పేద, మధ్య తరగతి కుటుంబాల బెంబేలు.. కుటుంబ బడ్జెట్ బేజారు
6.32 శాతం ద్రవ్యోల్బణంతో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం
దేశ సగటు ద్రవ్యోల్బణం 4.45 శాతం.. పెరిగిన ఉల్లి, కూరగాయలు, పప్పుల ధరలు
రానున్న రోజుల్లో మరింత పెరిగే ముప్పు.. ధరల కట్టడికి సర్కారు చర్యలే కీలకం
సాక్షి, హైదరాబాద్: నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడి వంటింటి బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నాయి. కూరగాయలు, ఉల్లిగడ్డ, పప్పులు, ఇతరత్రా కిరాణా వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మధ్యతరగతిపై భారం పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ధరల పెరుగుదల కొనసాగుతున్నప్పటికీ... రాష్ట్రంలో అది మరికొంత అధికంగా ఉండటం ఆందోళనను కలిగిస్తోంది. ప్రధాన రాష్ట్రాల్లో దేశంలోనే అత్యధికంగా తెలంగాణ రిటైల్ ద్రవ్యో ల్బణం 6.32% నమోదవడం కలవరం రేపుతోంది. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వినియోగదారుల ధరల సూచీ గణాంకాల్లో ఈ పరిస్థితి వెల్లడైంది. తెలంగాణ తరువాత ఏపీలో ద్రవ్యోల్బణం 5.72% ఉండగా, తమిళనాడులో 5.44%, మధ్యప్రదేశ్‌లో 4.91%, కర్ణాటకలో 4.89%గా ఉంది. దేశం సగటు ద్రవ్యోల్బణం 4.45%గా నమోదైంది. ఈ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణలోనే కూరగాయలతోపాటు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఆహార ద్రవ్యోల్బణం కన్నా ఎక్కువగా..
జూలైలో దేశవ్యాప్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం 4.45%గా ఉండగా, ఆహార వస్తువుల ధరలను ప్రతిబింబించే ఆహార ద్రవ్యోల్బణం 5.52%గా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ద్రవ్యోల్బణం మరింత ఎక్కువగా 5.79 శాతంగా నమోదైంది. దీనికి భిన్నంగా తెలంగాణలో మొత్తం ద్రవ్యోల్బణం 6.32%గా ఉండటం రాష్ట్ర ప్రజలపై ధరల భారం ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తోంది. దేశ సగటుతో పోలిస్తే తెలంగాణలో ధరల పెరుగుదల అధికంగా ఉంది. ప్రతి కుటుంబం నెలవారీ వంటింటి ఖర్చులో కనిపిస్తున్న అదనపు భారానికి ఇది అద్దం పడుతోందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లలో ఉల్లిగడ్డ కిలో రూ.50–55 పలుకుతోంది. బోయిన్‌పల్లి హోల్‌సేల్ మార్కెట్‌లో అదే ఉల్లి రూ.30–35 మధ్య లభిస్తుండగా, రైతుబజార్లలో రూ.40–44 విక్రయిస్తున్నారు. అదే రిటైల్ మార్కెట్‌కు చేరే కొద్దీ ధర గణనీయంగా పెరుగుతోంది. అలాగే, క్యారట్, చిక్కుడు, బీన్స్, వంకాయలు తదితరాల ధరలు కూడా భారీగా పెరగడంతో కుటుంబాల నెలవారీ కూరగాయల ఖర్చు భారీగా పెరిగింది. పప్పుల ధరలు సైతం సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. బియ్యం ధరలు సైతం బెంబేలెత్తిస్తున్నాయి. మూడు నెలల క్రితం సన్న బియ్యం ధర కిలో రూ.48–55 ఉండగా, ఇప్పుడు 65–70 వరకు ఉన్నాయి.
రాష్ట్రంలో ప్రభుత్వ జోక్యం అవసరం
రాష్ట్రంలో హాకా, రైతుబజార్ల ద్వారా సబ్సిడీ ధరలకు ఉల్లి, ఇతర నిత్యావసరాలను అందుబాటులోకి తేవాలనే డిమాండ్ పెరుగుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరిగాయని చెబుతున్న అధికారులు రేట్ల తగ్గింపునకు సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేయకపోవడం గమనార్హం. పండుగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ధరలపై మరింత ఒత్తిడి నెలకొనే అవకాశం ఉంది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్‌లోకి ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను పెంచడం, రైతుబజార్లలో నిల్వలు పెంచడం, హోల్‌సేల్–చిల్లర ధరల వ్యత్యాసాన్ని పర్యవేక్షించడం, అక్రమ నిల్వలు–కృత్రిమ కొరతపై నిఘా పెంచాల్సిన అవసరం ఉంది.
ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు
⇒ మునుపటి పంట నిల్వలు తగ్గిపోవడం, కొత్త పంట మార్కెట్‌కు రావడానికి ఇంకా సమయం ఉండటం. ఉత్పత్తి తగ్గిన సమయంలో డిమాండ్ పెరగడంతో ధరలపై ఒత్తిడి పెరిగింది.
⇒ పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినడం, పొలాల నుంచి మార్కెట్లకు సరుకు రవాణాలో ఆలస్యం ఏర్పడటం. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల్లో వర్షాలు పంటల కోత, రవాణాపై ప్రభావం చూపుతున్నాయి.
⇒ శ్రావణ మాసం, రాబోయే వినాయక చవితి వేళ స్వీట్లు, పిండివంటల తయారీ పరిశ్రమలు, హోటళ్లు, గృహాల నుంచి వినియోగం ఒక్కసారిగా పెరగడం.
⇒ అంతర్రాష్ట్ర రవాణా వ్యయం పెరగడం వల్ల మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రధాన మార్కెట్ల నుంచి వచ్చే సరుకుపై అదనపు భారంపడింది.
⇒ భారత్ దిగుమతి చేసుకునే ముడి పామాయిల్, సన్‌ఫ్లవర్ నూనెలపై అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు పెరగడం, దిగుమతి సుంకాల్లో మార్పులు.
ఇంటి ఖర్చులకే సరిపోక..
హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో రవికిరణ్ అనే ప్రైవేటు ఉద్యోగి భార్య, ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. నెలసరి వేతనం రూ.50 వేలు. గతంలో ఇంటి అద్దె, టూవీలర్ ఖర్చు, కిరాణా, కూరగాయలు, పాలు, పిల్లల చదువు, విద్యుత్, రవాణా, ఇతర ఖర్చులకు కలిపి సుమారు రూ.45 వేలు ఖర్చయ్యేవి. నెలకు రూ.5 వేలు పొదుపు చేసుకునేవారు. ఇప్పుడు కూరగాయలు, ఉల్లి, పప్పులు, నూనె, పాల ధరలు పెరగడంతో నెల ఖర్చు రూ.50 వేలకుపైగా అవుతోంది. ముఖ్యంగా కూరగాయలు, కిరాణాపై నెలకు రూ.3వేల వరకు అదనంగా ఖర్చవుతోంది. దీంతో గతంలో పొదుపు చేసిన రూ.5 వేలు ఇప్పుడు ఇంటి ఖర్చులకే సరిపోని పరిస్థితి. పిల్లల వినోదం, కొత్త దుస్తులు, బయట భోజనాలు తగ్గించడంతోపాటు పొదుపును కూడా వదులుకోవాల్సి వస్తోంది.


