వచ్చిపోయే సమయాలపై దృష్టి
ఎఫ్‌ఆర్‌ఎస్ పటిష్టతకు ప్రత్యేక చర్యలు
పలుచోట్ల ఉపాధ్యాయులకు నోటీసులు
ఆలస్యంగా వచ్చిన దానిపై వివరణ
ముఖ గుర్తింపులో అనేక సమస్యలు
సరిగ్గా పనిచేయని సర్వర్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉపాధ్యాయులపై నిఘా పెరిగింది. వారి ప్రతీ కదలికను పసిగడుతున్నారు. పాఠశాలకు వచ్చిపోయే సమయాలు, వ్యక్తిగతంగా వారి కార్యకలాపాలపై ఆరా తీస్తున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్) ద్వారా హాజరు తీసుకుంటున్నారు.
జీపీఎస్ ఆధారంగా జరిగే ఈ ప్రక్రియలో ఏమాత్రం ఆలస్యంగా వచ్చినా నోటీసులు ఇస్తున్నారు. గడచిన పది రోజులుగా ప్రతీ జిల్లాల్లోనూ 30 మందికి తగ్గకుండా నోటీసులు వెళ్లాయి. ఆలస్యానికి కారణాలు చెప్పాలని డీఈఓలు వెంటబడుతున్నారు. ఇతర వ్యాపారాలు, రియల్ ఎస్టేట్‌లో మునిగి తేలే టీచర్ల జాతకాలను కూడా సేకరిస్తున్నారు. పనిచేసే ప్రాంతానికి వారు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారు? స్కూల్‌కు ఏ విధంగా వస్తున్నారు? అనే వివరాలు తెలుసుకుంటున్నారు.
ఎందుకీ నిఘా..: ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. దీనిపై గత నెల సీఎం ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి అధ్యయన నివేదికను ఉన్నతాధికారులు సీఎం వద్ద ఉంచారు. ప్రభుత్వ స్కూళ్లల్లో టీచర్లు సకాలంలో రావడం లేదని, ప్రతి రోజూ ఆలస్యంగా వస్తున్నారని, పాఠాలు కూడా సరిగ్గా చెప్పడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయన్నారు. కొంతమంది స్కూల్‌కు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారని, రావడం, పోవడంతో అలసిపోయి బోధనపై శ్రద్ధ చూపడం లేదని నివేదికలో పేర్కొన్నారు.20 వేల మంది ఉపాధ్యాయులు ఈ విధంగా దూర ప్రాంతాల్లో ఉంటున్నట్టు తెలిపారు.
38 వేల మంది టీచర్లు ప్రభుత్వ ఉద్యోగంతో తృప్తి పడటం లేదని, ఏదో ఒక వ్యాపారం చేస్తున్నారనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కొంతమంది చిట్టీలు, మరికొంతమంది రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు చెబుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జిల్లాల వారీగా ప్రతీ టీచర్ సమగ్ర వ్యక్తిగత డేటాను కోరినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే నిఘా పెంచినట్టు పాఠశాల విద్య డైరెక్టరేట్ కార్యాలయం ద్వారా తెలిసింది.
ఎఫ్‌ఆర్‌ఎస్‌తో సమస్యలు..: పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నారంటూ నోటీసులు అందుకున్న టీచర్లు విభిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ వల్ల ఎదురయ్యే సమస్యలను ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఉదయం 9 గంటలకల్లా స్కూల్‌కు వెళ్లి సెల్‌ఫోన్ యాప్ ద్వారా ముఖాన్ని చూపించి, స్కూల్ ప్రాంగణం నుంచే హాజరు నమోదు చేయాలి. అయితే కొన్నిసార్లు నెట్‌వర్క్ సమస్య వస్తోందని టీచర్లు అంటున్నారు.
దీనివల్ల ఉదయం హాజరు నమోదు కావడం లేదని, సాయంత్రం వేసే హాజరు...ఉదయం హాజరుగా నమోదు అవుతోందని, లేదా ఆలస్యంగా నమోదు అవుతోందని టీచర్లు అంటున్నారు. సాంకేతిక సమస్యలను అర్థం చేసుకోకుండా నోటీసులు ఇస్తున్నారనేది వారి వాదన. మారుమూల ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వాదనను మాత్రం పాఠశాల డైరెక్టరేట్ కార్యాలయం అంగీకరించడం లేదు. అన్నిచోట్ల నెట్‌వర్క్ ఉన్నప్పుడు ఈ సమస్య రావడానికి వీల్లేదని చెబుతున్నారు.


