కరువు కాటుకు మూగజీవాల బలి! | Farmers are selling their cattle due to lack of fodder | Sakshi
Sakshi News home page

కరువు కాటుకు మూగజీవాల బలి!

Aug 26 2026 5:19 AM | Updated on Aug 26 2026 5:19 AM

Farmers are selling their cattle due to lack of fodder

కరువు పరిస్థితుల్లో మేత పెట్టలేక అనంతపురంలోని మార్కెట్‌ యార్డ్‌లో జరిగిన సంతలో విక్రయించేందుకు తెచ్చిన మూగజీవాలు

పచ్చిమేత లేదు.. ఎండుమేత దొరకడం లేదు.. భారంగా మారిన పశుపోషణ

మేత దొరక్క.. ప్రాణప్రదమైన పశువులను అమ్మేస్తున్న రైతులు 

కర్నూలు, అనంతపురం, చిత్తూరు, మార్కాపురం ప్రాంతాల్లో పెరిగిన పశువుల విక్రయాలు 

కేరళ, కర్ణాటక, తెలంగాణ, బెంగాల్‌లకు పశువుల తరలింపు 

రెండు నెలలుగా చినుకు జాడ లేదు.. రాయలసీమలో తీవ్ర వర్షాభావం 

మొలకలోనే ఎండుతున్న పంటలు.. రిజర్వాయర్ల కింద కూడా సాగు ప్రశ్నార్థకం 

రైతును ఆదుకునేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోని చంద్రబాబు సర్కార్‌..

సాక్షి ప్రతినిధి, కర్నూలు: కరువు రాయలసీమ రైతు బతుకును ఛిద్రం చేస్తోంది. పొలంలో పంట లేదు.. పశువులకు మేత లేదు.. చేతిలో డబ్బు లేదు. ఏళ్ల తరబడి కుటుంబ సభ్యుల్లా చూసుకున్న ఎద్దులు, ఆవులు, గేదెలను కళ్లముందే ఇతరులకు అమ్ముకోవాల్సిన దుస్థితి రైతులది. పశువులను అమ్మాలని కాదు.. వాటిని బతికించలేక అమ్ముకుంటున్నాం అంటున్నారు రైతులు. రెండు నెలలుగా చినుకు జాడ లేక, సాధారణ వర్షపాతంలో 30 శాతం కూడా నమోదు కాక, పచ్చిమేత మాట అటుంచితే ఎండుగడ్డి కూడా దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో కర్నూలు, అనంతపురం, చిత్తూరు, మార్కాపురం ప్రాంతాల్లోని సంతలకు పశువులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నాయి. 

రైతుల ఆవేదనకు ఈ పశువుల అమ్మకాలు అద్దం పడుతున్నాయి. అమ్ముడైన పశువులు తెలంగాణ, కర్ణాటక, కేరళ తదితర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. కరువు పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తీవ్రకరువు పరిస్థితుల్లోనూ ప్రభుత్వం స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

మేత లేక అమ్ముకుంటున్నాం 
పది ఎకరాల్లో పత్తి, మూడెకరాల్లో ఆముదం, ఉల్లి పంటలు వేశాం. సరైన వానల్లేవు. పత్తి పంట మొత్తం ఎండిపోయింది. పశువులకు మేత కూడా లేదు. ట్రాక్టర్‌ వరిగడ్డి రూ.18వేలు అమ్ముతున్నారు. అది కూడా దొరకడం లేదు. మనుషులం గంజైనా తాగి బతుకుతాం. మేత లేకపోతే పశువులు ఎలా బతుకుతాయి. వాటి బాధ చూడలేక తప్పనిసరి పరిస్థితుల్లో కాడెద్దులు అమ్ముకోవాల్సి వస్తోంది.  – గోవిందు, రైతు, పులకుర్తి, కోడుమూరు మండలం, కర్నూలు జిల్లా  

పంట పోయింది.. పశువుల మేతా పోయింది
ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో పంటలు సాగుకునోచుకోలేదు. అరకొర వర్షాలతో కొన్నిచోట్ల మొక్కుబడిగా పంటలు సాగుచేసినా మొత్తానికి పంటలసాగు 40 శాతానికి మించలేదు. మార్కాపురం, కడప లాంటి జిల్లాల్లో 20 శాతం కూడా పంటలు సాగుకాలేదు. అరకొరగా సాగైన వేరుశనగ, కంది, ఆముదం, పత్తి పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. కృష్ణాజలాలు వస్తాయని నమ్ముకొని కొంతమేర సాగుచేసిన వరిపంట ఎండుతోంది. దీంతో  పశువులకు గ్రాసం దొరికేపరిస్థితి లేకుండా పోయింది. సీమ వ్యాప్తంగా లక్షలాది ఎద్దులు, ఆవులు, బర్రెలు,  కోట్లాది గొర్రెలు, మేకలతోపాటు పలురకాల మూగజీవాలు గ్రాసంకోసం అల్లాడిపోతున్నాయి.

ఒక్కొక్క ఎద్దు లేదా బర్రెకు రోజుకు 5 కిలోల ఎండుగడ్డి లేదా 15 కిలోల పచ్చిగడ్డి అవసరమవుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో ఆ స్థాయిలో గ్రాసం అందుబాటులో లేదు.  గ్రాసంలేక కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో రైతులు పశువులను సంతలకు తెచ్చి తెగనమ్ముకుంటున్నారు. తక్కువ ధరలకే విక్రయించి నష్టపోతున్నారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, పత్తికొండ, అనంతపురం జిల్లా కదిరి,గోరంట్ల ఇతర ప్రాంతాల్లోని సంతలకు పశువులు వేలాదిగా తరలివస్తున్నాయి. నెలరోజులుగా పశువుల విక్రయాలు పెరిగాయని సంత నిర్వాహకులు చెపుతున్నారు. కొన్న పశువులను వ్యాపారులు కేరళ, కర్ణాటక, తెలంగాణ, కోల్‌కతా ప్రాంతాల్లోని కబేళాలకు ఎగుమతి చేస్తున్నారు. 

ఎటు చూసినా కరువే.. 
కర్నూలు జిల్లాలో.. కరువు తీవ్రతతో ఎమ్మిగనూరు, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, నియోజకవర్గాల నుంచి నిత్యం పశువులు తరలిపోతున్నాయి. నంద్యాల జిల్లాలోనూ వరిసాగులేకపోవడంతో గ్రాసం దొరికే పరిస్థితులు లేక రైతులు పశువులను విక్రయిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ తీవ్ర కరువుపరిస్థితులు నెలకొన్నాయి. వేరుశనగ, కంది పంటలు ఎండిపోయాయి. 

బోర్లకింద సాగుచేసిన వరిపంట ఎండిపోవడంతో  లక్షలాది పశువులకు గ్రాసం దొరక్క సంతలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రధానంగా మార్కాపురం జిల్లా పూర్తిగా కరు­వు బారినపడి పంటలసాగు లేకుండా పోయింది. దీం­తో గ్రాసం దొరక్క లక్షలాదిగా ఉన్న ఎద్దులు, బర్రెలు, గొర్రెలు, మేకలను తెగనమ్ముకుంటున్నారు. సీమ జిల్లా­ల్లో ఎద్దులు, ఆవులు 15 లక్షల పైగా ఉండగా బర్రెలు 18.75 లక్షలు, గొర్రెలు, మేకలు కోట్లలోనే ఉన్నాయి. 

ఎన్నడూ లేని కరువు 
గతంలో ఎన్నడూ లేని కరువు ఇది. వానా కాలం వచ్చి మూడు నెలలు అవుతున్నా ఇంత వరకు పదునైన వాన లేదు. ఉన్న ఐదెకరాల్లో కంది పంట వేశా. వానల్లేక పంట చేతికందే పరిస్థితి లేదు. మేత లేక పశువులు అల్లాడి పోతున్నాయి. పశుపోషణ భారమై అమ్ముకుంటున్నాం. గతంలో మహా అంటే 20, 25 రోజులు బెట్ట ఉండేది. పశువులను కాపాడుకునేందుకు బోదగడ్డి, జానాకు వంటివి తెచ్చి వేసేవాళ్లం. వానల్లేక ఇప్పుడు అది కూడా లేదు. – గోకారి, రైతు, పి.కోటకొండ, దేవనకొండ మండలం, కర్నూలు జిల్లా

మూడు ఎకరాల్లో  పత్తి అంతా పోయింది
మూడు ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంట అంతా ఎండిపోయింది. ఎకరాకు రూ.50వేలకు పైగా పెట్టుబడి పెట్టాను. కోడుమూడు ప్రాంతంలో వర్షం అంతంత మాత్రమే కురిసింది. వేసిన పంట ఎండిపోయి పశువులకు మేత లేకుండా పోయింది. అందుకే అమ్ముకొంటున్నా. – వెంకటేష్, చిల్లబండ, కర్నూలు జిల్లా

మేత లేక అమ్మేస్తున్నా
నాకు నాలుగు ఎద్దులున్నాయి. పొలం గుత్తకు తీసుకొని పత్తి సాగు చేశా. వర్షాలు కురవక పంట వాడుముఖం పట్టింది. కరువు కారణంగా ఎద్దులకు గ్రాసం కూడా పెట్టలేని స్థితిలో వున్నా. వాటి పోషణ భారమై  రెండు ఎద్దులను అమ్ముకొనేందుకు సంతకు తీసుకొచ్చా.      – నర్సప్ప, రైతు, జగ్గాపురం నందవరం మండలం, కర్నూలు జిల్లా

ఎద్దులను అమ్ముకొని వలసపోతున్నాం
ఉన్న ఎద్దులకు మేతలేక, మేపలేక అమ్ముకొనేందుకు సంతకు తీసుకొచ్చా. నాకైతే పొలం కూడా లేదు. ఎవరైనా పొలం పనులకు పిలిస్తే ఎద్దులను బాడుగకు తీసుకొనిపోయేవాడిని. వర్షాలు లేకపోవడంతో పంటలు లేవు. వ్యవసాయ పనులకు పిలిచే రైతుల్లేరు. అందుకే కుటుంబంతో పాటు వలస వెళ్లాలనుకుంటున్నా. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పత్తి పంటలు బాగున్నాయంటున్నారు. అక్కడికి పోవాలని ఆలోచిస్తున్నాం. – మాదన్న, గోనెగండ్ల, కర్నూలు జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement