చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
అభిప్రాయం
ఒకవైపు ఉక్రెయిన్–రష్యా యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతుండగానే అనూహ్యంగా కొత్త సంక్షోభాలు ప్రారంభమయ్యాయి. హార్మూజ్ జలసంధి ప్రాంతంలో శాంతి ఎండమావిగా తోస్తున్నది. ఇజ్రాయెల్ అనూహ్యంగా సిరియాను, తద్వారా టర్కీని కూడా యుద్ధంలోనికి లాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్‌పై సైనిక దాడికి దిగిన ట్రంప్ సరికొత్తగా ఆ దేశంపై ఆర్థిక యుద్ధం పల్లవి అందుకున్నాడు. ఇరాన్‌తో వాణిజ్య, ఆర్థిక లావాదేవీలు జరుపుతున్న దేశాలపై ఆంక్షలు విధించాలన్న ట్రంప్ విధానం అమలైతే తీవ్రంగా నష్టపోయేది చైనా. ఇరాన్ చమురులో 90 శాతం చైనా కొనుగోలు చేస్తున్నది. ఈ రకంగా ఇరాన్ యుద్ధంలోనికి ప్రత్యక్షంగా చైనాను లాగటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే సందేహం కలుగుతున్నది. మరొకవైపు ఇజ్రాయెల్ ప్రధాని, ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ పల్లవిని అందుకున్నాడు. ఇంకొకవైపు సౌదీ– పాకిస్తాన్–టర్కీ ‘మక్కా ఒప్పందం’తో నాటో తరహా సైనిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. బంగ్లాదేశ్ ప్రధాని మక్కా ఒప్పందంలోనికి చేరటానికి సంకేతాలివ్వటం భారత్‌ను ఒత్తిడిలోనికి నెట్టింది. వేగంగా మారుతున్న సమీకరణాలు ప్రపంచాన్ని మూడవ ప్రపంచ యుద్ధంవైపు తీసుకెళ్తున్నాయా అనే సందేహాన్ని కలిగించక మానవు.
ప్రపంచ యుద్ధాల నేపథ్యం
మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఐరోపా రెండు రాజకీయ /సైనిక కూటములుగా చీలిపోయింది. బ్రిటన్ ఆధిపత్యాన్ని జర్మనీ సవాలు చేసింది. పాన్ జర్మనిక్, పాన్ స్లావిక్, బాల్కన్ జాతీయవాద ధోరణులు బలంగా వ్యాపించి ఉన్నాయి. జూన్ 1914లో ఆస్ట్రియా– హంగరీ సామ్రాజ్య వారసుడు ఫ్రాంక్ ఫెర్డినాండ్ హత్యతో సెర్బియాపై ఆస్ట్రియా యుద్ధాన్ని ప్రకటించింది. కూటమి ధర్మంలో భాగంగా సెర్బియాకు మద్దతుగా రష్యా, ఆస్ట్రియాకు మద్దతుగా జర్మనీ యుద్ధంలో చేరాయి. జర్మన్ సైనికాధికారి ‘షెఫర్’ యుద్ధ తంత్రంలో భాగంగా తటస్థ దేశమైన బెల్జియంపై దాడి చేయాల్సి వచ్చింది. ఈ రకంగా యుద్ధం ఐరోపా మొత్తం విస్తరించింది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత కుదిరిన వెర్సెయిల్స్ ఒప్పందంలో భాగంగా జర్మనీపై విధించిన యుద్ధనష్ట పరిహారం, ఇతర అంశాలను అమలు చేసే యంత్రాంగం లేకపోవడం, ఆర్థిక మాంద్యం (గ్రేట్ డిప్రెషన్), పునరుత్థానం చెందుతున్న జర్మనీ/ జపాన్ వంటి దేశాలు తమ ఆధిపత్యాన్ని పునఃస్థాపించటానికి సరి హద్దుల వ్యాప్తి (లెబెన్స్‌రామ్), లీగ్ ఆఫ్ నేషన్స్ వైఫల్యం రెండో ప్రపంచ యుద్ధానికి దారితీశాయి. ఫాసిజం, కమ్యూనిజం, లిబరల్ డెమోక్రసీ వంటి సిద్ధాంతాల వైరుధ్యం అగ్నికి ఆజ్యంపోశాయి.
ఈ సందర్భంలో ‘తూసిడైడీస్ ట్రాప్’ సిద్ధాంతాన్ని చర్చించు కోవాలి. ప్రాచీన చరిత్రకారుడైన తూసిడైడీస్... ఒక కొత్త రాజకీయ శక్తి ఎదుగుదల ప్రస్తుత రాజకీయ శక్తిలో సందేహాన్ని, భయాన్ని కలిగించినప్పుడు... ఇరు శక్తులు ఆయుధ సమీకరణ చేస్తాయనీ, అప్పుడు యుద్ధం అనివార్యమనీ సిద్ధాంతీకరించాడు. ప్రాచీన గ్రీక్ ప్రాంతంలో ఏథెన్స్ ఎదుగుదల స్పార్టాలో భయానికి కారణమై యుద్ధానికి దారితీసింది. 2017లో రాజకీయ శాస్త్రజ్ఞుడు గ్రాహమ్ ఆలిసన్ తన ‘డెస్టైన్డ్ ఫర్ వార్: కెన్ అమెరికా అండ్ చైనా ఎస్కేప్ తూసిడైడీస్స్ ట్రాప్?’ గ్రంథంలో ఈ సిద్ధాంతాన్ని విస్తృతంగా పరిశీ లించాడు. గత 500 ఏళ్ల చరిత్రలో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించిన 16 సందర్భాల్లో 12 సార్లు యుద్ధం జరిగిందని పేర్కొన్నాడు.
మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందా?
1914, 1939 సంవత్సరాలలో మాదిరిగానే ఇప్పుడూ ఒక కొత్త రాజకీయ శక్తి చైనా ప్రపంచ ఆధిపత్య రేసులోనికి వచ్చింది. ట్రంప్ ట్యారిఫ్ వార్‌లో చైనా, అమెరికాపై ప్రతిసుంకాలను విధించింది. ఇటీవల ట్రంప్ బీజింగ్ పర్యటన సందర్భంగా తైవాన్ విషయంలో అమెరికా జోక్యాన్ని సహించేది లేదని జిన్‌పింగ్ హెచ్చరించాడు. సెమికండక్టర్స్, చిప్స్, కృత్రిమ మేధ, క్రిటికల్ మినరల్స్ రంగాలలో అమెరికాకు, ఐరోపాకు చైనా నేరుగా సవాలు విసిరింది. 2020 నుండి రష్యా తిరిగి బలం పుంజుకొని నాటో ఆధిప త్యాన్ని సవాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే ఉక్రెయిన్‌పై ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. ఐక్యరాజ్యసమితి బలహీనపడటంతో మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల సమయంలో మాదిరిగా ఇప్పుడు కూడా యుద్ధాన్ని నిలువరించే వ్యవస్థలు లేవు. కోవిడ్ అనంతరం ప్రపంచ ఆర్థికాభివృద్ధి మందగించడం, గల్ఫ్ యుద్ధం, వాతావరణ మార్పుల వంటి వాటివల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది.రెండవ ప్రపంచ యుద్ధం తరువాత యుద్ధరంగంలోనికి అణ్వస్త్రాలు వచ్చి చేరాయి. ప్రధాన రాజకీయ శక్తులన్నీ అణ్వస్త్ర దేశాలే. వీటిమధ్య ప్రత్యక్ష యుద్ధం సంభవిస్తే, పరస్పర వినాశం అనివార్యం. అందువలన ఏ అణ్వస్త్ర దేశం ఇంకో అణ్వస్త్ర దేశంపైన దాడికి సాహసించే అవకాశం లేదు. ప్రస్తుత ప్రపంచంలోని వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకదానికొకటి పెనవేసుకొని ఉన్నాయి. అందువలన మూడవ ప్రపంచ యుద్ధం సంభవిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. ఏ రాజకీయ శక్తి కూడా ఈ దుస్సాహసానికి పాల్పడలేదు. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల సమయంలో మాదిరిగా ఇప్పుడు స్పష్టమైన పరస్పర, వైరుధ్య శత్రు కూటములు కూడా లేవు.
కొత్త కూటములు
అయితే కూటములు ఏర్పడే అవకాశాలూ కనపడుతున్నాయి. చైనా, రష్యా, ఇరాన్, నార్త్ కొరియా (క్రింక్) ఒక కొత్త సైనిక కూట మిగా ఏర్పడి నాటోను నేరుగా సవాలు చేయవచ్చు. మక్కా ఒప్పందంతో సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ కొత్త సైనిక కూటమిగా ఇప్పటికే ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో భారత్ వంటి దేశాలు ప్రత్యామ్నాయాలను వెదకాల్సి వస్తుంది. బహుశా దీనికి విరుగు డుగా భారత్–యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ – ఇజ్రాయెల్ – జపాన్ కూటమి అవతరించినా ఆశ్చర్యపోనవసరం లేదు. గ్రేటర్ ఇజ్రాయెల్లో భాగంగా నైలు నది నుండి యూఫ్రటీస్ నది వరకు లేదా, కనీసం జోర్డాన్ నది నుండి మద్యధరా సముద్రం వరకు ఇజ్రాయెల్ విస్తరణకు పూనుకుంటే గల్ఫ్ యుద్ధక్షేత్రం మరింత విస్తరిస్తుంది. ఇరాన్‌పై అమెరికా ఆర్థిక యుద్ధాన్ని తీవ్ర తరం చేస్తే నష్టపోయే చైనా... ఇరాన్‌కు ప్రత్యక్షంగా మద్దతు తెలప వచ్చు. దీంతో ఇరాన్... ఐరోపా దేశాలపై దాడులు చేయవచ్చు. ఇదే అదనుగా రష్యా ఇతర ఐరోపా దేశాలపై (ముఖ్యంగా బాల్టిక్ దేశాలపై) దాడులు చేసి ఉక్రెయిన్ యుద్ధాన్ని విస్తరించవచ్చు. శత్రువును నిలువరించటానికి ఇదే అనువైన సమయంగా భావించి తైవాన్‌ను చైనా స్వాధీనం చేసుకోవటానికి ఉపక్రమించవచ్చు. రష్యా, చైనాలకు మద్దతుగా దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా దాడి ప్రారంభించవచ్చు. ఇదే అదనుగా పాక్–చైనా కలిపి భారత్‌పై దాడి చేయవచ్చు. ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు. అయితే మూడవ ప్రపంచ యుద్ధం... దేశాలను, భూభాగాలను ఆక్రమించుకోవటానికి కాకుండా శత్రుదేశాల సామర్థ్యాన్ని ధ్వంసం చేసే దిశగా ఉంటుంది. నగరాలు, పౌరులు లక్ష్యంగా ఉండదు. రేవుల దిగ్బంధనం, రవాణా మార్గాల దిగ్బంధనం, ఆర్థిక విధ్వంసం, సైబర్, అంతరిక్ష దాడులు, ప్రాక్సీ వార్‌ఫేర్ రూపంలో ఉండవచ్చు.
గురజాల శ్రీనివాసరావు
వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);
సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు


