పోషకాల దుర్వినియోగంతో ముప్పు! రైతులకు ఎఫ్‌ఏఓ హెచ్చరిక! | Soil Health Fertilizer Misuse FAO Report Indian Agriculture | Sakshi
Sakshi News home page

పోషకాల దుర్వినియోగంతో ముప్పు! రైతులకు ఎఫ్‌ఏఓ హెచ్చరిక!

Aug 28 2026 9:19 AM | Updated on Aug 28 2026 9:19 AM

Soil Health Fertilizer Misuse FAO Report Indian Agriculture

ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)

సాగుబడి

నేలకు ఇస్తున్న పోషకాల కన్నా తీసుకునే పోషకాలే ఎక్కువ

‘పొలాల్లో పోషకాల దుర్వినియోగం’పై ఎఫ్‌ఏఓ తాజా నివేదికలో కీలక హెచ్చరికలు

రైతుల పొలాల్లో పోషకాల అసమతుల్యత లేదా దుర్వినియోగం వల్ల నేల సారం క్రమంగా క్షీణిస్తోంది. అవసరం ఎంతో తెలుసుకోకుండా కొన్ని ఎరువులను ఎక్కువ ఎవయ్యటం, కొన్నిటిని తక్కువ వెయ్యటం సమస్య. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) రూపొందించిన ‘స్టేటస్‌ ఆఫ్‌ ది వరల్డ్స్‌ సాయిల్‌ రిసోర్సెస్‌’ తాజా నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా నేల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ప్రధాన సమస్యల్లో మొదటిది: ‘నీరు, గాలి వల్ల పైపొర మట్టి కొట్టుకుపోవటం’. రెండోది: ‘నేలలోని సహజ సేంద్రియ పదార్థం, సారం తగ్గిపోవటం’. ‘పోషకాల నిర్వహణ లోపం లేదా దుర్వినియోగం’ (న్యూట్రియంట్‌ మిస్‌మేనేజ్‌మెంట్‌) మూడో అతిపెద్ద ముప్పుగా నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా 63 శాతం ప్రాంతాలు, ఉప్రపాంతాలు పోషకాల దుర్వినియోగాన్ని అరికట్టే స్థానికంగా అవసరమైన సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించటంలో దారుణంగా విఫలమవుతున్నాయని ఎఫ్‌ఏఓ నివేదిక ఎత్తిచూపింది. 50 శాతం ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగుపడకపోగా క్షీణిస్తున్నాయని పేర్కొంది. ఉత్తర అమెరికాలో మాత్రమే మాత్రమే పోషకాల దుర్వినియోగాన్ని అరికట్టే పద్ధతుల అమలులో మెరుగ్గా ఉందని ఎఫ్‌ఏఓ తెలిపింది.

రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు
నేలలో పోషకాల అసమతుల్యతకు సంబంధించి ఎఫ్‌ఏఓ నివేదికలో మూడు ముఖ్య అంశాలను ప్రస్తావించింది:
1. పోషకాల కొరత (న్యూట్రియెంట్‌ మైనింగ్‌): పంటల ద్వారా గ్రహించే లేదా నేల నుంచి ఆహారోత్పత్తుల ద్వారా మనం పొందే పోషకాల కంటే నేలకు తక్కువ మోతాదులోనే ఎరువులను అందించటం. దీనివల్ల కాలక్రమేణా నేలలోని సహజ పోషక నిల్వలు, సేంద్రియ పదార్థం పూర్తిగా తగ్గిపోతాయి.

2. ఎరువుల అధిక వినియోగం (న్యూట్రియెంట్‌ ఎక్సెస్‌): పంటకు అవసరమైన దానికంటే ఎక్కువగా నత్రజని, భాస్వరం ఎరువులు వేయటం. మితిమీరిన ఈ రసాయనాలు కాలువలు, భూగర్భ జలాల్లో చేరి నీటిని కలుషితం చేస్తున్నాయి. నైట్రేట్లు మానవ ఆరోగ్యానికి ముప్పుగా మారుతుండగా, నత్రజని అధిక వాడకం వల్ల ప్రమాదకర వాయువులైన నైట్రస్‌ ఆక్సైడ్, అమ్మోనియా విడుదలై వాతావరణం దెబ్బతింటోంది.

3. నేల ఆమ్లీకరణ (సాయిల్‌ అసిడిఫికేషన్‌): ఆమ్ల గుణం కలిగిన రసాయన ఎరువులను విచ్చలవిడిగా వాడటం వల్ల నేలలో ఆమ్లతత్వం పెరిగి, నేలలో ఉండే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించి నేల సారం నాశనమవుతోంది.

భారత్, దక్షిణాసియా దేశాల్లో పరిస్థితి
దక్షిణాసియా ప్రాంతంలో భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ దేశాల్లో పంటలకు అవసరానికి మించి నత్రజని, భాస్వరం ఎరువులను వేస్తున్నట్లు ఎఫ్‌ఏఓ నివేదిక వెల్లడించింది. మరోవైపు, పంట కోతల అనంతరం మిగిలిన పంట వ్యర్థాలను (వరి గడ్డి, చొప్ప, పత్తి కట్టె, కంది కట్టె వంటివి ) పొలం మట్టిలో తిరిగి కలిసేలా చెయ్యకుండా పూర్తిగా తొలగించటం వల్ల నేలలో పొటాషియం వంటి పోషకాలు వేగంగా తరిగిపోతున్నాయి.

భవిష్యత్తుపై ప్రభావం.. నివారణ మార్గాలు
పోషకాల అసమతుల్యత వల్ల వ్యవసాయం అస్తవ్యస్తమవుతుంది. అంతేకాదు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన ‘ఆకలి నిర్మూలన’, ‘మంచి ఆరోగ్యం’, ‘స్వచ్ఛమైన నీరు’, ‘వాతావరణ పరిరక్షణ చర్యలు’, ‘భూమిపై జీవవైవిధ్యం’ దెబ్బతింటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 63 శాతం ప్రాంతాల్లో స్థిరమైన నేల నిర్వహణ పద్ధతుల అమలు చాలా నాసిరకంగా ఉంది.

రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులు వేయటం ఆపాలి. పంట అవసరాన్ని బట్టి కచ్చితమైన మోతాదులో ఎరువులు అందించే ‘సైట్‌–స్పెసిఫిక్‌ న్యూట్రియెంట్‌ మేనేజ్‌మెంట్‌’ (ఎస్‌ఎస్‌ఎన్‌ఎం), భూసార పరీక్షలు, సేంద్రియ ఎరువుల వాడకం, పంట వ్యర్థాల పునర్వినియోగం వంటి చర్యలను సమర్థవంతంగా అమలు చెయ్యటం ద్వారానే నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నివేదిక స్పష్టం చేస్తోంది.

మన దేశంలోనూ దుర్వినియోగమే!
భారత వ్యవసాయ రంగంలో పోషకాల దుర్వినియోగం తీవ్రంగా ఉంది. భారతదేశం సహా దక్షిణాసియా ప్రాంతంలో ఎరువుల దుర్వినియోగాన్ని అరికట్టే సుస్థిర వ్యవసాయ పద్ధతుల అమలు సరిగ్గా లేకపోవటంతో నేల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని ఆహార వ్యవసాయ సంస్థ నివేదిక హెచ్చరించింది. ప్రధానంగా రెండు విరుద్ధ సమస్యలతో భారతీయ వ్యవసాయ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది.

  • భారతదేశంలో రైతులు పంటల అవసరానికి మించి నత్రజని, భాస్వరం ఎరువులను విచ్చలవిడిగా వాడుతున్నారు. దీనివల్ల ఎరువులు వృథా అవ్వడమే కాకుండా భూగర్భ జలాలు కలుషితం కావటం, నైట్రస్‌ ఆక్సైడ్‌ వంటి గ్రీన్‌ హౌస్‌ వాయువులు, అమ్మోనియా విడుదల కావటం వల్ల పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలుగుతోంది.

  • పంట కోతల అనంతరం మిగిలిన పంట వ్యర్థాలను పొలం నుంచి పూర్తిగా తొలగించటం వల్ల నేలలో సహజంగా ఉండే పొటాషియం నిల్వలు వేగంగా క్షీణిస్తున్నాయి.

- నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

ఇవి కూడా చదవండి: అమెరికా ఉద్యోగాన్ని కాదని వ్యవసాయం..! ఏకంగా ఆరుసార్లు దివాళ అంచుకు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement