ఇటీవల ఓట్లేసినా.. నేడు గల్లంతాయె
ఇంటింటి సర్వేలో బీఎల్వోల ఇష్టారాజ్యం
రాజకీయ నేతలకూ తప్పని నోటీసులు
పేరు, అక్షరాల మార్పుతో కొత్త తంటాలు
నిస్సహాయ ఓటర్లకు బిగ్ రిలీఫ్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరిగినట్టు’ఉంది కొందరు బీఎల్వోల పనితీరు. సర్వేలో నిర్లక్ష్యం, వివరాల నమోదులో డొల్లతనం కారణంగా స్పెషల్ ఇంటెన్సివ్ రిపోర్టు (సర్) ప్రక్రియ గందర గోళానికి తెరదీసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే మూడు సార్లు జరిగినా పొరపాట్లు దొర్లాయి. గతంలో ఓట్లేసినవారి వివరాలు గల్లంతవగా ఎమ్మెల్యేలు, రాజ కీయ నేతలకూ నోటీసులు జారీ అయ్యాయి. విదేశాల్లో ఉన్నవారిని కూడా అందుబాటులో లేరని పేర్కొనగా వారందరికీ నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు వారంతా రావాల్సిందేనట.
పలువురు బీఎల్వోలు కాలు కదపకుండా కార్యాలయా ల్లోనే ఇష్టారీతిగా సర్వే ముగించారన్న ఆరోపణలు ఉన్నాయి. షిఫ్ట్ అయిన వారు, అందుబాటులో లేనివా రు అంటూ ప్రత్యేక కాలమ్‌లో పేర్కొంటూ విధుల్లో నిర్లక్ష్యం చేశారనే వాద నలూ ఉన్నాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామస భలు, వార్డు సభలు జరగ్గా, చాలాచోట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసిన హరికృష్ణకు కూడా నోటీసులు ఇచ్చారు. ప్రసన్న హరికృష్ణగా పేరు మార్చుకోగా నోటీస్ ఇచ్చారు.
అన్ని జిల్లాల్లో అంతే..
ఎన్నికల సంఘం ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాలో రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో లేనివారు, శాశ్వతంగా షిఫ్ట్ అయినవారంటూ లక్షల్లో సంఖ్య చూపించారు. ఇప్పుడవన్నీ సక్రమమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్‌కు కూడా నోటీసు జారీ అయ్యింది. పేరులో తప్పు ఉందంటూ పేర్కొంటూ నోటీసు జారీ చేశారు. ఎమ్మెల్యే కుమార్తె రెవా ఠాకూర్‌కు కూడా నోటీసు జారీ అయ్యింది.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం వంగసుదర్శన్ రెడ్డినగర్‌కు చెందిన కోనేటి రాములు పేరు మారింది. ఇటీవల చేపట్టిన ఓటరు నమోదులో కోనేటి అమ్ములుగా నమోదు చేశారు. పాత ఓటరు జాబితాలో కోనేటి రాములు ఉంటే కోనేటి అమ్ములుగా మారడమేంటన్నది రాములు ప్రశ్న.
ఈమె పేరు ఆకుల శోభ. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మునిసిపాలిటీలోని 6వ వార్డులో ఉంటోంది. . 2002లో ఓటు హక్కు వినియోగించుకోగా తాజా జాబితాలో పేరు లేదు. ఫారం నింపి బీఎల్వోకు ఇచ్చానని అయినా ఓటరు జాబితాలో పేరు లేదని వాపోయింది.
ఈమె పేరు బి.సునీత. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఏకశిలానగర్‌లో ఉంటోంది. ఓటు ఉన్నా, మ్యాపింగ్ కాలేదంటూ నోటీస్ ఇచ్చారు. ఓటరు జాబితాలో పేరు ఉండగా ఈ నోటీస్ ఎందుకని ఆందోళన చెందుతోంది.



99% నోటీసులు సిద్ధం!
92,87,577 మంది ఓటర్లకు జారీ కానున్న నోటీసులు
92,10,218 మంది ఓటర్ల నోటీసుల జనరేషన్ పూర్తి
దశల వారీగా ఓటర్లకు జారీ కానున్న నోటీసులు
8,84,462 మంది ఓటర్లకు పంపిణీ పూర్తి
నోటీసు వస్తే వారంలోగా విచారణకు హాజరుకావాలి
2,241 మంది ఓటర్ల విచారణ ..నలుగురు అనర్హులుగా నిర్ధారణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ–2026లో భాగంగా వ్యత్యాసాలు (అనామలిస్) కలిగిన ఓటర్లతోపాటు మ్యాపింగ్ జరగని ఓటర్లు కలిపి మొత్తం 92,87,577 మందికి నోటీసులు జారీ చేసి విచారించాల్సి ఉండగా, గురువారం మధ్యాహ్నం 2.30 గంటల నాటికి 92,10,218 (99.16%) మంది ఓటర్లకు సంబంధించిన నోటీసులను స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వో) జనరేట్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సాఫ్ట్‌వేర్ ద్వారా మిగిలిన 77,931 మంది ఓటర్ల నోటీసులు జనరేట్ చేయాల్సి ఉంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇదే సమయానికి 8,84,462 మంది ఓటర్లకు స్థానిక బూత్ స్థాయి అధికారుల (బీఎల్‌ఓ) ద్వారా నోటీసుల పంపిణీ సైతం పూర్తి చేశారు. మిగిలిన 83,25,756 మంది ఓటర్లకు నోటీసులు జారీ కావాల్సి ఉంది.
రోజుకు 2,32,204 మందికే నోటీసులు...
సర్, 2026లో భాగంగా ఇటీవల 2,64,87,213 మంది ఓటర్ల పేర్లతో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించగా, వారిలో 92,87,577 మంది(35.06%) ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సి ఉంది. సర్–2002 ఓటర్ల జాబితాలో ఓటరు పేరు/ తల్లిదండ్రుల పేరు/వారి తల్లిదండ్రుల పేరు ఉన్నట్టు ఎన్యూమరేషన్ ఫారంలో నమోదు చేయాల్సి ఉండగా, 32,36,659 మంది ఓటర్లు ఈ వివరాలను అందించకపోవడంతో వీరిని అన్‌మ్యాప్డ్ ఓటర్లుగా గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు. ఇక ఫారంలో ఈ వివరాలిచ్చిన వారిలో 60,50,918 మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలుండడంతో వీరికి సైతం నోటీసులు జారీ చేస్తున్నారు.
ఈ రెండు కేటగిరీలతో కలిపి మొత్తం 92 లక్షల మందికి ఒకేసారి నోటీసులను జారీ చేస్తే రాష్ట్రంలో తీవ్ర గందరోగళం ఏర్పడే ప్రమాదంఉంది. ఈ నేపథ్యంలో దశలవారీగా నోటీసులు జారీ చేసి విచారణకు పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. సగటున రోజుకు రాష్ట్రంలో 2,32,204 మందికి నోటీసులు జారీ చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. సర్, 2026 షెడ్యూల్ ప్రకారం నోటీసుల జారీ, విచారణ ప్రక్రియ అక్టోబర్ 15తో ముగించాల్సి ఉండగా, మిగిలిన ఓటర్లకు ఆలోగా నోటీసులు జారీ చేస్తారు.
రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో ఓటర్లు కలిగిన కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా రోజుకు 9,338 మందికి నోటీసులు జారీ చేయాలని నిర్ణ యించగా, శేరిలింగంపల్లిలో 8,612 మందికి, మేడ్చల్‌లో 7,415 మందికి రోజూ నోటీసులు జారీ చేయనున్నారు. అత్యల్పంగా సత్తుపల్లి నియోజకవర్గంలో 504 మందికి, మునుగోడులో 514 మందికి, వైరాలో 549 మందికి మాత్రమే నోటీసులు జారీ కానున్నాయి.
అప్పుడే అనర్హులుగా తేలిన నలుగురు ఓటర్లు
నోటీసులు అందిన వారం రోజుల్లోగా విచారణకు హాజరై ఈసీ నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని రుజువుగా సమర్పించాల్సి ఉంటుంది. నోటీసుల్లో విచారణ తేదీ, సమయం, ప్రదేశం ముద్రించి ఉంటుంది. గురువారం నాటికి రాష్ట్రంలో 2,241 మంది ఓటర్ల విచారణ పూర్తి కాగా, అందులో 482 మంది ఓటర్లు తుది జాబితాలో పేరు ప్రచురించడానికి అర్హులని నిర్ధారించారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో ఇద్దరు, కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇద్దరు కలిపి ఇప్పటి వరకు మొత్తం ఓ నలుగురు ఓటర్లు తుది జాబితాలో పేరు ప్రచురించడానికి అనర్హులని స్థానిక ఈఆర్వోలు తేల్చారు.
నోటీసు జారీ అయ్యాక వారంలోగా విచారణకు హాజరు కావాల్సి ఉండగా, 11,075 మంది ఓటర్ల విచారణ తేదీ ల్యాప్స్ అయింది. వాస్తవానికి వీరిలో చాలా మంది చేతికి నోటీసులు అందకపోవడంతో ఇలా జరిగింది. దీంతో వీరిని మరో తేదీకి విచారణకు పిలవనున్నారు. అక్టోబర్ 15లోగా నోటీసుల జారీ, విచారణ ప్రక్రియ ముగించి అర్హులుగా తేల్చిన ఓటర్ల పేర్లతో అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు.
నిస్సహాయ ఓటర్లకు బిగ్ రిలీఫ్
నోటీసులు వస్తే కుటుంబ సభ్యులు హాజరయ్యేందుకు వెసులుబాటు
సాక్షి, హైదరాబాద్: వయోవృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, విదేశాల్లో ఉన్న ఓటర్లకు ఎన్నికల సంఘం ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ–2026లో భాగంగా ఈసీ నోటీసు లు జారీ చేస్తే విచారణకు హాజరయ్యే విషయంలో వీరికి మినహాయింపు కల్పించింది. వారి తరఫున కుటుంబంలోని వయోజనులు హాజరయ్యేందుకు అనుమతించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్లకు గురువారం ఆదేశాలు పంపారు. ఈ ఓటర్ల తరఫున వారి కుటుంబసభ్యులు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వద్ద విచారణకు హాజరై అవసరమైన పత్రాలు/ సమాచారాన్ని సమర్పించవచ్చు అని తెలిపారు.
సర్పంచ్ ఓటు గాయబ్
యాదగిరిగుట్ట రూరల్ : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగాం గ్రామ సర్పంచ్ తుమ్మల జ్యోతికి ఓటే లేకుండా పోయింది. ఓటర్ల జాబితాను గ్రామ సభలో గురువారం ప్రకటించారు. అయితే ఈ లిస్ట్‌లో సర్పంచ్ తుమ్మల జ్యోతి పేరు కనిపించలేదు. దీంతో ఆశ్చర్యపోయిన సర్పంచ్ గ్రామ సభకు వచ్చిన రెవెన్యూ అధికారులు, బీఎల్వోను ఓటు ఏమైందని నిలదీశారు. ఆరా తీసిన అధికారులు, ఓటు పొరపాటున గల్లంతైందని గుర్తించారు. సర్పంచ్ ఓటును మళ్లీ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని అధికారులు చెప్పారు.
51 ఏళ్ల వ్యక్తి... 126 ఏళ్ల ఓటరుగా నమోదు
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం గ్రామ ఓటరు జాబితాలో ఓ వ్యక్తి వయస్సు ఏకంగా 126 ఏళ్లుగా నమోదైంది. గ్రామానికి చెందిన గుండు రామారావు వయస్సు ప్రస్తు తం 51 ఏళ్లు కాగా.. ఎన్నికల కమిషన్ ఇటీవల విడుదల చేసిన ముసాయిదా జాబితాలో 126 సంవత్సరాలుగా నమోదై ఉంది. పాత ఓటరు గుర్తింపు కార్డులో 1995 జనవరి 1నాటికి రామా రావు వయస్సు 20 ఏళ్లుగా నమోదైంది. అయితే తాజా ముసాయిదా జాబితా తోపాటు నెట్‌లో కొత్త ఓటరు కార్డు డౌన్‌లోడ్ చేసుకోగా జనన తేదీ 1900 జనవరి 1గా నమోదైంది. గురువారం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో రామారావు వయస్సును సవరించాలని దరఖాస్తు ఇచ్చారు.
12 ఏళ్ల కిందటే చనిపోయినా ఓటు భద్రం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని ఓ ఇంటి యజమాని 12 ఏళ్ల కిందటే చనిపోయింది. కానీ, ఆమె ఓటు ముసాయిదా జాబితాలో ఫొటో అవైలబుల్ అని వచ్చింది. మృతురాలి ఓటు తొలగించమని కుటుంబసభ్యులు చెప్పినా ఫలితం లేకపోయింది. ఇదే ఇంటి నుంచి 4 ఏళ్ల కిందటే ఖాళీ చేసి వెళ్లిపోయిన దంపతుల ఓట్లు భద్రంగా ఉండగా, 14 ఏళ్లుగా నివాసం ఉంటున్న దంపతుల ఓట్లు మాత్రం ముసాయిదాలో లేవు.


