విశాఖలో జబర్దస్త్‌ రేవ్‌.. మద్యం మత్తులో టీడీపీ నేతల కుమ్ములాట | Telugu Desam leaders at a rave party in Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో జబర్దస్త్‌ రేవ్‌.. మద్యం మత్తులో టీడీపీ నేతల కుమ్ములాట

Aug 27 2026 4:40 AM | Updated on Aug 27 2026 4:40 AM

Telugu Desam leaders at a rave party in Visakhapatnam

రేవ్‌ పార్టీ జరిగిన రిసార్టు.. టీడీపీ నేత కత్తితో పొడవడంతో గాయపడిన ఆ పార్టీకే చెందిన వెంకట్‌దినేశ్‌

హ్యాపీ నేచర్‌ రిసార్ట్స్‌లో జబర్దస్త్‌ ఫేమ్‌ నటి బర్త్‌డే వేడుకలు

మహిళల విషయమై రెండువర్గాల ఘర్షణ 

టీడీపీ నాయకుడు వెంకట్‌దినేష్‌ను కత్తితో పొడిచిన మరో నేత చరణ్‌తేజ్‌ .. 

హత్యాయత్నం కేసు నమోదు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖపట్నంలో జరిగిన ఒక రేవ్‌ పార్టీలో తెలుగుదేశం నేతలు.. మహిళల విషయంలో కుమ్ములాటకు దిగారు. ఒక నాయకుడు మరో నాయకుడిని కత్తితో పొడిచారు. ఆనందపురం మండలం శొంఠ్యాంకు సమీపంలోని హ్యాపీ నేచర్‌ రిసార్ట్స్‌లో జబర్దస్త్‌ ఫేమ్‌ నటి పుట్టినరోజు పేరుతో ఈ పార్టీ నిర్వహించారు. మంగళవారం రాత్రి ప్రారంభమైన ఈ పార్టీలో 70 మంది వరకు పాల్గొన్నట్లు తెలుస్తోంది. తెలుగునాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (టీఎన్‌ఎస్‌ఎఫ్‌) పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు రత్నకాంత్, టీడీపీ నేత బొండా రవికుమార్, పలువురు టీడీపీ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు, మహిళా నేతలు పాల్గొన్నట్లు సమాచారం. 

ప్రధానంగా గాజువాకకు చెందిన ఓ మహిళా నేతతోపాటు పలువురు మహిళలు వేడుకల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో 70 వరకు విదేశీ మద్యం సీసాలు వినియోగించినట్లు సమాచారం. మద్యం మత్తులో మహిళల విషయమై రెండువర్గాల మధ్య వివాదం తలెత్తింది. పరస్పరం దాడులకు దిగారు. బుధవారం తెల్లవారుజామున నాలుగుగంటల సమయంలో అరకులో రిసార్టు నిర్వహిస్తున్న టీడీపీ నేత మమ్ముల వెంకట్‌దినేష్‌ను మరో నాయకుడు యర్రా చరణ్‌తేజ్‌ కత్తితో పొడిచారు. ఎడమ భుజం వెనుక తీవ్రగాయమైన దినేష్‌ను విశాఖ విమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం అతడు అక్కడ చికిత్స పొందుతున్నారు. 

కేసు లేకుండా చేసేందుకు యత్నాలు?
తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనపై పోలీసులు బుధవారం సాయంత్రం వరకు స్పందించలేదు. అధికార పార్టీకి చెందినవారే ఈ రేవ్‌ పార్టీలో పాల్గొనడంతో ఘటనను చిన్నదిగా చూపించాలని, రెండువర్గాల మధ్య రాజీచేయాలని ప్రయత్నాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. పొరపాటున కత్తి తగిలి గాయమైందని చెప్పి కేసు నమోదు కాకుండా చూసేందుకు పోలీసులపై ఒత్తిళ్లు వచ్చినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ఆస్పత్రిలో మెడికో లీగల్‌ కేసు (ఎంఎల్‌సీ)గా నమోదు కావడంతో తప్పని పరిస్థితుల్లో ఆనందపురం పోలీసులు.. యర్రా చరణ్‌తేజ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం చరణ్‌తేజ్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. 

మరోవైపు ఘటన జరిగిన హ్యాపీ నేచర్‌ రిసార్ట్స్‌ టీడీపీకి చెందిన మజ్జి శేఖర్‌దని తెలిసింది. ఘటన అనంతరం రిసార్ట్స్‌ను మూసేశారు. పార్టీ, గొడవ వివరాలు బయటకురాకుండా సీసీ ఫుటేజీ మాయం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేడుకలకు ఎలాంటి అనుమతులు తీసుకున్నారు? పార్టీలో మద్యం ఎలా అందుబాటులోకి వచ్చింది? పార్టీలో విదేశీ మద్యం వినియోగానికి అనుమతి తీసుకున్నారా? గొడవకు కారణమేమిటి? ఘటన అనంతరం ఎవరెవరు అక్కడి నుంచి వెళ్లిపోయారు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది.

క్షీణిస్తున్న శాంతిభద్రతలు 
ఇప్పటికే విశాఖలో ఇబ్బడిముబ్బడిగా గంజాయి లభ్యమవుతోంది. గంజాయి మత్తులో రోడ్లపైనే ఘర్షణలు జరుగుతున్నాయి. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఏజెన్సీలో గంజాయి సాగు విస్తరిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో డ్రోన్లతో నిఘా ఉంచి వందల ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశారు. గిరిజనులకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలను పంపిణీ చేసి వారికి ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకున్నారు. 

ఎక్కడికక్కడ పటిష్ట నిఘా ఏర్పాటు చేసి గంజాయి సాగును, సరఫరాను నియంత్రించారు. అయితే చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిఘా పూర్తిగా నిద్రపోతోంది. దీంతో విశాఖ నగరానికి గంజాయి భారీగా వస్తోంది. యువత గంజాయి మత్తులో చిత్తవుతోంది. మరోవైపు ప్రైవేటు రిసార్ట్స్‌ సంస్కృతి పెరిగిపోయి.. ఇటు గంజాయి, అటు విదేశీ మద్యంతో పార్టీలు నిర్వహించడం పెరిగిపోయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement