గనులశాఖ ఏడీ జయరాజుపై ఏసీబీ కొరడా | ACB Raids at Mining Department AD Jayaraj Residence | Sakshi
Sakshi News home page

గనులశాఖ ఏడీ జయరాజుపై ఏసీబీ కొరడా

Aug 28 2026 4:02 AM | Updated on Aug 28 2026 4:02 AM

ACB Raids at Mining Department AD Jayaraj Residence

బోడుప్పల్‌లోని జయరాజు ఇంట్లో ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో సోదాలు చేస్తున్న అధికారులు, గనుల శాఖ ఏడీ బొజ్జ జయరాజు

ఆదాయానికి మించిన ఆస్తుల ఫిర్యాదు.. ఏకకాలంలో 8 చోట్ల సోదాలు

మూడు కార్లు, 629 గ్రాముల బంగారం.. రూ.3.06 కోట్ల ఆస్తుల గుర్తింపు

బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.15 కోట్లకు పైనే ..

కొనసాగుతున్న తనిఖీలు, ఆస్తులపై నేడు మరింత స్పష్టత 

పంద్రాగస్టు వేడుకల్లో ‘ఉత్తమ అధికారి’ ప్రశంస అందుకున్న జయరాజు

సాక్షిప్రతినిధి, వరంగల్‌/తాండూరుటౌన్‌ /బోడుప్పల్‌: గనులు, భూగర్భ శాఖలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) గురువారం కొరడా ఝళిపించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూ ప్రస్తుతం వరంగల్‌ మైన్స్‌ అండ్‌ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్‌గా అడిషనల్‌ చార్జ్‌లో ఉన్న బొజ్జ జయరాజుపై కేసు నమోదు చేసింది. గురువారం ఆయనకు సంబంధించిన కార్యాలయం, బంధువులు, సహచరుల నివాసాలు, ప్రదేశాలు కలిపి మొత్తం 8 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

ప్లాట్లు, వ్యవసాయ భూములు 
సోదాల్లో ఇప్పటివరకు గుర్తించిన స్థిర, చరాస్తుల విలువ సు­మారు రూ.3,06,53,177గా ఏసీబీ ఒక ప్రకటనలో వెల్లడించింది. మార్కెట్‌ విలువ అధికారిక/డాక్యుమెంట్‌ విలువ కంటే మరింత ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ. 15 కోట్లకు పైనే ఉంటుందనే చర్చ జరుగుతోంది. అదనపు ఆస్తులపై తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపింది. 

బోడుప్పల్‌లో జీ+2 భవనం, కేపీహెచ్‌బీ కాలనీలో ఫ్లాట్, కీసరలో రెండు ప్లాట్లు, తుంగతుర్తి, తూప్రాన్, సూర్యాపేటలో ఒక్కో ప్లాట్‌ సహా మొత్తం ఐదు ప్లాట్లు, నగదు రూ.10,03,640 తోపాటు, ఎల్‌ఐసీ, మ్యాక్స్‌ లైఫ్‌ సేవింగ్స్‌ సుమారు రూ.19.86 లక్షలు, మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ రూ.20,86,175లు కాగా, 629 గ్రాముల బంగారు ఆభరణాలు తదితరాలు మూడు బ్యాంకు ఖాతాల్లో కలిపి రూ.7,12,761 నిల్వలు ఉన్నట్టు ఏసీబీ ప్రకటించింది. 

2009 నుంచి 2016 వరకు గనుల శాఖ ఏడీఏగా జయరాజ్‌ తాండూరులో విధులు నిర్వర్తించారు. 2012లో ఉమ్మడి పెద్దేముల్‌ మండలం ఒగులాపూర్‌ గ్రామంలో మూడెకరాల సుద్ద భూమిని తన భార్యతోపాటు తాండూరుకు చెందిన కొందరు వ్యాపారులతో కలిసి కొనుగోలు చేసినట్టు ఏసీబీకి ఆధారాలు లభించాయి. దీంతో తాండూరు పట్టణానికి చెందిన ఫారూఖ్‌ ఖురేషి నివాసంలో ఏసీబీ సీఐ వెంకటేశ్‌తోపాటు అధికారుల బృందం సోదాలు చేసింది, 

డ్రైవర్‌ ఖాతా నుంచి కుమార్తె ఖాతాకు..
ఏడీ జయరాజుకు చెందిన మొబైల్‌ సమాచారం, ఇప్పటివరకు పరిశీలించిన లావాదేవీల ఆధారంగా కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్టు ఏసీబీ తెలిపింది. అధికారికి డ్రైవర్‌గా పనిచేస్తున్న సత్తునూరి యాదయ్య బ్యాంకు ఖాతా నుంచి జయరాజు తన కుమార్తె బ్యాంకు ఖాతాకు సుమారు రూ.24.80 లక్షలు బదిలీ చేయించినట్టు ప్రాథమిక విచారణలో గుర్తించినట్టు పేర్కొంది. ఈ మొత్తం ఇసుక రవాణా, సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొన్న వ్యక్తుల నుంచి వసూలు చేసినదని డ్రైవర్‌ విచారణలో తెలిపినట్టు ఏసీబీ వెల్లడించింది. 

మరిన్ని ఆస్తులపై ఆరా
జయరాజు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఏసీబీ వెల్లడించింది. సోదాల్లో లభించిన పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల వివరాలను పరిశీలిస్తున్న అధికారులు.. ఇంకా ఏమైనా ఆస్తులు ఉన్నాయా? వాటి కొనుగోలుకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.బొజ్జ జయరాజు ఇటీవల జరిగిన పంద్రాగస్టు వేడుకల సందర్భంగా భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ నుంచి ‘ఉత్తమ అధికారి’గా ప్రశంసాపత్రం అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement