విజయనగరం: హాస్టల్‌లో ఉంటూ చక్కగా చదువుకోవాల్సిన బాలికలను ఓ హాస్టల్ వార్డెన్ తన బంధువుల పెళ్లికి తీసుకెళ్లి.. అక్కడ నృత్యాలు చేయించడం వివాదాస్పదంగా మారింది. బాలికల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ వార్డెన్ తీరుపై మండిపడుతున్నారు. రాజాం పట్టణంలోని సారథి టైప్–4 కేజీబీవీ హాస్టల్‌కు చెందిన కొంతమంది బాలికలను హాస్టల్ వార్డెన్ సారధిలోని తమ బంధువుల పెళ్లి వేడుకకు ఈ నెల 24న తీసుకెళ్లారు. వధూవరుల ఊరేగింపులో బాలికలతో నృత్యప్రదర్శనలు చేయించినట్టు తెలిసింది.
తమ పిల్లలను బాగా చదివించుకోవాలని హాస్టల్‌లో చేర్పిస్తే వార్డెన్ ఇలా ప్రేవేటు కార్యక్రమాలకు తీసుకెళ్లడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అసలు ప్రైవేటు ఫంక్షన్లకు ఎలా తీసుకెళ్తారని ప్రశ్నిస్తు న్నారు. ఇదే విషయాన్ని సారథి బాలికల హైసూ్కల్ హెచ్‌ఎం మాధురి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా విద్యార్థునులు పెళ్లి ఊరేగింపునకు వెళ్లినవిషయం వాస్తవమేనని అన్నారు. తాను రాత్రి సమయాల్లో ఉండనని, హాస్టల్ వద్ద ఏమి జరుగుతుందో ఎలా తెలుస్తుందని పేర్కొన్నారు. ఇదే విషయంపై ఎంఈఓ యాగాటి దుర్గారావు స్పందిస్తూ ఈ ఘటనపై సమాచారం అందిందని, దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామన్నారు.


