ఫ్రీ అండ్‌ ఫెయిర్‌గా ఎన్నికలు జరిగితే.. 'మనదే విజయం' | YS Jaganmohan Reddy Says If the elections are free and fair, YSRCP will win | Sakshi
Sakshi News home page

ఫ్రీ అండ్‌ ఫెయిర్‌గా ఎన్నికలు జరిగితే.. 'మనదే విజయం'

Aug 26 2026 5:23 AM | Updated on Aug 26 2026 5:23 AM

YS Jaganmohan Reddy Says If the elections are free and fair, YSRCP will win

వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం

కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది 

నిష్పక్షపాత ఎన్నికలతో కూటమికి ఘోర పరాజయం ఖాయం 

ఇటీవల కొన్ని స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఎలా దౌర్జన్యం చేశారో చూశాం.. అందుకే మనం జాగ్రత్తలతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి 

కార్యకర్తల కోసం మనం గట్టిగా పని చేయాలి.. అలా చేస్తేనే, రేపు ఎన్నికల్లో వారు మీకు తోడుగా నిలబడతారు 

ప్రతి నియోజకవర్గంలో లీగల్‌ సెల్, మీడియా సెల్‌ ఏర్పాటవ్వాలి 

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై చురుకైన పాత్ర పోషించాలి 

బలమైన అభ్యర్థిని పోటీలో నిలపాలి.. అందరితో మమేకం కావాలి 

కూటమి ప్రభుత్వ వైఫల్యాలు.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ సంక్షేమ పాలన గురించి ఇంటింటా తెలియజెప్పాలి 

పార్టీలో పక్కాగా అందరికీ ఐడీ కార్డులు.. ప్రచార మెటీరియల్‌ పంపిణీ 

సెప్టెంబర్‌ 5 నుంచి 22 వరకు సంస్థాగత సమావేశాల షెడ్యూల్‌.. మండల, గ్రామ, వార్డు స్థాయిలో ప్రచారం చేసేలా ఖరారు 

‘వెన్నుపోటు పార్టీ – వెన్నుపోటు పాలన’ బుక్‌లెట్‌ ఇంటింటికీ చేరాలి  

రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు మన వైపు ఉన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా.. నిష్పక్షపాతంగా జరిగితే వెన్నుపోటు పార్టీ కూటమికి ఘోర పరాజయం తప్పదు. ఇటీవల కొన్ని స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఏ విధంగా దౌర్జన్యం చేశారో ప్రత్యక్షంగా చూశాం. అందుకే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కార్యకర్తల కోసం మనం గట్టిగా పని చేయాలి. అధికార పక్షం వాళ్లు ఎంత దౌర్జన్యం చేసినా, మా నాయకుడు నాతో ఉన్నాడన్న నమ్మకాన్ని కార్యకర్తలకు కల్పించాలి. అలా చేస్తేనే, రేపు వారు ఎన్నికల్లో మీకు తోడుగా నిలబడతారు.   

స్థానిక సంస్థల పదవులకు సంబంధించి ప్రత్యక్ష ఎన్నికలకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. అది ఒక విధంగా మనకు మంచిదే. ఒక బలమైన అభ్యర్థి అక్కడ నిలబడితే, మిగిలిన స్థానాలపై అతడు దృష్టి పెట్టొచ్చు. పోటీలో గట్టిగా నిలబడతాడు. ఆ బలమైన అభ్యర్థి.. మిగిలిన చోట్ల బలాన్ని ఇవ్వాలి. అలాగే అతడు సూపర్‌విజన్‌ కూడా చేయాలి. పార్టీ, ఇతర ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ, బలం లాభిస్తుంది. ఇలా చేయగలిగితే మన గెలుపు ఖాయం.

మీ నియోజకవర్గాల్లో.. ఎక్కడా కూడా మన పార్టీ అభ్యర్థి పోటీ చేయని పరిస్థితి రాకూడదు. ఎక్కడైనా ఏకగ్రీవ ఎన్నిక జరిగితే ఇక నన్ను అడగాల్సిన పని లేదు. మీరు ఆ తర్వాత ఎన్నికల్లో నిలబడరు. అంటే, టికెట్‌ దక్కదు. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా, స్థానిక ఎన్నికల్లో ప్రతిచోటా మనం అభ్యర్థులను నిలపాలి. మన కార్యకర్తలకు తోడుగా నిలబడి పోరాడాలి.

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ రూపొందించిన మెటీరియల్‌ (బుక్‌లెట్‌) ‘వెన్నుపోటు పార్టీ ృ వెన్నుపోటు పాలన’ అనేది ప్రతి ఊళ్లో, ప్రతి ఇంటికి వెళ్లాలి. మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా చెప్పాలి. దాదాపు 15 లక్షల గుర్తింపు కార్డులు సిద్ధం అవుతున్నాయి. జిల్లా, నియోజకవర్గాలు, మండల స్థాయిలో ఈ కార్డుల పంపిణీ జరుగుతుంది. బుక్‌లెట్‌ మెటేరియల్‌ కూడా మీకు అందుతుంది. ఇవన్నీ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా అందుబాటులో ఉంటాయి కాబట్టి.. ప్రతి ఒక్కరూ తమ మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

ఈ రెండున్నరేళ్ల చంద్రబాబు పాలన చూస్తే.. అంతా మోసం, దగా కనిపిస్తోంది. గత ఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నారు? జగన్‌ ఇచ్చేవి కాకుండా, అంతకు మించి ఇస్తామన్నాడు. అమ్మ ఒడి మనం ఒకరికి ఇస్తే, ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఆ పథకం ఇస్తానన్నాడు. ప్రతి ఇంటికి బాండ్లు పంపారు. చంద్రబాబు, పవన్‌ ఇద్దరూ దానిపై సంతకాలు చేశారు. ఏ పథకం ద్వారా ఆ ఇంట్లో ఎంత లబ్ధి కలుగుతుంది.. అని లెక్కలు చెప్పి నమ్మించారు. మన కంటే మూడింతలు ఎక్కువ ఇస్తామన్నారు. తీరా ఏమీ చేయకుండానే అన్నీ ఇచ్చేశామని చెప్పుకుంటున్నారు. ఇందుకు సమాధానం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.   
– వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌  

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తే వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడం తథ్యమని, వెన్నుపోటు పార్టీ కూటమి ఘోర పరాజయం పొందడం ఖాయమని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఏ విధంగా దౌర్జన్యం చేశారో చూశామన్నారు. కార్పొరేషన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఏమేం చేశారో? ఎన్ని దౌర్జన్యాలు చేశారో? ప్రత్యక్షంగా చూశామంటూ ఎత్తిచూపారు. అందుకే రానున్న స్థానిక ఎన్నికల్లో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని పార్టీ నేతలకు ఉద్బోధించారు. ‘కార్యకర్తల కోసం మనం గట్టిగా పని చేయాలి.. అధికార పక్షం వాళ్లు.. చంద్రబాబు ఎంత దౌర్జన్యం చేసినా, మాకు మా నాయకుడు ఉన్నాడు అనే భావన, నమ్మకం మీరు కార్యకర్తల్లో కల్పించాలి. అలా చేస్తేనే, రేపు ఎన్నికల్లో వారు మీకు తోడుగా నిలబడతారు’ అని తేల్చి చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో వైఎస్‌ జగన్‌ సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. వెన్నుపోటు పార్టీ కూటమి రెండేళ్ల పాలనపై ఇప్పటికే ప్రతి ఇంటా చర్చ మొదలైందని.. ప్రజలంతా ఈ పాలనను, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనను పోల్చి చూస్తున్నారని చెప్పారు. స్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు జరపాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని నిర్దేశించారు. స్థానిక ఎన్నికల కోసం ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు. ఈ సమావేశంలో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే.. 


స్థానిక ఎన్నికలు సందేహమే? అయినా సన్నద్ధం
‘స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వాటిని మనం కూడా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఎన్నికలు ఇప్పుడే జరుగుతాయా.. లేదా.. అన్నది తెలియడం లేదు. ఒక వైపు 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని చెబుతున్నారు. ‘సర్‌’ రిపోర్టు కూడా అదే చెబుతోంది. మరో వైపు ఆ 44 లక్షల మందిని కలిపి ఓటర్ల జాబితా తయారు చేస్తున్నారు. అంటే లేని ఓట్లు ఉన్నట్లుగా చూపుతున్నారు. అది చట్ట ప్రకారం నేరం. రెండో వైపు పట్టణ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ అంశం. గతంలో మనం ఇవ్వాలనుకుంటే, కోర్టు కొట్టేసింది. పక్కన తెలంగాణలో కూడా కోర్టు దాన్ని కొట్టేసింది. అయినా దానిపై చంద్రబాబు కావాలని జీవో ఇచ్చి, ఎన్నికలకు వెళ్తున్నాడు. అంటే అక్కడ ఒక స్పష్టమైన ఆదేశాలు ఉన్నా, కావాలని జీవో ఇచ్చి డ్రామా చేస్తున్నారు. ఎందుకంటే కోర్టు కొట్టేస్తుంది కాబట్టి. ఇవన్నీ చూస్తుంటే, చంద్రబాబు అసలు స్థానిక ఎన్నికలు జరుపుతాడా? అని అనుమానం వస్తోంది. అయినా, ఎన్నికలు జరుగుతాయన్న ఆలోచనతోనే మనం సిద్ధం కావాలి. ఆ దిశలో ముందుకు సాగాలి. గట్టిగా పోరాడాలి.

ఇప్పుడు ప్రతి ఇంటా అదే చర్చ
2024 మార్చి 16న ఎన్నికల కోడ్‌ వచ్చింది. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి మనం దాదాపు 30 నెలలుగా ప్రతిపక్షంగా ఉన్నా, గ్రామ స్థాయి వరకు పార్టీని బలంగా నిర్మించుకోగలిగాం. తొలిసారిగా గ్రామ స్థాయిలో కమిటీలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ రెండున్నరేళ్లలో ఇలా ఒక పటిష్టమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో నిర్మించుకోగలిగాం. ఇది ఒక మంచి కార్యక్రమం. చంద్రబాబు రెండున్నరేళ్ల పాలన ఎలా ఉంది? అంతకు ముందు మన పరిపాలన ఎలా ఉంది? అన్న దానిపై ఈరోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. 

చంద్రబాబు పాలన లో వంచన, దగా..
ఈ రెండున్నరేళ్ల చంద్రబాబు పాలన చూస్తే.. అంతా మోసం, దగా కనిపిస్తోంది. గత ఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నారు? జగన్‌ ఇచ్చేవి కాకుండా, అంతకు మించి ఇస్తామన్నాడు. అమ్మ ఒడి మనం ఒకరికి ఇస్తే, ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఆ పథకం ఇస్తానన్నాడు. ప్రతి ఇంటికి బాండ్లు పంపారు. చంద్రబాబు, పవన్‌ ఇద్దరూ దానిపై సంతకాలు చేశారు. ఏ పథకం ద్వారా ఆ ఇంట్లో ఎంత లబ్ధి కలుగుతుంది.. అని లెక్కలు చెప్పి నమ్మించారు. మన కంటే మూడింతలు ఎక్కువ ఇస్తామన్నారు. మనం చేయూత కింద ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఇచ్చాం. పలు మల్టీ నేషనల్‌ కంపెనీలు తెచ్చి అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడ్డాం. చంద్రబాబు ఏం చెప్పారంటే.. ఇంట్లో 50 ఏళ్లు నిండిన వారుంటే నెలకు రూ.4 వేల చొప్పున ఏటా రూ.48 వేలు ఇస్తామన్నాడు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున, ఏటా రూ.36 వేలు ఇస్తామన్నాడు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. అలా అన్నీ ఇస్తామని చెప్పి నమ్మించి, తర్వాత మోసం చేశారు. ప్రజలు దాన్ని గుర్తించారు. అందుకే ఈ రోజు ప్రతి ఇంట్లో వాటిపై చర్చ జరుగుతోంది. ఒకవైపు అన్నీ వైఫల్యాలు. మరో వైపు అరాచక పరిస్థితి. యథేచ్ఛగా రెడ్‌బుక్‌ అమలవుతోంది. స్కూళ్లు నాశనం అయ్యాయి. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశారు. ఈ పథకం ద్వారా వైద్య సేవలు అందడం లేదు. విద్య, వైద్య రంగాలు మొత్తం నాశనం అయ్యాయి. మహిళలకు సున్నా వడ్డీ రుణాలకు మంగళం పాడారు. ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. అరెస్టులు.. భయపెట్టి లొంగ దీసుకునే పరిస్థితి.

సమావేశానికి హాజరైన పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు 

కార్యకర్తల్లో నమ్మకం కలిగించాలి..
ప్రస్తుతం ప్రజలు మన వైపు ఉన్నారు. కార్యకర్తల కోసం మనం గట్టిగా పని చేయాలి. అధికార పక్షం వాళ్లు ఎంత దౌర్జన్యం చేసినా, మా నాయకుడు నాతో ఉన్నాడన్న నమ్మకాన్ని మీరు కార్యకర్తలకు కల్పించాలి. అలా చేస్తేనే, రేపు ఎన్నికల్లో వారు మీకు తోడుగా నిలబడతారు. స్థానిక సంస్థల పదవులకు సంబంధించి ప్రత్యక్ష ఎన్నికలకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. అది ఒక విధంగా మంచిదే. ఒక బలమైన అభ్యర్థి అక్కడ నిలబడితే, మిగిలిన స్థానాలపై అతడు దృష్టి పెట్టొచ్చు. పోటీలో గట్టిగా నిలబడతాడు. ఆ బలమైన అభ్యర్థి.. మిగిలిన చోట్ల బలాన్ని ఇవ్వాలి. అలాగే అతడు సూపర్‌విజన్‌ కూడా చేయాలి. అలా చేయగలిగితే, మనం ఎన్నికల్లో గట్టిగా నిలబడతాం. అంతే కాకుండా పార్టీ నుంచి ఇతర ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ, బలం లాభిస్తుంది.

ఈ విభాగాలు.. ఈ పనులు చాలా ముఖ్యం
ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే/ఇన్‌చార్జ్‌ లీగల్‌ సెల్, మీడియా సెల్‌ తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు దౌర్జన్యం చేస్తాడు. మన పార్టీ వారిని వేధిస్తాడు. కాబట్టి మన క్యాడర్‌ను, కార్యకర్తలను కాపాడుకోవాలి. అందు కోసం మీరు మంచి టీమ్‌తో లీగల్‌ సెల్‌ను పక్కాగా ఏర్పాటు చేసుకోవాలి. అదే విధంగా మీడియా సెల్‌ కూడా పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మీరు ప్రెస్‌ మీట్స్‌ (మీడియా సమావేశాలు)లో తరచూ మాట్లాడాలి. మనం చేసిన మేలు, సంక్షేమం చెబుతూ పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలి. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలి. కాబట్టి తప్పనిసరిగా మీడియా సెల్స్‌ ఏర్పాటు చేసుకోవాలి. అదే విధంగా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను బాగా ఉపయోగించుకోవాలి. ఎలా ఎక్కౌంట్‌ ఓపెన్‌ చేయాలి.. ఎలా యాక్టివేట్‌ చేయాలి.. ఎలా నడిపించాలనే దానిపై శిక్షణ ఇవ్వాలి. 

ఎందుకంటే ఇప్పుడు మనం పూర్తిగా దిగజారిపోయిన నెగటివ్‌ మీడియా ఈనాడు, ఏబీఎన్‌ తదితర వాటితో పోరాడుతున్నాం. మీకు మీరుగా బలంగా ఎదిగేందుకు, మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు, పార్టీ ఇంకా బలంగా మారడానికి మీరు తప్పనిసరిగా లీగల్‌ సెల్, మీడియా సెల్, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను పక్కాగా ఏర్పాటు చేసుకోవాలి. మీరు నియోజకవర్గ స్థాయిలో పని చేస్తూ.. జిల్లా స్థాయి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలి. ఇప్పటి వరకు దీంట్లో యాక్టివ్‌గా లేని వారు వెంటనే వాటిని ఏర్పాటు చేసుకోవాలి. ఇక రెండో అంశం.. ఇంటింటా ప్రచారం. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ఇంటింటికీ వెళ్లాలి. మన ప్రభుత్వ హయాంలో ఎలాంటి మంచి చేశామనేది చెప్పాలి. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం చేసిన దగా, వంచన గురించి వివరించాలి. మరో వైపు బలమైన అభ్యర్థి నిలబడాలి. ఆ అభ్యర్థి అందరినీ కలుపుకుపోవాలి. ఎక్కడా ఇగోకు వెళ్లొద్దు. ఎందుకంటే ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటు ఎంతో కీలకం. కేవలం 9 ఓట్లతో ఓడిన వారు, గెల్చిన వారు కూడా ఉన్నారు. 

జో జీతా వహీ సికందర్‌
ఎన్నికల్లో గెలుపు ముఖ్యం. ఎందుకంటే.. జో జీతా వహీ సికందర్‌ (గెలిచిన వారే రాజు). కాబట్టి వచ్చే 60, 70 రోజులు మీరు మీ నియోజకవర్గాలు దాటి వెళ్లొద్దు. అందరినీ కలవండి. వ్యవస్థలు పక్కాగా ఏర్పాటు చేసుకొండి. అన్యాయం చేస్తే వదిలి పెట్టబోమని పోలీసులకు కూడా గట్టిగా చెప్పండి. చూస్తుండగానే మూడో ఏడాదిలోకి వచ్చాం. కాబట్టి వచ్చేది మన ప్రభుత్వమే. ఆ తర్వాత మీరు ఎక్కడున్నా, రిటైర్‌ అయినా వదిలిపెట్టబోమని చెప్పండి. వారిలో న్యూట్రాలిటీ (తటస్థ వైఖరి) తీసుకురావడానికి ప్రయత్నించండి. అప్పటికీ వారు మారకపోతే వారి వివరాలు డిజిటల్‌ డైరీలోకి ఎక్కించండి’ అని వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు.  

మీ పాత్ర చాలా కీలకం
ప్రతి చోటా అభ్యర్థుల ఎంపిక ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. పార్టీ కోసం గట్టిగా పని చేసే వారిని ఎంపిక చేయండి. రిజర్వేషన్ల ఖరారు తర్వాత, మారితే చూడొచ్చు. అంతేకానీ, అప్పుడు అభ్యర్థుల కోసం వెతికితే అంతగా ప్రయోజనం ఉండదు. జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలో మీరు స్వయంగా హాజరై గుర్తింపు కార్డులు, మెటీరియల్‌ పంపిణీ చేయాలి. వాటికి సంబ«ంధించి, తగిన విధంగా నిర్దేశం చేయాలి. ప్రతిచోటా మీ ప్రమేయం ఉండాలి. స్థానిక ఎన్నికల్లో పార్టీతో పాటు, అభ్యర్థి కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే వారిపై ప్రజలకు ఎక్కువ దృష్టి ఉంటుంది. అందుకే అందరికీ ఆమోద యోగ్యమైన వారిని ఎంపిక చేయాలి. వీలైనంత వరకు అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం వచ్చేలా చొరవ చూపాలి.

