బంగారం.. రాగి వెలికి తీసి దేశ సంపద పెంచుదాం | Deputy CM officially launched the gold mining exploration program | Sakshi
Sakshi News home page

బంగారం.. రాగి వెలికి తీసి దేశ సంపద పెంచుదాం

Aug 28 2026 4:49 AM | Updated on Aug 28 2026 4:49 AM

Deputy CM officially launched the gold mining exploration program

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 

దేవదుర్గలో కాపర్, గోల్డ్‌ మైనింగ్‌ అన్వేషణ అధికారికంగా  ప్రారంభం 

క్షేత్రస్థాయిలో స్వయంగా ఖనిజ ప్రాంతాల పరిశీలన 

సాక్షి, హైదరాబాద్‌: ‎కర్ణాటకలోని దేవదుర్గ గని నుంచి పెద్ద ఎత్తున బంగారం, రాగి ఖనిజాలను వెలికితీసి దేశ సంపదను పెంపొందించడానికి కలిసికట్టుగా కృషి చేద్దామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ‎రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా లింగదహళ్ళి గ్రామంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కాపర్, గోల్డ్‌ మైనింగ్‌ అన్వేషణ కార్యక్రమాన్ని గురువారం అధికారికంగా డిప్యూటీ సీఎం ప్రారంభించారు. అనంతరం ఖనిజ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. 

కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో దేవదుర్గ బ్లాక్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ (అన్వేషణ) హక్కులను దక్కించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ‎ఈ క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఆయన మాట్లాడుతూ అన్వేషణ పనులను సింగరేణి సంస్థ త్వరలోనే వేగవంతం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు విజయవంతమై ఇక్కడ బంగారం, రాగి విరివిగా లభిస్తే ప్రాంతీయంగా నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభించడమే కాకుండా ఈ ప్రాంతం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

త్వరలోనే అక్కడ పర్యవేక్షణకు సైట్‌ ఆఫీసును ప్రారంభిస్తామన్నారు. స్థానిక ప్రజల అండదండలతో ఈ ప్రాజెక్టును త్వరలోనే విజయవంతంగా పూర్తి చేసి దేశ సంపదను పెంచడానికి ఉపయోగపడదామని పిలుపునిచ్చారు. ఈ అన్వేషణ రెండు రాష్ట్రాల పురోగతికి, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎంతగానో దోహదపడుతుందని ఆకాంక్షించారు. ‎దేవదుర్గ ప్రాంతంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని సింగరేణి సీఎండీ డాక్టర్‌ బుద్ధ ప్రకాష్‌ జ్యోతి అన్నారు. ఈ ప్రాంతంలో గతంలో సీఐగా పని చేశానని, ప్రస్తుతం సింగరేణి సీఎండీగా పనులను స్థానికుల సమక్షంలో ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. 

బంగారం, రాగి ఖనిజ బ్లాకు పరిశీలన 
పర్యటనలో భాగంగా లింగదహళ్ళిలోని దేవదుర్గ బంగారు ఖనిజ బ్లాక్‌ వ్యూ పాయింట్‌ నుంచి ఖనిజ అన్వేషణ  చేపట్టనున్న ప్రాంతాలను ఉప ముఖ్యమంత్రి భట్టి పరిశీలించారు. అనంతరం అక్కడి బ్లాక్‌ నుంచి సింగరేణి అధికారులు సేకరించిన వివిధ రకాల ఖనిజ నమూనాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించారు. సింగరేణి అధికారులు మరియు కర్ణాటక రాష్ట్ర అధికార యంత్రాంగంతో డిప్యూటీ సీఎం సమీక్షా సమావేశం నిర్వహించి ఖనిజ అన్వేషణపై దిశా నిర్దేశం చేశారు.  

కర్ణాటక మంత్రితో భట్టి సమావేశం 
బెంగళూరు పర్యటనలో భాగంగా కర్ణాటక ఇంధన శాఖమంత్రి కె.జె.జార్జ్‌తో గురువారం భట్టి సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య ఇంధన రంగ పురోగతి, బొగ్గు సరఫరా, బొగ్గు కొనుగోళ్ల చెల్లింపులు, సాంకేతికత మారి్పడిపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు.  ‎పెరుగుతు న్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా తగినంత బొగ్గును అందించడం కోసం సింగరేణి సంస్థ, కర్ణాటక పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సంస్థలు కలిసి పని చేద్దామని కె.జె.జార్జ్‌కు భట్టి ప్రతిపాదన చేశారు. ఈ సమావేశంలో కర్ణాటక అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీ గౌరవ్‌ గుప్తా, సింగరేణి సంస్థ సీఎండీ బుద్ధప్రకాశ్‌ జ్యోతి పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement