1902లో మీరాలం చెరువు
అది 1804 జూలై 20వ తేదీ. ఆ రోజు శుక్రవారం. నగరమంతా సందడి. ప్రజల ముఖాల్లో ఆనందాతిశయం. రెండు మూడు రోజుల ముందు నుంచే పాలకులు నగర ప్రజల కోసం తీసుకున్న ఓ చారిత్రక నిర్ణయాన్ని చార్మినార్‌పై నుంచి ప్రకటించారు. శుక్రవారం నమాజ్ పూర్తి చేసుకున్న రెండో నిజాం, ఉన్నత అధికారులు ఆ ప్రదేశానికి వచ్చారు. అప్పుటికే ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది. ఓ చారిత్రక ఘట్టానికి తొలి అడుగు పడింది. రెండో నిజాం ముందుకొచ్చారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయమని అప్పటి నగర ప్రధాన మంత్రి మీర్ ఆలంనకు సూచించారు. దీంతో ఆయన శంకుస్థాపన చేశారు. దేవుని నామంతో ప్రవహిస్తుంది.. దేవునికి కృతజ్ఞతలు తెలుపుతుంది.. నగర ప్రజల అవసరాలు తీరుస్తుంది.. అంటూ ఆయన వేడుకున్నారు. దీంతో ప్రాజెక్ట్ నిర్మాణం షురూవయ్యింది. అదే 214 ఏళ్ల నాటి చారిత్రక మీర్ ఆలం (మీరాలం) మంచినీటి సరస్సు. ఇది 1984 వరకు అంటే 178 ఏళ్ల పాటు నగర ప్రజలకు దాహార్తి తీర్చింది. నేటితో ఈ తటాకం 214 వసంతాలు పూర్తి చేసుకోనుంది. నేటికీ వన్యప్రాణుల అవసరాలను తీరుస్తూ.. తనకు తానే సాటి అని నిరూపించుకుంటోంది. మీరాలం చెరువు చారిత్రక ప్రాశస్త్యంపై కథనం.
సాక్షి, సిటీబ్యూరో :మీర్ నిజాం అలీఖాన్ హయాంలో (ప్రస్తుతం జూ వెనక భాగం) మీర్ ఆలం ట్యాంక్ నిర్మించారు. మీర్ ఆలంను సయ్యద్ అబుల్ ఖాసింగా కూడా అప్పట్లో పిలిచేవారు. 1804కు ముందే నగర ప్రజల నీటి అవసరాలను తీర్చడానికి ట్యాంక్ నిర్మించాలని రెండో నిజాం నిర్ణయించారు. కానీ ప్రభుత్వ ఖజానాలో నిధుల కొరత ఉండేది. అప్పట్లో హైదరాబాద్ సంస్థానానికి ప్రధాన మంత్రిగా మీర్ ఆలం ఉన్నారు. ఈయన హయాంలో బ్రిటిష్ సైన్యంతో పాటు నిజాం సైన్యం టిప్పుసుల్తాన్‌పై దండయాత్ర చేసి విజయం సాధించారు. దీంతో బ్రిటిష్ పాలకులు శ్రీరంగపట్నంలో ఉన్న ధనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో నుంచి బహుమానంగా మీర్ ఆలంకు పెద్దమొత్తంలో నిధులు ఇచ్చారు. వీటితోనే మీర్ ఆలం ట్యాంక్ నిర్మించారు. దీని నిర్మాణం కోసం ఆయన ఎంతో శ్రద్ధ చూపారని, ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేశారని అందుకే దీని పేరును మీర్ ఆలం ట్యాంక్‌గా నామకరణం చేశారు. .
నిర్మాణ శైలిలో ప్రత్యేకతలివీ..
స్టోన్స్ లాకింగ్ ఫ్రాన్స్ టెక్నాలజీతో వంతెనలు ఎలా నిర్మించారో అదే తరహాలో ఈ ట్యాంక్‌ను నిర్మించారు. 21 సర్కిల్ ఆకారంలో గోపురాల మాదిరిగా పటిష్టమైన రాళ్లతో ఒక మైలు దూరం వరకు డ్యామ్‌ను నిర్మించారు. మూసీనది దక్షిణ భాగంలోని పరీవాహక ప్రాంతంలో మొత్తం 21 అర్ధ చంద్రాకారంలో నీరు నిల్వ ఉండేలా.. మొత్తం 6 వందల ఎకరాల్లో నిర్మించారు. ట్యాంక్ నిర్మాణంలో ఫ్రెంచ్ దేశస్తుడు మిచెల్ జోచీం మేరీ రేమాండ్ కీలకప్రాత పోషించాడని చరిత్రకారులు చెబుతుంటారు. ఎలాంటి సాంకేతిక పరికరాలు ఉపయోగించకుండా కేవలం మనుషులతో నిర్మించిన మొదటి ట్యాంక్ ఇది. ఈ నిర్మాణం 1806 జూన్ 8న పూర్తయింది. నగరంలోనే మొదటిది..
1806 నుంచి దాదాపు 1984 వరకు మీర్ ఆలం ట్యాంక్ నుంచి నగర ప్రజల మంచినీటి అవసరాలు తీరాయి. అప్పటివరకు నగరంలో పలు ప్రాంతాల్లో బావుల ద్వారా తాగునీటి అవసరాలు తీరేవి. ట్యాంక్ నిర్మాణానంతరం మట్టిపైపులతో నీళ్లను ఇతర ప్రాంతాలకు చేరవేసేవారు. నగర ప్రధాన కూడళ్ల వద్ద మంచినీరు తాగడానికి ప్రత్యేక కుళాయిలు ఉండేవి. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న జూ వెనక ప్రదేశంలో మీర్ ఆలం ట్యాంక్ నీళ్లను శుద్ధి చేయడానికి వాటర్ ఫిల్టర్ బెడ్‌లు ఏర్పాటు చేశారు. దీంతో నీళ్ల శుద్ధీకరణ అక్కడే జరిగేది. 1920లోఉస్మాన్ సాగర్, 1927లో హిమాయత్ సాగర్ జలాశయాల నిర్మాణానికి ముందు మీర్ ఆలం ట్యాంక్ ద్వారా నగర ప్రజల మంచినీటి అవసరాలు పూర్తిగా తీరాయి. 1984 వరకు శుద్ధి చేసిన నీళ్లను నగర ప్రజలు వినియోగించారు. ఇప్పటికీ ఈ ఫిల్టర్‌లు పని చేస్తున్నాయి. ఈ నీటిని జూ అధికారులు గార్డెనింగ్ కోసం వాడుతున్నారు.
ఆ నీటి ఊటకు ప్రపంచ గుర్తింపు..
ఆ రోజుల్లో మీర్ ఆలం ట్యాంక్ పక్కన ఓ నీటి ఊట ఉండేది. దీని ద్వారా స్వచ్ఛమైన తియ్యటి నీళ్లు వచ్చేవని చరిత్రకారులు ప్రస్తావించారు. ఈ నీటి ఊట ద్వారా వచ్చే నీళ్లను నిజాం పాలకులతో పాటు, బ్రిటిష్ పాలకులకు గుర్రాలపై పంపించేవారు.
ఆరో నిజాం కాలంలోపర్యాటక ప్రాంతంగా..
ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ పాలన కాలంలో అంటే 1908 మూసీ వరదలకు పూర్వం వరకు ఓ అందమైన పర్యాటక ప్రదేశంగా ఉండేవి మీర్ ఆలం పరిసరాలు. నిజాం మీర్ మహబూబ్ పాలనతో పాటు అంతకు ముందు పాలించిన నిజాంలు దేశ విదేశాల నుంచి వచ్చే వారితో ఆహ్లాదమైన వాతావరణంలో చర్చలు, సమావేశాలు నిర్వహించేవారు. ఆరో నిజాం మీర్ ఆలం ట్యాంక్ చుట్టూ గార్డెనింగ్ చేయించి.. తటాకంలో పడవలపై తిరిగారని చరిత్రకారులు చెబుతుంటారు.


