పోలీసులపై కోపంతో కరెంటు పోలెక్కిన మందుబాబు
కరెంటు పోలు చివరికంటా ఎక్కి ధీమాగా వైర్లు పట్టుకు కూర్చున్న ఇతను జలాలుద్దీన్. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణం అర్బన్ కాలనీకి చెందిన ఇతను.. బుధవారం పట్టపగలే పూటుగా మందేసి, దర్గా దగ్గరున్న పోలీసుల దగ్గరకొచ్చాడు. నా సమస్య చెబుతా వినండన్నాడు.
మందు మత్తులో ఉన్నాడని పోలీసులు లైట్‌గా తీసుకున్నారు. దీంతో కోపగించిన జలాలుద్దీన్.. ‘నా సమస్య వినరా..? నేను హర్ట్ అయ్యాను’’ అంటూ ఇదిగో ఇలా కరెంటు పోలెక్కాడు. వెంటనే అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అక్కడే దర్జాగా కూర్చొన్నాడు. చివరకు సీఐ రాఘవన్ వచ్చి అతన్ని బుజ్జగించి, కిందకు దింపాడు. నీ సమస్యేమిటని అడిగితే సరిగా చెప్పలేకపోయాడు. దీంతో పోలీసులు అతన్ని స్టేషన్‌కు తీసుకెళ్లారు. – పెనుకొండ రూరల్


