకాయి. అంటే నెలకు రూ.11 వేల కోట్లకు పైగా బడ్జెట్ అప్పులు చేసినట్లు స్పష్టమవుతోంది. నెలవారీ పన్ను రాబడిని మించి బాబు సర్కారు అప్పులు చేస్తోంది. ఆదాయానికి మించి అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయిస్తోంది. మరోపక్క అప్పుల కోసం ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్‌కు ధారాదత్తం చేస్తోంది. తీసుకున్న అప్పులను ఆస్తుల కల్పనకు వ్యయం చేయడం లేదు. ఇన్ని అప్పులు చేస్తున్నా సూపర్ సిక్స్ ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తోంది.


