ఏపీలో ప్రస్తుత సచివాలయంలో సుమారు మూడువేల మంది పనిచేస్తుంటారు. పోనీ ఏ రకంగా చూసినా ఐదువేల మంది మించి ఉండరు. కాని అమరావతి రాజధానిలో సచివాలయం కోసం చేపట్టిన భారీ టవర్లలో 16వేలమంది పని చేయవచ్చట. అంత పెద్ద టవర్లు ఏం చేస్తారు? ఈ సందేహం ఏ సామాన్యుడికైనా వస్తుంది? కాని అంతర్జాతీయ మీడియాగా పేరొందిన న్యూయార్క్ టైమ్స్‌కు రాకపోవడమే విచిత్రం అనిపిస్తుంది.
ఈ మీడియా అమరావతిపై ప్రత్యేక వ్యాసం ప్రచురించింది. దానిని తెలుగుదేశం పత్రికలు ప్రముఖంగా ప్రచారంలోకి తెచ్చాయి. ఆంధ్రజ్యోతి అయితే అమరావతి.. అనితర సాధ్యం అన్న శీర్షికన ఈ వ్యాస కథనాన్ని అందించింది. ఒక అంతర్జాతీయ మీడియా అమరావతికి సంబంధించి మంచి, చెడు లేదా లాభ, నష్టాలు రెండూ ఇస్తే ఎవరూ తప్పు పట్టనక్కర్లేదు. కానీ, ఆ వ్యాసం చదివితే ఇంత పెద్ద మీడియా సంస్థలు కూడా ఏకపక్షంగా కథనాలు ఇస్తాయా? అమెరికాలో కూడా పత్రికా ప్రమాణాలు దిగజారి ఉంటాయా అన్న సందేహం కలుగుతుంది.
మోస్ట్ లివబుల్ సిటీ అమరావతి అని ఈ వ్యాసానికి శీర్షిక పెట్టారు. వినడానికి ఎంత బాగుంది. అమరావతిలో నివసిస్తే ఓ పాతికేళ్లు అధికంగా బతకవచ్చని చంద్రబాబు తన ఉపన్యాసాలలో చెబుతున్నారు. అది నిజమే అయితే అంతా సంతోషిస్తారు. కానీ, ఈ వ్యాసం వచ్చిన కొద్ది రోజులకే, చంద్రబాబు స్పీచ్ ఇచ్చిన కొన్నాళ్లకే జరిగిన శాసనసభ సమావేశాలలో ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే టీడీపీ ఎమ్మెల్యే శ్రావణకుమార్ ఏమి చెప్పారో తెలుసా! అమరావతిలో గ్రామాల ప్రజలు నానా పాట్లు పడుతున్నారని, సరైన రోడ్లు లేవని, ఇతర వసతులు లేవని, రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం ఉండడం లేదని ఆయన వాపోయారని వార్తలు వచ్చాయి. మంత్రులు నిధులు కేటాయించినా పనులు జరగడం లేదని ఆయన వాపోయారు.
న్యూయార్క్ టైమ్స్ మీడియా ప్రతినిధులు నిజంగా ఈ ప్రాంతాన్ని సందర్శించే రాశారా? లేక ప్రభుత్వానికి సంబంధించి ఎవరైనా రాసిచ్చిన దానిని ముద్రించారా అన్నదానిపై కొందరికి డౌట్లు ఉన్నాయి. కారణం ఏమిటంటే ఏ వ్యాసం రాసినా పాజిటివ్, నెగిటివ్ రెండూ ఉంటాయి. కానీ, ఇందులో పూర్తిగా ఏకపక్షంగా పాజిటివ్ వ్యాఖ్యలే కనిపిస్తాయి. ఇది పెయిడ్ ఆర్టికిల్ వంటిదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. దానిని కూడా పట్టించుకోనవసరం లేదు. అయితే ఈ వ్యాసకర్తలు అనుసరించాల్సిన ప్రమాణిక సూత్రాలు పాటించినట్లు కనిపించకపోవడమే అసలు సమస్య.
న్యూయార్క్ టైమ్స్ విలేకరులు అమరావతి సందర్శించడం చంద్రబాబుకు లేదా మంత్రి నారాయణకు తెలియకుండా జరుగుతుందా? పైగా అంతర్జాతీయ మీడియా వారు వస్తుంటే చంద్రబాబు కలవకపోవడమన్నది నిజంగా జరిగితే ఆశ్చర్యమే. ఎందుకంటే మామూలు స్థానిక మీడియాకే విశేష ప్రాధాన్యత ఇచ్చే ముఖ్యమంత్రి అంతర్జాతీయ మీడియా వస్తుంటే ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉంటారా! అమరావతిని ఫలానా పెద్ద మీడియా వారు చూసి వెళ్లారన్న వార్తనే హడావుడి చేసి ఉండేవారు కదా! వారు మంత్రి లోకేష్‌తో మాత్రమే ఎందుకు మాట్లాడారో తెలియదు. సంబంధిత మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను సంప్రదించలేదా? నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయన్నంత వరకు ఆక్షేపణ లేదు. కానీ, వారు అమరావతి గురించి మరీ అతిగా పొగిడారా అన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
ఏపీకి రాజధాని నిర్మాణాన్ని ఎవరూ కాదనడం లేదు. అవసరమైన భవనాలు కట్టుకోవచ్చు. కాని ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు?వారికి ఎంత విస్తీర్ణంలో భవనాలు కావాలి? ఎంత నిర్మిస్తున్నారు? అలా ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉంటుంది కదా! అలా కాకుండా అవసరాన్ని మించి నాలుగైదు రెట్ల అదనంగా నిర్మాణం చేపట్టిన తీరును ప్రశ్నించాలి కదా! అమెరికాలోని కాపిటల్ హిల్స్, ఇతర ప్రభుత్వ భవనాలు ఉన్న విస్తీర్ణం గురించి గూగుల్‌లో అడిగితే వచ్చిన సమాధానం ఇది.. Capitol Hill is a historic residential neighborhood and the legislative center of the United States government in Washington, D.C., covering just under 2 square miles (5 square kilometers).
కాపిటల్ హిల్ అనేది వాషింగ్టన్, డీ.సీ.లోని ఒక ప్రాంతం, ఇది ఈశాన్య మరియు ఆగ్నేయ చతుర్భుజాలలో విస్తరించి ఉంది. బహుశా అన్ని ప్రభుత్వ ఆఫీస్‌లు ఇందులో ఉన్నాయో లేదో తెలియదు. కాని అంత పెద్ద రాజధానిలో కేవలం 5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే ఈ భవనాలు ఉంటే, భారత్‌లో ఒక చిన్న రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుగుతోంది.
మరో ఉదాహరణ చూద్దాం. అమెరికాలో అతి పెద్దదైన రాష్ట్రాలలో ఒకటైన కాలిఫోర్నియా రాజధాని సాక్రమెంటో అనే చోట ఉంది. అక్కడ కేవలం 39 ఎకరాలలో పది బ్లాక్‌లలో ఆఫీస్‌లు ఉన్నాయట. అసెంబ్లీ, ఇతర ప్రభుత్వ ఆఫీస్‌లు అన్నీ కలిపి 4,72,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయని గూగుల్ చెబుతోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అన్ని ఆఫీస్‌లు కలిపి 300 ఎకరాలలోనే ఉన్నాయన్నది ఒక అంచనా. అమరావతిలో ఏభై లక్షలు, అరవై లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు ఎందుకు నిర్మిస్తున్నారు? ఈ విషయాలేవీ న్యూయార్క్ టైమ్స్ ప్రతినిధులకు తెలియవా? అంటే ఏమి చెబుతాం. అమరావతిలో కేవలం సచివాలయానికే, పరిపాలన కార్యాలయాలకు ఐదు టవర్లు, అతి పెద్ద టవర్‌పై అంతస్తులో సీఎం ఆఫీస్, ఆ పైన హెలిపాడ్ ఉంటాయట.
అప్పుల కుప్పగా ఉన్న ఏపీకి ఇంత ఆర్భాటం, అట్టహాసం అవసరమా? దానివల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నలు వేశారో, లేదో తెలియదు. క్వాంటమ్ వ్యాలీ గురించి, ఇతరత్రా చంద్రబాబు చేస్తున్న కృషి గురించి వివరించారు. యధా ప్రకారం లోకేష్ విభజన సమయంలో కట్టుబట్టలతో ఏపీకి తరలివచ్చేశామని కూడా వారికి చెప్పేశారట. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను వదలి ఎందుకు అలా చేయవలసి వచ్చిందన్న ప్రశ్న సహజంగా జర్నలిస్టులకు వస్తుంది. మరి వీరికి ఎందుకు రాలేదో అర్థం కాదు.
ఈ అమరావతి భవనాల నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది? ఏభై వేల కోట్ల అప్పు ఎందుకు సమీకరించారు. ఇంకా మరో 1.75 లక్షల ఎకరాల భూమి సేకరణ అవసరం ఏమిటి? ఆ భూములలో మౌలిక వసతుల కల్పనకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి? ఈ అప్పులు ప్రజలపై భారం కాదా? భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఎప్పటికి ఇస్తారు? వారికి అవసరమైన మౌలిక వసతులకు అయ్యే వ్యయం ఎంత? పూలింగ్‌కు భూములు ఇవ్వని రైతులను వేధించారన్నది నిజమా? కాదా? రైతుల గోడును విన్నారా? లేదా? మూడు పంటలు పండే భూములను ఇలా చేయడం పర్యావరణ విధ్వంసం అవుతుందా? కాదా? వరదపీడిత ప్రాంతంలో రాజధాని ఎలా కడుతున్నారు? ఆ వరదను ఎత్తిపోయడానికి లిఫ్ట్‌లు కట్టడమేమిటి? ఇలాంటి అనేక సందేహాలను వారు ముఖ్యమంత్రి లేదా కీలక మంత్రితో మాట్లాడి నివృత్తి చేసుకుని అన్ని విశేషాలతో వ్యాసం రాసి ఉంటే దానికి విలువ వచ్చేది కదా!అలాకాకపోతే తెలుగుదేశం మీడియాకు, ఈ అంతర్జాతీయ మీడియాకు తేడా ఏముంటుందని కొందరు ఢిల్లీ జర్నలిస్టులు తమ కామెంట్లలో ప్రశ్నించారట. అది న్యాయార్క్ టైమ్స్ మీడియాకు శోభనిస్తుందా!
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