ప్రతి చోటా పోటీ చేయాలి
ఎక్కడా ఏకగ్రీవం ఉండకూడదు
మీ నియోజకవర్గాల్లో.. ఎక్కడా కూడా మన పార్టీ అభ్యర్థి పోటీ చేయని పరిస్థితి రాకూడదు. అలా మన పార్టీ అభ్యర్థి నిలబడకుండా, పోటీలో లేకుండా ఉంటే, అక్కడ ఏకగ్రీవ ఎన్నిక జరిగితే నన్ను అడగాల్సిన పని లేదు. మీరు ఆ తర్వాత ఎన్నికల్లో నిలబడరు. అంటే, టికెట్‌ దక్కదు. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా, స్థానిక ఎన్నికల్లో ప్రతిచోటా మనం అభ్యర్థులను నిలపాలి. మన కార్యకర్తలకు తోడుగా నిలబడాలి. పోరాడాలి. అప్పుడే వారు ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో మీకు తోడుగా ఉంటారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ రూపొందించిన మెటీరియల్‌ (బుక్‌లెట్‌) ‘వెన్నుపోటు పార్టీ – వెన్నుపోటు పాలన’ అనేది ప్రతి ఊళ్లో, ప్రతి ఇంటికి వెళ్లాలి. మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా చెప్పాలి. ఇవన్నీ మీ ద్వారానే పార్టీ కొనసాగిస్తుంది. ఈ ప్రక్రియ ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఇంకా గుర్తింపు కార్డులు సిద్ధం అవుతున్నాయి. దాదాపు 15 లక్షల కార్డులు రెడీ అవుతున్నాయి. జిల్లా, నియోజకవర్గాలు, మండల స్థాయిలో ఆ కార్డుల పంపిణీ జరుగుతుంది. బుక్‌లెట్‌ మెటీరియల్‌ కూడా మీకు అందుతుంది. ఇవన్నీ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా అందుబాటులో ఉంటాయి కాబట్టి.. ప్రతి ఒక్కరూ తమ మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

ఐదు అంశాలతో సంస్థాగత సమావేశాలు
1.    చంద్రబాబు పాలన వైఫల్యాలు
2.    మన ఐదేళ్ల పాలన, సంక్షేమం, సంస్కరణలు, ప్రజలకు చేసిన మేలు
3.    కేడర్‌ను మోటివేట్‌ చేసి, ఎన్నికలకు సిద్ధం చేయడం
4.    ఐడీ కార్డుల పంపిణీ
5.    మండల, గ్రామ, వార్డు స్థాయిలో ఇంటింటా ప్రచారం సంస్థాగత సమావేశాల షెడ్యూల్‌
సెప్టెంబరు 5, 6, 7 తేదీల్లో జిల్లా స్థాయి సమావేశాలు ఉంటాయి. ఇందులో పార్టీ జిల్లా స్థాయి నాయకులు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్‌్జలు, జిల్లా స్థాయిలో అన్ని కమిటీల ఇన్‌ఛార్‌్జలు, పార్టీ సీనియర్‌ నాయకులు, జెడ్పీ ఛైర్మన్లు, మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్లు పాల్గొంటారు.
⇒ సెప్టెంబరు 8, 9, 10, 11 తేదీల్లో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో సమావేశాల నిర్వహణ. వీటిలో నియోజకవర్గ స్థాయి పార్టీ నేతలు, ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు.
⇒ సెప్టెంబర్‌ 12 నుంచి 22 వరకు మండల, వార్డు స్థాయి సమావేశాలు జరుగుతాయి. ఇందులో గ్రామ, వార్డు స్థాయి నుంచి కూడా నాయకులు పాల్గొంటారు. ఆ తర్వాత ఇంటింటి ప్రచారం. అంటే సెప్టెంబర్‌ 23 నుంచి ఆ కార్యక్రమం కొనసాగుతుంది. అక్కడ ‘వెన్నుపోటు పార్టీ – వెన్నుపోటు పాలన’ బుక్‌లెట్‌ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ విలేజ్‌ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు అందరూ పాల్గొంటారు.  

మన పాలనలో విప్లవాత్మక మార్పులు
మేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్‌లా భావించి 99 శాతం అమలు చేశాం. పూర్తి పారదర్శకతతో పాలించాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి, ఇంటి గడప వద్దే ప్రభుత్వ సేవలు అందించాం. ఎక్కడా అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ పథకాలు అందించాం. దేవుడి దయ వల్ల ఆ విధంగా ఒక గొప్ప పాలన ఇవ్వగలిగాం. ఎన్నికల్లో ఒక మాట చెబితే, ఒక విషయాన్ని మేనిఫెస్టోలో పెడితే, దాన్ని తూ.చ తప్పకుండా అమలు చేపి చూపాం. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నప్పుడే, ఒక షెడ్యూల్‌ ప్రకటించి పథకాలు అమలు చేశాం. ఇది ఒక్క వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని గర్వంగా చెప్పగలుగుతాం.

⇒ సంస్కరణలు, మార్పులు కళ్లెదుట కనిపిస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో నాడు–నేడు ద్వారా పూర్తి మార్పులు చేశాం. 6వ తరగతి నుంచి డిజిటల్‌ బోర్డులు, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చాం. మూడో తరగతి నుంచే టోఫెల్‌ శిక్షణ. ఇంకా బైజూస్‌ కంటెంట్‌.
⇒ గ్రామ స్థాయిలో చూస్తే ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. గ్రామంలో విలేజ్‌ క్లినిక్స్‌. ఆరోగ్యశ్రీలో 3,300కు పైగా ప్రొసీజర్లు. రూ.25 లక్షల వరకు ఫ్రీ ట్రీట్‌మెంట్‌. నాడు దేశంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 60 శాతం స్పెషలిస్టుల కొరత ఉంటే, మన దగ్గర అది కేవలం 4 శాతం మాత్రమే. ఆ స్థాయిలో ఆస్పత్రుల్లో నియామకాలు జరిపాం. మన హయాంలో ఆస్పత్రుల్లో జీరో వెకెన్సీ.

⇒ వ్యవసాయంలోనూ ఎన్నో మార్పులు తెచ్చాం. ప్రతి ఎకరాకు ఈ–క్రాప్‌ చేశాం. ఉచిత పంటల బీమా అమలు చేశాం. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ప్రతి అడుగులో రైతులకు తోడుగా నిలబడ్డాయి. ప్రతి పంటకు కచ్చితమైన గిట్టుబాటు ధర కల్పించాం. సీఎం–యాప్‌ ద్వారా పంటల ధరలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసి, జేసీ స్థాయి అధికారితో మార్కెట్‌లో జోక్యం చేసుకున్నాం. తద్వారా పంటల కొనుగోలులో పోటీ ఏర్పడి, రైతులకు మేలు జరిగింది. అలా ఐదేళ్లలో రూ.7,800 కోట్లతో పంటల కొనుగోలు చేశాం.
⇒ సుపరిపాలన, మహిళా సాధికారత, విద్య, వైద్యంలో ఎప్పుడూ చూడని మార్పులు. కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్‌ హార్బర్లు. కర్నూలు, విశాఖలో కొత్త ఎయిర్‌పోర్టులు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో అత్యుత్తమ వైద్య సేవలందించాం. డయాలసిస్‌ సేవలు. కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌. ఆస్పత్రి ఏర్పాటు చేశాం. రూ.600 కోట్లతో మంచినీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేశాం. అలా ప్రతి సమస్యకు పరిష్కారంగా శాశ్వత చర్యలు చేపట్టాం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement