ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్ పిల్లల గొంతు నొక్కుతారా?
జీఓ 97 రద్దు చేసి ఏపీ, ఢిల్లీ తరహాలో తప్పును వెనక్కి తీసుకోవాలి
ఢిల్లీకో నీతి, తెలంగాణకో నీతా? రాహుల్ తెలంగాణకు ఎందుకు రారు?
దేశంలో ఆరు డీఏలుపెండింగ్‌లో పెట్టిన ఘనత రేవంత్‌రెడ్డి సర్కారుదే
హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా.. అరెస్టు
సాక్షిప్రతినిధి, వరంగల్: విద్యార్థులు ఏమైనా టెర్రరిస్టులా? తమ సమస్యలపై ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్ పిల్లల గొంతు నొక్కుతారా? అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 97ను వెంటనే రద్దు చేసి, పాలిటెక్నిక్ విద్యను యథావిధిగా ప్రభుత్వ అ«దీనంలోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వరంగల్‌లో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న తనను పోలీసులు అరెస్ట్ చేయడంపై హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురువారం హనుమకొండలోని సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో మీడియాతో మాట్లాడుతూ తమ భవిష్యత్తును కాపాడాలని విద్యార్థులు ఆందోళన చేస్తుంటే వారిపై కేసులు, భౌతిక దాడులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడం తప్పెలా అవుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం పాలిటెక్నిక్ విద్యార్థులు మూడేళ్లకు రూ.15 వేలలోపే ఫీజుతో చదువుతున్నారని, భవిష్యత్తులో ఫీజులు పెరిగితే పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు.
ఏపీ, ఢిల్లీని ప్రస్తావిస్తూ విమర్శలు...
ఏపీలో పాలిటెక్నిక్‌లను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని, ఢిల్లీలోనూ ఇలాంటి విధానం విఫలమైందని హరీశ్‌రావు పేర్కొన్నారు. అక్కడ తప్పని తేలిన విధానాన్ని తెలంగాణలో ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. ‘ఏపీ, ఢిల్లీ తరహాలో జీవో 97ను వెనక్కి తీసుకోవాలి’అని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలను అరెస్టులు, కేసులతో అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.
జీవో 97 రద్దు చేయకపోతే విద్యార్థులు, యువత మరింత పెద్ద ఎత్తున ఉద్యమించే పరిస్థితి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు సమస్యలపై ఆందోళనలు చేస్తున్నారని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడటం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘ఢిల్లీకో నీతి.. తెలంగాణకో నీతా?’అంటూ విమర్శించారు.
టీఎన్జీఓలకు మద్దతు..
హనుమకొండ కలెక్టరేట్ వద్ద టీఎన్జీఓలు చే పట్టిన ధర్నా, ఆందోళన కార్యక్రమంలో కూడా హరీశ్‌రావు పాల్గొన్నారు. ధర్నా శిబి రానికి చేరుకుని ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన ఆయన వారి న్యాయమైన డిమాండ్లకు బీఆర్‌ఎస్ పక్షాన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అధికారంలోకి వచ్చి మూ డేళ్లు దగ్గరపడుతున్నా.. ఇప్పటివరకు సీపీఎస్ రద్దు లేదు, పీఆర్సీకి మోక్షం లేదని అ న్నారు.
‘దేశంలో ఆరు డీఏలు పెండింగ్‌లో పెట్టిన ఘనత మీ సర్కారుదే. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పట్టవు. రైతుల సమస్యలు పట్టవు. రేవంత్‌రెడ్డి.. మీరు సర్కారు నడుపుతున్నారా? సర్కస్ నడుపుతున్నారా?’అని ప్రశ్నించారు.‘ప్రతిపక్షం ప్రశ్నించే హక్కును కూడా కాలరాస్తున్నారు.ఈ దౌర్జన్యాలకు ఏదో ఒక రోజు తగిన మూ ల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంది’అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్ హెచ్చరించారు.
కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత..
హరీశ్‌రావు పర్యటన ముందే లీక్ కావడంతో మార్గమధ్యలోనే అడ్డుకునేందుకు పోలీసులు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, విద్యార్థి నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. టీఎన్‌జీఓల ధర్నాలో పొల్గొన్న హరీశ్‌రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులను కలెక్టరేట్ వద్ద అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ నాయకులు తరలివచ్చి పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టడంతో సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. క్రమంగా అరెస్ట్ చేసిన హరీశ్‌రావును, నాయకులను వెంటనే విడుదల చేయా లని డిమాండ్ చేశారు. తర్వాత వారిని సొంతపూచీకత్తుపై విడుదల చేశారు.


