ఏఐ ఆధారిత పోలీస్–సిటిజన్ ఫీడ్‌బ్యాక్ కాల్ సెంటర్
పోలీస్‌స్టేషన్ రిసెప్షన్ నుంచి కేసు దర్యాప్తు వరకు ఆరా
బాధితుల అభిప్రాయాల ఆధారంగా చర్యలు
సాక్షి, హైదరాబాద్: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులతో ఇకపై పోలీసులు మరింత మర్యాదగా, బాధ్యతగా వ్యవహరించాల్సిందే. స్టేషన్‌లో తమకు ఎదురైన అనుభవం ఎలా ఉంది? సిబ్బంది సరిగ్గా స్పందించారా? వెంటనే ఫిర్యాదు స్వీకరించారా? కేసు దర్యాప్తు ఏ దశలో ఉంది? పురోగతిపై సమాచారం అందిస్తున్నారా? వంటి అంశాలపై ఇక నేరుగా బాధితుల నుంచే పోలీస్ శాఖ ఫీడ్‌బ్యాక్ తీసుకోనుంది. పోలీసుల పనితీరును మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పోలీస్–సిటిజన్ ఫీడ్‌బ్యాక్ కాల్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పోలీస్ శాఖ కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఈ వ్యవస్థను ప్రారంభించే అవకాశముంది.
ర్యాండమ్‌గా బాధితులకు ఫోన్లు
పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసిన బాధితుల వివరాల నుంచి ఎంపిక చేసి.. కొందరికి ర్యాండమ్‌గా కాల్ చేయనున్నట్టు సమాచారం. ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కాల్ సెంటర్‌లోని టెలీకాలర్లు బాధితులతో మాట్లాడి వారి అనుభవాన్ని తెలుసుకుంటారు. రిసెప్షన్ వద్ద స్వాగతం మొదలు..దర్యాప్తు పురోగతి, కేసుకు సంబంధించిన సమాచారం అందుతున్న విధానం తదితర అంశాలపై ప్రశ్నలు అడగనున్నారు.
పోలీసులే కాదు.. థర్డ్ పార్టీతో..
ఫీడ్‌బ్యాక్ వ్యవస్థలో అత్యంత కీలకమైన అంశంగా థర్డ్ పార్టీ ఏజెన్సీతో కాల్ సెంటర్ నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది. పోలీస్ సిబ్బందితోనే బాధితులకు ఫోన్లు చేయిస్తే వాస్తవ పరిస్థితులపై పూర్తిస్థాయి ఫీడ్‌బ్యాక్ రాకపోవచ్చనే ఉద్దేశంతో.. స్వతంత్ర ఏజెన్సీ ద్వారా అభిప్రాయాలను సేకరించనున్నట్టు సమాచారం.
ఏఐతో విశ్లేషణ..
బాధితుల నుంచి సేకరించిన ఫీడ్‌బ్యాక్‌ను ఏఐ ఆధారిత వ్యవస్థ ద్వారా విశ్లేíÙంచేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఏ పోలీస్‌స్టేషన్‌పై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి? ఏ అంశంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది? ఏ అధికారి లేదా సిబ్బంది పనితీరుపై పదేపదే ప్రతికూల అభిప్రాయాలు వస్తున్నాయి? వంటి అంశాలను గుర్తించే అవకాశం ఉంటుంది.
ఫీడ్‌బ్యాక్ ఆధారంగా చర్యలు...
బాధితుల అభిప్రాయాలు కేవలం రికార్డులకే పరిమితం కాకుండా.. పోలీసుల పనితీరు మెరుగుదలకు, అవసరమైతే సంబంధిత సిబ్బందిపై చర్యలకు ఉపయోగించనున్నట్టు తెలుస్తోంది. మంచి ఫీడ్‌బ్యాక్ వస్తున్న సిబ్బందిని ప్రోత్సహించడంతోపాటు.. పదేపదే ప్రతికూల ఫీడ్‌బ్యాక్ వస్తున్న వారిని గుర్తించి కౌన్సెలింగ్, శిక్షణ లేదా శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశముంది. పోలీస్‌స్టేషన్లలో జవాబుదారీతనం పెరగడంతోపాటు, ప్రజలకు మరింత మెరుగైన పోలీసింగ్ అందించాలన్న లక్ష్యంతోనే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.


