breaking news
meeralam lake
-
టూరిజం హబ్‌గా ‘మీరాలం’
సాక్షి, హైదరాబాద్: చారిత్రక ప్రాధాన్యం కలిగిన మీరాలం చెరువుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూపునివ్వనుంది. కుటుంబ సమేతంగా వచ్చి రోజంతా ప్రకృతి, వినోదం, విశ్రాంతిని ఆస్వాదించేలా పర్యాటక, వినోద కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈక్రమంలో మీరాలం చెరువును సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ఆకస్మికంగా పరిశీలించి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. చెరువు చుట్టూ జరుగుతున్న పనులు, మీరాలం చెరువుపై నిర్మిస్తున్న ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జి పనులను సీఎం పరిశీలించారు.నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. చెరువు పునరుజ్జీవం, చెరువు పరిసర ప్రాంతాలు, అందులోని ఐలాండ్ల అభివృద్ధి, చెరువుపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం.. ఈ మూడు ప్రధాన అంశాలపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అయితే, మీరాలం చెరువులోకి మురుగునీరు చేరకుండా పటిష్ట చర్యలు తీసు కోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. చెరు వు నుంచి మూసీ నదిలోకి వరద నీరు సాఫీగా వెళ్లేలా నాలాలను విస్తరించాలని సూచించారు. చెరువు పునరుజ్జీవంతో పాటు నీటి నాణ్యతను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వాటర్ స్పోర్ట్స్‌కు డిజైన్.. మీరాలం చెరువులో వాటర్ స్పోర్ట్స్ నిర్వహించేలా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని, అవసరమైన సాంకేతిక, పర్యావరణ, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా బోటింగ్, జల క్రీడలు, అడ్వెంచర్ కార్యకలాపాలకు అవకాశాలను పరిశీలించాలన్నారు.చెరువు చుట్టూరా ఫుడ్‌కోర్టులు, పచ్చని పార్కులు, విశ్రాంతి ప్రదేశాలు, కుటుంబ వినోద సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. చిన్నారుల కోసం ప్రత్యేక ఆట స్థలాలు, వినోద, కార్యకలాపాల కేంద్రాలను కూడా అభివృద్ధి చేయాలన్నారు. పాదచారులకు అనుకూలంగా వాకింగ్, పబ్లిక్ స్పేస్‌లను తీర్చిదిద్దడంతో పాటు రాకపోకల సౌకర్యాన్ని మెరుగుపరచాలన్నారు. చెరువులో ఉన్న ఐలాండ్లను అభివృద్ధి చేయాలని, ప్రకృతి ఆధారిత విశ్రాంతి కేంద్రాలు, గ్లాంపింగ్, ఇతర పర్యాటక కార్యకలాపాలకు ఈ ప్రాంతాన్ని వినియోగించుకునే అవకాశాలను అధికారులను పరిశీలించాలని సీఎం చెప్పారు. వెడ్డింగ్, ఈవెంట్ డెస్టినేషన్ల ఏర్పాటుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసే అంశంపై దృష్టి సారించాలన్నారు. నాణ్యమైన పర్యాటక, వినోద సదుపాయాల అభివృద్ధిలో పీపీపీ విధానంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు కల్పించాలని వెల్లడించారు. సమీపంలోని నెహ్రూ జూలాజికల్ పార్కుతో మీరాలం ట్యాంక్ అభివృద్ధిని అనుసంధానం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జూ సందర్శన, ప్రకృతి, చెరువు అందాలు, కుటుంబ వినోదం అన్నీ ఒకే పర్యాటక అనుభవంగా అందించడమే లక్ష్యంగా ఉండాలని చెప్పారు. ట్యాంక్ పునరుజ్జీవం, పరిసర ప్రాంతాలు, ఐలాండ్ల అభివృద్ధికి సంబంధించిన డీపీఆర్ ప్రస్తుతం రూపుదిద్దుకుంటుందన్నారు. -
ఆ చెరువే..ఆదరువు!
అది 1804 జూలై 20వ తేదీ. ఆ రోజు శుక్రవారం. నగరమంతా సందడి. ప్రజల ముఖాల్లో ఆనందాతిశయం. రెండు మూడు రోజుల ముందు నుంచే పాలకులు నగర ప్రజల కోసం తీసుకున్న ఓ చారిత్రక నిర్ణయాన్ని చార్మినార్‌పై నుంచి ప్రకటించారు. శుక్రవారం నమాజ్ పూర్తి చేసుకున్న రెండో నిజాం, ఉన్నత అధికారులు ఆ ప్రదేశానికి వచ్చారు. అప్పుటికే ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది. ఓ చారిత్రక ఘట్టానికి తొలి అడుగు పడింది. రెండో నిజాం ముందుకొచ్చారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయమని అప్పటి నగర ప్రధాన మంత్రి మీర్ ఆలంనకు సూచించారు. దీంతో ఆయన శంకుస్థాపన చేశారు. దేవుని నామంతో ప్రవహిస్తుంది.. దేవునికి కృతజ్ఞతలు తెలుపుతుంది.. నగర ప్రజల అవసరాలు తీరుస్తుంది.. అంటూ ఆయన వేడుకున్నారు. దీంతో ప్రాజెక్ట్ నిర్మాణం షురూవయ్యింది. అదే 214 ఏళ్ల నాటి చారిత్రక మీర్ ఆలం (మీరాలం) మంచినీటి సరస్సు. ఇది 1984 వరకు అంటే 178 ఏళ్ల పాటు నగర ప్రజలకు దాహార్తి తీర్చింది. నేటితో ఈ తటాకం 214 వసంతాలు పూర్తి చేసుకోనుంది. నేటికీ వన్యప్రాణుల అవసరాలను తీరుస్తూ.. తనకు తానే సాటి అని నిరూపించుకుంటోంది. మీరాలం చెరువు చారిత్రక ప్రాశస్త్యంపై కథనం. సాక్షి, సిటీబ్యూరో :మీర్ నిజాం అలీఖాన్ హయాంలో (ప్రస్తుతం జూ వెనక భాగం) మీర్ ఆలం ట్యాంక్ నిర్మించారు. మీర్ ఆలంను సయ్యద్ అబుల్ ఖాసింగా కూడా అప్పట్లో పిలిచేవారు. 1804కు ముందే నగర ప్రజల నీటి అవసరాలను తీర్చడానికి ట్యాంక్ నిర్మించాలని రెండో నిజాం నిర్ణయించారు. కానీ ప్రభుత్వ ఖజానాలో నిధుల కొరత ఉండేది. అప్పట్లో హైదరాబాద్ సంస్థానానికి ప్రధాన మంత్రిగా మీర్ ఆలం ఉన్నారు. ఈయన హయాంలో బ్రిటిష్ సైన్యంతో పాటు నిజాం సైన్యం టిప్పుసుల్తాన్‌పై దండయాత్ర చేసి విజయం సాధించారు. దీంతో బ్రిటిష్ పాలకులు శ్రీరంగపట్నంలో ఉన్న ధనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో నుంచి బహుమానంగా మీర్ ఆలంకు పెద్దమొత్తంలో నిధులు ఇచ్చారు. వీటితోనే మీర్ ఆలం ట్యాంక్ నిర్మించారు. దీని నిర్మాణం కోసం ఆయన ఎంతో శ్రద్ధ చూపారని, ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేశారని అందుకే దీని పేరును మీర్ ఆలం ట్యాంక్‌గా నామకరణం చేశారు. . నిర్మాణ శైలిలో ప్రత్యేకతలివీ.. స్టోన్స్ లాకింగ్ ఫ్రాన్స్ టెక్నాలజీతో వంతెనలు ఎలా నిర్మించారో అదే తరహాలో ఈ ట్యాంక్‌ను నిర్మించారు. 21 సర్కిల్ ఆకారంలో గోపురాల మాదిరిగా పటిష్టమైన రాళ్లతో ఒక మైలు దూరం వరకు డ్యామ్‌ను నిర్మించారు. మూసీనది దక్షిణ భాగంలోని పరీవాహక ప్రాంతంలో మొత్తం 21 అర్ధ చంద్రాకారంలో నీరు నిల్వ ఉండేలా.. మొత్తం 6 వందల ఎకరాల్లో నిర్మించారు. ట్యాంక్ నిర్మాణంలో ఫ్రెంచ్ దేశస్తుడు మిచెల్ జోచీం మేరీ రేమాండ్ కీలకప్రాత పోషించాడని చరిత్రకారులు చెబుతుంటారు. ఎలాంటి సాంకేతిక పరికరాలు ఉపయోగించకుండా కేవలం మనుషులతో నిర్మించిన మొదటి ట్యాంక్ ఇది. ఈ నిర్మాణం 1806 జూన్ 8న పూర్తయింది. నగరంలోనే మొదటిది.. 1806 నుంచి దాదాపు 1984 వరకు మీర్ ఆలం ట్యాంక్ నుంచి నగర ప్రజల మంచినీటి అవసరాలు తీరాయి. అప్పటివరకు నగరంలో పలు ప్రాంతాల్లో బావుల ద్వారా తాగునీటి అవసరాలు తీరేవి. ట్యాంక్ నిర్మాణానంతరం మట్టిపైపులతో నీళ్లను ఇతర ప్రాంతాలకు చేరవేసేవారు. నగర ప్రధాన కూడళ్ల వద్ద మంచినీరు తాగడానికి ప్రత్యేక కుళాయిలు ఉండేవి. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న జూ వెనక ప్రదేశంలో మీర్ ఆలం ట్యాంక్ నీళ్లను శుద్ధి చేయడానికి వాటర్ ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేశారు. దీంతో నీళ్ల శుద్ధీకరణ అక్కడే జరిగేది. 1920లోఉస్మాన్ సాగర్, 1927లో హిమాయత్ సాగర్ జలాశయాల నిర్మాణానికి ముందు మీర్ ఆలం ట్యాంక్ ద్వారా నగర ప్రజల మంచినీటి అవసరాలు పూర్తిగా తీరాయి. 1984 వరకు శుద్ధి చేసిన నీళ్లను నగర ప్రజలు వినియోగించారు. ఇప్పటికీ ఈ ఫిల్టర్లు పని చేస్తున్నాయి. ఈ నీటిని జూ అధికారులు గార్డెనింగ్ కోసం వాడుతున్నారు. ఆ నీటి ఊటకు ప్రపంచ గుర్తింపు.. ఆ రోజుల్లో మీర్ ఆలం ట్యాంక్ పక్కన ఓ నీటి ఊట ఉండేది. దీని ద్వారా స్వచ్ఛమైన తియ్యటి నీళ్లు వచ్చేవని చరిత్రకారులు ప్రస్తావించారు. ఈ నీటి ఊట ద్వారా వచ్చే నీళ్లను నిజాం పాలకులతో పాటు, బ్రిటిష్ పాలకులకు గుర్రాలపై పంపించేవారు. ఆరో నిజాం కాలంలోపర్యాటక ప్రాంతంగా.. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ పాలన కాలంలో అంటే 1908 మూసీ వరదలకు పూర్వం వరకు ఓ అందమైన పర్యాటక ప్రదేశంగా ఉండేవి మీర్ ఆలం పరిసరాలు. నిజాం మీర్ మహబూబ్ పాలనతో పాటు అంతకు ముందు పాలించిన నిజాంలు దేశ విదేశాల నుంచి వచ్చే వారితో ఆహ్లాదమైన వాతావరణంలో చర్చలు, సమావేశాలు నిర్వహించేవారు. ఆరో నిజాం మీర్ ఆలం ట్యాంక్ చుట్టూ గార్డెనింగ్ చేయించి.. తటాకంలో పడవలపై తిరిగారని చరిత్రకారులు చెబుతుంటారు. -
జూలో జంబలకిడిపంబ
♦ మీరాలం చెరువు కలుషిత నీళ్లు తాగడంతో హార్మోన్లలో అసమతుల్యం ♦ తగ్గుతున్న పురుష హార్మోన్ టెస్టోస్టిరాన్.. పెరుగుతున్న ఈస్ట్రోజన్ ♦ నెహ్రూ జూపార్క్‌లో గణనీయంగా పడిపోతున్న జంతు సంతానం ♦ ఏటా 50కిపైగా జంతువులు జన్మించాలి.. కానీ కొన్నేళ్లుగా 20కి కూడా మించని వైనం ఏం జరుగుతోంది? నెహ్రూ జూలాజికల్ పార్కు.. రాజసం ఒలికిస్తూ ఓ మగపులి.. చూపుల్లో గాంభీర్యం.. వణుకుపుట్టించే గాండ్రింపు... కానీ ‘ఆ విషయం’లో మాత్రం ఢీలా పడిపోతోంది. చురుకుదనం లోపించి బిత్తరచూపులు చూస్తోంది! ఏంటా అని ఆరా తీస్తే.. ఆ పులిలో పురుష హార్మోన్ (టెస్టోస్టిరాన్) చతికిలపడి స్త్రీ హార్మోన్ (ఈస్ట్రోజన్) స్థాయిలు పెరుగుతున్నట్టు తేలింది. ఇది ఒక్క పులిదే కాదు.. జూలోని అన్ని జంతువులదీ ఇదే పరిస్థితి!! కారణం జూ పక్కనే ఉన్న మీరాలం చెరువులోని కలుషిత జలాలు ఇలా జంతువుల పునరుత్పత్తి సామర్థ్యంపై దెబ్బకొడుతున్నాయి. ఫలితంగా గత ఏడేళ్లుగా జూలో పురుడు పోసుకుంటున్న జంతువుల సంఖ్య క్రమంగా పడిపోతోంది. పరిష్కారం జలాశయంలో ఏరియేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. నీటిని పూర్తిగా ప్రక్షాళన చేయాలి మగ జంతువుల్లో ‘కౌంట్’డౌన్..తగ్గిపోతున్న పునరుత్పత్తి సామర్థ్యం ఈస్ట్రోజన్ అనేది మహిళల్లోని ప్రధాన సెక్స్ హార్మోన్లలో కీలకమైనది. స్త్రీలలో ప్రత్యుత్పత్తికి ఉపయోగపడుతుంది. ఆడ, మగ ఇద్దరిలోనూ ఈ హార్మోన్ ఉంటుంది. అయితే పురుషుల్లో చాలా పరిమితంగా ఉంటుంది. పురుషుల్లో ప్రధానమైన భూమిక పోషించే సెక్స్ హార్మోన్ టెస్టోస్టిరాన్. పురుషుల్లో ఇది ఈస్ట్రోజన్ కంటే ఎక్కువగా ఉంటుంది. జంతువుల్లోనూ ఇంతే. జూలోని మగ జంతువుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గి, ఈస్ట్రోజన్ స్థాయిలు పెరగడంతో వాటి పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతోంది. సాక్షి, హైదరాబాద్: అది హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కు.. రాజసం ఒలికిస్తూ ఓ మగపులి.. చూపుల్లో గాంభీర్యం.. నడకలో ఠీవీ.. వణుకుపుట్టించే గాండ్రింపు... అన్నీ బాగానే ఉన్నాయి! కానీ ‘ఆ విషయం’లో మాత్రం ఢీలా పడిపోతోంది. చురుకుదనం లోపించి బిత్తరచూపులు చూస్తోంది! ఏంటా అని ఆరా తీస్తే.. ఆ పులిలో పురుష హార్మోన్ (టెస్టోస్టిరాన్) చతికిలపడి స్త్రీ హార్మోన్ (ఈస్ట్రోజన్) స్థాయిలు పెరుగుతున్నట్టు తేలింది. దీంతో ఆ పులిలో వీర్యకణాల సంఖ్య తగ్గి పునరుత్పత్తి సామర్థ్యం పడిపోతోంది. ఇది ఒక్క పులిదే కాదు.. జూలోని అన్ని జంతువులదీ ఇదే పరిస్థితి!! జంబలకిడిపంబ సినిమా చూశారుగా.. మగవాళ్లలో ఆడలక్షణాలు రావడం.. ఇక్కడ అదే సీన్ రిపీట్ అవుతోందన్నమాట. దీనికి కారణం.. జూ పక్కనే ఉన్న మీరాలం చెరువులోని కలుషిత జలాలు.. అవి జంతువుల పునరుత్పత్తి సామర్థ్యంపై దెబ్బకొడుతున్నాయి. ఫలితంగా గత ఏడేళ్లుగా జూలో జన్మిస్తున్న జంతువుల సంఖ్య క్రమంగా పడిపోతోంది. సాధారణంగా ఏటా జూలో పుట్టే వన్యమృగాల సంఖ్య 50కి పైగానే ఉండాలి. కానీ గత కొన్నేళ్లుగా ఈ సంఖ్య 20కి కూడా మించడం లేదు. ఆ నీటితో ‘కౌంట్’ తగ్గుతోంది.. సుమారు 381 సువిశాల విస్తీర్ణంలో విస్తరించిన జూపార్క్‌లో 158 జంతు జాతులకు చెందిన సుమారు 1,500 జంతువులు, 25 అరుదైన వన్యప్రాణులు, పక్షులు, పాములు ఉన్నాయి. ఈ జూపార్క్‌ను ఆనుకొనే మీరాలం చెరువు ఉంది. ఈ చెరువులోని నీరు.. జూపార్క్‌లోని జంతువుల ఎన్‌క్లోజర్స్‌లో ఉన్న చిన్నచిన్న గోతుల్లోకి చేరుతుంది. వన్యప్రాణులు తరచూ ఈ నీటిని తాగుతున్నాయి. సాధారణంగా జంతువులకు ఆహారం అందించే సమయంలో రోజుకు రెండుసార్లు జూ అధికారులు వాటికి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తారు. కానీ జంతువులు తమ ఎన్‌క్లోజర్స్‌లో సంచరిస్తున్న సమయంలో చిన్న గోతుల్లో నిల్వ ఉన్న నీటిని తాగుతున్నాయి. మీరాలం చెరువు నుంచి వచ్చి చేరుతున్న ఈ గోతుల్లోని నీటిలో భారలోహాలు అధికంగా ఉంటున్నాయి. ఆ నీరు ఆమ్ల లక్షణాలను కలిగి ఉందని, నీటిలో ఈస్ట్రోజన్ స్థాయిలు ప్రతి లీటరుకు 370 నానో గ్రాములు న్నట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి చెందిన పరిశోధకుల బృందం పరిశీలనలో తేలింది. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఈస్ట్రోజన్ మోతాదు లీటరుకు ఒక నానోగ్రామ్ మించరాదు. స్థానికులు చెత్తా చెదా రం, వ్యవసాయ, పారిశ్రామిక, వ్యర్థ జలాలు, రసాయనాలు మీరాలం చెరువులో కలుస్తుం డడంతో నీళ్లన్నీ కలుషితం అవుతున్నాయి. దీంతో మగ జంతువుల్లో ఈస్ట్రోజన్ స్థాయిలు అనూహ్యంగా పెరిగి వీర్యకణాల సంఖ్య తగ్గుతున్నట్లు ఇటీవలి పరిశోధనలో తేలింది. దీంతో అవి వంధ్యత్వం బారిన పడుతు న్నాయి. అంతేకాదు నీటి కాలుష్యంతో జంతు వుల మూత్రపిండాలు దెబ్బతిని ఆరోగ్యంపైనా దుష్ప్రభావం పడుతుందని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. జూలో తరచూ నెలలు నిండక ముందే జంతువులు ప్రసవించడం, గర్భస్రా వాలు జరుగుతున్నాయని వారు పేర్కొంటు న్నారు. జూలో 2016 మే నెలలో 3, డిసెంబర్ లో 2 జంతువులు మృత్యువాతపడ్డాయి. అన్ని చర్యలు తీసుకుంటున్నాం జూపార్కులోకి ప్రవహిస్తున్న మీరాలం చెరువు నీటితో జం తువులు అనారోగ్యం పాలు కాకుండా చర్యలు తీసుకుం టున్నాం. జంతువుల్లో రోగ నిరోధకశక్తి, పునరుత్పత్తి సామర్థ్యం పెంపొందించేందుకు మినరల్స్, విటమిన్స్, బలవర్ధకమైన ఆహారం, మందులను అందిస్తున్నాం. – శివానీ డోగ్రా, జూపార్కు క్యూరేటర్ పరిష్కారం ఏంటి? ♦ సెంట్రల్ జూ అథారిటీ ఆమోదించిన మాస్టర్‌ప్లాన్ అమలు చేయాలి ♦ జలాశయాల్లోకి కలుషిత జలాలు చేరకుండా కట్టడి చేయాలి ♦ కలుషిత జలాలు మీరాలం చెరువులోకి చేరకుండా మురుగు శుద్ధి కేంద్రం (ఎస్టీపీ)నిర్మించాలి. శుద్ధిచేసిన నీటిని సమీపంలో గార్డెనింగ్ అవసరాలకు మాత్రమే వాడాలి ♦ జలాశయంలో ఏరియేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. నీటిని పూర్తిగా ప్రక్షాళన చేయాలి ♦ జంతువుల మనుగడ, వాటిపై పడుతున్న దుష్ప్రభావంపై సమగ్ర అధ్యయనం జరపాలి ♦ మీరాలం చెరువుకు సహజ సిద్ధంగా ఉన్న తూములు, నాలాలను కబ్జా చెర నుంచి విముక్తి కల్పించాలి. వరద ప్రవాహం సాఫీగా వెళ్లే ఏర్పాట్లు చేయాలి ♦ కలుషిత జలాలు జంతువుల ఎన్‌క్లోజర్స్‌లో ఏర్పాటు చేసిన గుంతల్లోకి చేరకుండా జూపార్క్ ప్రహరీ గోడ ఎత్తు పెంచాలి.


