ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఆకస్మికంగా చెరువు పనుల పరిశీలన
వెడ్డింగ్, ఈవెంట్ డెస్టినేషన్ల ఏర్పాటుపై దృష్టి సారించాలి.. గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: చారిత్రక ప్రాధాన్యం కలిగిన మీరాలం చెరువుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూపునివ్వనుంది. కుటుంబ సమేతంగా వచ్చి రోజంతా ప్రకృతి, వినోదం, విశ్రాంతిని ఆస్వాదించేలా పర్యాటక, వినోద కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈక్రమంలో మీరాలం చెరువును సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ఆకస్మికంగా పరిశీలించి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. చెరువు చుట్టూ జరుగుతున్న పనులు, మీరాలం చెరువుపై నిర్మిస్తున్న ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జి పనులను సీఎం పరిశీలించారు.
నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. చెరువు పునరుజ్జీవం, చెరువు పరిసర ప్రాంతాలు, అందులోని ఐలాండ్ల అభివృద్ధి, చెరువుపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం.. ఈ మూడు ప్రధాన అంశాలపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అయితే, మీరాలం చెరువులోకి మురుగునీరు చేరకుండా పటిష్ట చర్యలు తీసు కోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. చెరు వు నుంచి మూసీ నదిలోకి వరద నీరు సాఫీగా వెళ్లేలా నాలాలను విస్తరించాలని సూచించారు. చెరువు పునరుజ్జీవంతో పాటు నీటి నాణ్యతను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

వాటర్ స్పోర్ట్స్‌కు డిజైన్..
మీరాలం చెరువులో వాటర్ స్పోర్ట్స్ నిర్వహించేలా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని, అవసరమైన సాంకేతిక, పర్యావరణ, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా బోటింగ్, జల క్రీడలు, అడ్వెంచర్ కార్యకలాపాలకు అవకాశాలను పరిశీలించాలన్నారు.చెరువు చుట్టూరా ఫుడ్‌కోర్టులు, పచ్చని పార్కులు, విశ్రాంతి ప్రదేశాలు, కుటుంబ వినోద సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. చిన్నారుల కోసం ప్రత్యేక ఆట స్థలాలు, వినోద, కార్యకలాపాల కేంద్రాలను కూడా అభివృద్ధి చేయాలన్నారు. పాదచారులకు అనుకూలంగా వాకింగ్, పబ్లిక్ స్పేస్‌లను తీర్చిదిద్దడంతో పాటు రాకపోకల సౌకర్యాన్ని మెరుగుపరచాలన్నారు.
చెరువులో ఉన్న ఐలాండ్లను అభివృద్ధి చేయాలని, ప్రకృతి ఆధారిత విశ్రాంతి కేంద్రాలు, గ్లాంపింగ్, ఇతర పర్యాటక కార్యకలాపాలకు ఈ ప్రాంతాన్ని వినియోగించుకునే అవకాశాలను అధికారులను పరిశీలించాలని సీఎం చెప్పారు. వెడ్డింగ్, ఈవెంట్ డెస్టినేషన్ల ఏర్పాటుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసే అంశంపై దృష్టి సారించాలన్నారు. నాణ్యమైన పర్యాటక, వినోద సదుపాయాల అభివృద్ధిలో పీపీపీ విధానంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు కల్పించాలని వెల్లడించారు.
సమీపంలోని నెహ్రూ జూలాజికల్ పార్కుతో మీరాలం ట్యాంక్ అభివృద్ధిని అనుసంధానం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జూ సందర్శన, ప్రకృతి, చెరువు అందాలు, కుటుంబ వినోదం అన్నీ ఒకే పర్యాటక అనుభవంగా అందించడమే లక్ష్యంగా ఉండాలని చెప్పారు. ట్యాంక్ పునరుజ్జీవం, పరిసర ప్రాంతాలు, ఐలాండ్ల అభివృద్ధికి సంబంధించిన డీపీఆర్ ప్రస్తుతం రూపుదిద్దుకుంటుందన్నారు.


