సోలార్ రూఫ్ టాప్‌ను పెట్టుకోమని ప్రజలకు చెబుతున్న ప్రభుత్వం
కానీ ఇదే విధానంతో విదేశాల్లో కుదేలవుతున్న విద్యుత్ వ్యవస్థ
బంగ్లాదేశ్‌లో 47 శాతం గృహాలపై నిరుపయోగంగా రూఫ్ టాప్
ప్రధాన అవరోధాలుగా నిర్వహణ, సాంకేతిక లోపాలు
రాష్ట్రంలోనూ ప్రభుత్వ కార్యాలయాలపై రూఫ్ టాప్ తప్పనిసరి
ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ను దూరం చేసేందుకు కుట్ర
కేంద్ర సబ్సిడీ రూ.78 వేలు కాగా అదనపు వ్యయం రూ.2 లక్షలు
సాక్షి, అమరావతి: ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఖర్చు తగ్గించుకోమని వినియోగదారులకు ఉచిత సలహా ఇస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. అంతేకాకుండా ‘పీఎం సూర్యఘర్’ పథకం ద్వారా రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌ను ప్రభుత్వ కార్యాలయాలకు తప్పనిసరి చేసింది. మరోవైపు నెట్ మీటరింగ్ బిల్లింగ్ విధానాన్ని టెలిస్కోపిక్‌లోకి మార్చేందుకు సిద్ధమవుతోంది. అయితే అసలు ఈ రూఫ్ టాప్ సోలార్ అనేది ఎంత వరకు ప్రయోజనకరం, ఎవరికి లాభం అనే సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో విదేశాల్లో రూఫ్ టాప్ విఫలం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.
కొనుగోళ్లు ఖరీదే.. పెట్టుబడి ఎక్కువే
రూఫ్‌టాప్ సోలార్ ద్వారా పగటిపూట ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ఇంట్లో వాడుకుని, మిగిలినదాన్ని గ్రిడ్‌కు పంపించవచ్చు. నెట్ మీటరింగ్ కింద డిస్కంలు అదనపు విద్యుత్‌కు యూనిట్‌కు రూ.4.60 చొప్పున చెల్లిస్తాయి. రాత్రి లేదా సోలార్ ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు మాత్రం డిస్కంల విద్యుత్ తీసుకోవాల్సిందే. ఇంతకాలం దీనికి సాధారణ గృహ వినియోగదారుల మాదిరిగానే టెలిస్కోపిక్ విధానంలో స్లాబ్‌ల ప్రకారం బిల్లు వేస్తున్నారు. ఇప్పుడు నాన్ టెలిస్కోపిక్ విధానం వస్తే మొత్తం వినియోగానికి ఒకే రేటు వర్తించే అవకాశం ఉంది. అంటే సోలార్ రూఫ్‌టాప్ వినియోగదారులు డిస్కంల నుంచి తీసుకునే విద్యుత్‌కు అధిక బిల్లు చెల్లించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
3 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు సుమారు రూ.1.80 లక్షలు ఖర్చవుతుంది. బ్యాటరీ, ఇన్వర్టర్, ఇతర పరికరాలు కలిపితే వ్యయం రూ.2 లక్షలు దాటే అవకాశం ఉంది. సోలార్ ప్యానెళ్లపై దుమ్ము, పక్షుల వ్యర్థాలు పేరుకుపోతే విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. అందువల్ల తరచూ శుభ్రం చేయాలి. ప్యానెల్ పగిలినా, ఇన్వర్టర్, ఇతర బాక్సులు దెబ్బతిన్నా మరమ్మతులకు అదనపు ఖర్చు తప్పదు. అంటే ప్రారంభ పెట్టుబడితోపాటు నిర్వహణ వ్యయం కూడా వినియోగదారుడిపైనే పడుతుంది.
ఈ లెక్కన కేంద్ర సబ్సిడీ రూ.78 వేలు కాగా, అదనపు వ్యయం రూ.2 లక్షలు అవుతుందని ప్యానెళ్లు ఏర్పాటు చేసేవారు స్పష్టం చేస్తున్నారు. రోజుకు సుమారు 12 యూనిట్లు, నెలకు సగటున 300 యూనిట్ల వరకు ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వ అంచనా. కానీ వర్షాలు, మేఘావృత వాతావరణం, నీడ తదితర కారణాలతో ఈ ఉత్పత్తి తగ్గవచ్చని ఇంధన రంగ నిపుణులు అంటున్నారు.
ఇతర దేశాల అనుభవమూ హెచ్చరికే: బంగ్లాదేశ్‌లో రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థల పరిస్థితిపై వెలువడిన అధ్యయనాలు.. నిర్వహణ లోపాలు, సాంకేతిక సహకారం కొరత, నాసిరకం పరికరాలు, వినియోగదారుల అవగాహన లేమి వల్ల పెద్ద సంఖ్యలో వ్యవస్థలు పనిచేయడం లేదని వెల్లడించాయి. బంగ్లాదేశ్ మొత్తంలో 47 శాతం గృహాలపై సోలార్ రూఫ్ టాప్‌లు పనికిరాకుండా ఉండగా, ఢాకాలో డీపీడీసీ పరిధిలో ఏర్పాటు చేసిన వ్యవస్థల్లో దాదాపు 70 శాతం నిరుపయోగంగా ఉన్నట్లు స్పాట్ సర్వేలు పేర్కొన్నాయి. అంటే కేవలం ప్యానెళ్లు ఏర్పాటు చేయడం కాదు.. అవి నిరంతరం పనిచేసేలా చూడటమే అసలు సవాలన్నది స్పష్టమవుతోంది.
‘ప్రోత్సాహం’ పేరుతో బాదుడు..
రూఫ్‌టాప్ సోలార్‌ను విస్తరించి ప్రతి ఇంటినీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చాలన్నది తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు చెప్పుకుంటున్నారు. కానీ మరోవైపు నెట్ మీటరింగ్ బిల్లింగ్ విధానంలో మార్పులు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు రూఫ్‌టాప్ సిస్టమ్ అమర్చిన అనంతరం వారికి ఇప్పుడు ఇస్తున్న ఉచిత విద్యుత్ దూరమవుతుంది. సోలార్ పెట్టుకున్న వారికి ఉచిత, రాయితీ విద్యుత్ ప్రయోజనాలు కూడా దూరమైతే వారు అత్యధిక ధర చెల్లించి విద్యుత్ తీసుకోవాల్సి వస్తుంది. సోలార్ పెట్టుకోమని ప్రోత్సహించి.. చివరికి అదే వినియోగదారుడిపై అధిక బిల్లుల భారం మోపడమేమిటనే ఆందోళన వినియోగదారుల నుంచి వ్యక్తం అవుతోంది.


