అన్నా చెల్లెళ్ల పండుగగా చెప్పే ఈ రక్షాబంధన్ పండుగ వెనుక ఎన్నోపౌరాణిక గాథలు, ఆసక్తికర చరిత్ర దాగుంది. ఇది కేవలం హిందువుల పండుగ మాత్రమే కాదు. సర్వమత ఐక్యతకు నిలువెత్తు నిదర్శనం కూడా. ఈ పండుగ కోసమే దేవతను సైతం సృష్టించాడు ఆ బొజ్జ గణపయ్య. అంతేకాదండోయ్ ఈ రాఖీని కేవలం అన్నా చెల్లి, అక్కా తమ్ముడు మాత్రమే కాదు తమ రక్షణ ఇచ్చే వ్యక్తి ఎవ్వరికైనా కట్టొచ్చట. అలాగే భార్య తన భర్తకి కూడా కట్టొచ్చట రాఖీ. ఇదేంటని అని ఆశ్చర్యపోకండి. దాని వెనుకున్న ఆసక్తికర కథలు గురించి ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా సవివరంగా తెలుసుకుందామా.!.
రాఖీ ఎలా ఉండేదో తెలుసా..!
వాస్తవానికి రాఖీలో ఒక తాయెత్తు ఉండేది, ప్రస్తుతం ఆధునిక డిజైన్ల హంగులతో వివిధ రకాలుగా మార్కెట్లో ప్రత్యక్షమవుతున్నాయి. అప్పట్లో ఒక సాధారణ దారంకి పసుపు రాసి ముడులు వేసి, దేవుని ముందు ఉంచి.. మంత్రాలతో శక్తిమంతం చేసేవారు. ఆ తర్వాత సోదరీమణులు తమ అపారమైన ప్రేమకు ప్రతిగా సోదరులకు కట్టేవారు. అందుకే దీనిని 'రక్షాబంధన్' అని పిలుస్తున్నారట.
చూడటానికి సాధారణ దారమే అయినా..బంధం గొప్పతనం తెలిపేదని అంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు. ఆ నేపథ్యంలో సోదరుడి కోసం మిఠాయిలు చేసి మరి నోటిని తీపి చేసి..దీర్ఘాయువుతో చల్లగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించేవారట సోదరీమణులు. అందుకు ప్రతిగా సోదరులు వారికి బహుమతులు ఇచ్చి మరి రక్షగా ఉంటానని వాగ్దానం చేసేవారట.
ఐక్యతకు చిహ్నంగా..
అస్సాం, సిల్హెట్ ప్రాంతాలలో ఆధిపత్యం చెలాయించే ముస్లిం జనాభాను, హిందూ మెజారిటీ ప్రాంతాలైన పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశాల నుంచి వేరు చేయాలని బ్రిటీష్ వాళ్లు కుట్ర పన్నారు. ఈ ఘటన 1905లో చోటు చేసుకుంది. ఆ విభజన కాస్తా సరిగ్గా రక్షాబంధన్ రోజు కావడంతో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ పండుగను ఉపయోగించుకుని అందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
అందుకోసం ఠాగూర్ వారి కుట్రను భగ్నం చేసేలా ఐక్యతకు ప్రతీగా ఒకరికొకరు రాఖీ కట్టకోవాలంటూ వేలాది ప్రజలను గంగానది ఒడ్డుకు ఆహ్వానించారు. ఆ రోజు ఆయన సాధారణ దారాన్ని రెండు వర్గాల మధ్య ఐక్యతకు, సంఘీభావానికి చిహ్నంగా చాలా చాకచక్యంగా ఉపయోగించారు.
భార్య.. భర్తకు రాఖీ కట్టే ఆచారం అప్పటి నుంచే..
ఒకానొకప్పుడు దేవతులు రాక్షసుల మధ్య భీకర యుద్ధం జరిగింది. అయితే ఆ యుద్ధంలో దేవతలు రాక్షసుల చేతిలో ఓడిపోతున్నారు. అది చూసి భయంతో బృహస్పతి వద్దకు రాగా, ఆయన తక్షణమే భార్య సచి దేవితో చేతికి ఓ రక్ష లేదా గొలుసులాంటి దాన్ని పౌర్ణమి నాటి రాత్రి కట్టించుకోమని సూచించారు.
కట్టుకునే మందుకు శ్రావణ పౌర్ణమి రోజున దేవుడు ముందు ఉంచి మంత్రాలతో శక్తిమంతం చేయాలని కూడా చెప్పారట. దాంతో ఇంద్రుడు గురువు చెప్పినట్లు తూచా తప్పకుండా చేసి రాక్షసులపై విజయం సాధించినట్లు పురాణ వచనం. అలా ఆ నాటి నుంచే పురుషులు యుద్ధానికి బయలుదేరేటప్పుడు భార్యలు వాళ్ల మణికట్టుకు ఈ రక్షను కట్టడం ఆచారంగా మారిందట.
ఆ రోజునే సంతోషిమాత..
గణేశుడు, అతని సోదరి మానస ప్రతి ఏడాది రక్షాబంధన్ పండుగను జరుపుకునేవారట. గణేశుడుకి సిద్ధి (అద్భుతమైన) బుద్ధి (విజయం) అనే భార్యలున్న సంగతి తెలిసిందే. ఆయనకు ఆ ఇద్దరు భార్యల ద్వారా శుభ (పవిత్రమైన), లాభ (లాభం) అనే ఇద్దరు కుమారులు కలిగినట్లు పురాణాలు చెబుతున్నాయి.
అయితే గణేశుడు తన సోదరిని ఎల్లప్పుడూ గొప్ప ఆతిథ్యంతో స్వాగతించేవాడు. అలాగే మానస తన ప్రియమైన సోదరుడి వినాయకుడు కోసం ఎల్లప్పుడూ పుష్కలంగా మిఠాయిలు, బహుమతులు తీసుకువచ్చేది. పైగా రాఖీ కట్టే వేడుక అత్యంత వైభవంగా జరిగేది. దాంతో శుభ, లాభ్‌లు చాలా బాధపడేవారట. వారికి సోదరి లేకపోవడం వల్ల, ఈ వేడుకను జరుపుకోలేకపోతున్నాం అని ఆవేదన చెందేవారట.
ఒక రోజు, ఆ బాలురు వినాయకుడి వద్దకు వెళ్లి, తమకు ఒక సోదరిని ప్రసాదించమని కోరారట. సరిగ్గా ఆ సమయానికి నారద మహర్షి కూడా గణేశుడిని దర్శించుకోవడానికి రావడంతో, ఆయన కూడా కుమారుల కోరికను మన్నించమని ఒప్పించారట. చివరికి, అందరి పట్టుదల మేరకు, గణేశుడు తన భార్యల శరీరాల నుంచి వెలువడిన రెండు జ్వాలల ద్వారా ఒక కుమార్తెను సృష్టించాడట. అలా సంతోషిమాత ఆవిర్భావం జరిగిందట.
వినాయకుడి కుమార్తె అయిన సంతోషిమాత అందరి కోర్కెలను తీర్చే కల్పవల్లి, సంతృప్తికి అధిష్టాన దేవతగా ప్రకటించాడట. అలా ఈ పండుగ కోసం ఒక దేవత ఆవిర్భావించడమే గాక పండుకు ప్రాశస్త్యాన్ని, వైభవాన్ని కూడా చాటుతోంది. అంతేగాదు ఇది కేవలం పండుగ మాత్రమే కాదు మన ఐక్యతకు, సత్సంబంధాలకు ప్రతీకగా మారి సర్వమత సౌబ్రాతత్వాన్ని చాటే విశిష్టమైన పండుగగా అలరారోతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పండుగలో భాగమయ్యేలా సోదరుడు లేదా మీకు రక్షగా ఉండే వ్యక్తులతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోండి మరి..!.
(చదవండి: హై‘టెక్’ రాఖీ..! చూడ్డానికి చిన్నవే..సర్‌ప్రైజ్లో మాత్రం..)


