ఫ్లాష్‌ఫ్లడ్స్‌పై ఉద్దేశపూర్వకంగానే తమ దేశం ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదన్న నేపాల్ అధికారుల ఆరోపణలను చైనా ఖండించింది. ఇలాంటి ఆరోపణల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. ప్రస్తుత పరిస్థితుల్లో పరస్పర సహకారం మాత్రమే అవసరమని అభిప్రాయపడింది. అలాగే.. నేపాల్ జలవిలయంపై జరుగుతున్న ఓ ఫేక్ ప్రచారాన్ని కూడా తోసిపుచ్చింది.
నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ ఆకస్మిక వరదలపై నేపాల్‌లోని చైనా రాయబార కార్యాలయం గురువారం స్పందిచింది. తమ దేశం ముందస్తు హెచ్చరికలు ఇవ్వలేదన్న ఆరోపణలను తోసిపుచ్చింది. ఇలాంటి ఆరోపణల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, ప్రస్తుత పరిస్థితుల్లో సహకారంతోనే ప్రాణాలను కాపాడగలమని పేర్కొంది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో పరస్పర ఆరోపణల కంటే సహాయక చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి. బాధితులను ఆదుకోవడం, సహాయక చర్యలను వేగవంతం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలి’’ అని పేర్కొంది.
అలాగే చైనా వైపు ఉన్న ఓ డ్యామ్ కూలిపోయి.. నేపాల్‌లో ఈ విధ్వంసం జరిగిందన్న ఆరోపణలను బీజింగ్ ఖండించింది. ఈ వాదనలు పూర్తిగా అవాస్తవమని, ‘ఫేక్ న్యూస్’ అని ఖాట్మాండులోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

భూకంపం.. హిమపాతమే కారణం: చైనా
ఆగస్టు 26 ఉదయం భూకంపమో, భూకంపం మాదిరిగా మంచు ఫలకాలు కూలిపోవడం వల్లనో.. భారీగా మంచు, రాళ్లు, మట్టి, నీరు కలిసి ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు ప్రవహించడంతో ఫ్లాష్‌ఫ్లడ్స్ విపత్తు చోటుచేసుకుందని పేర్కొంది. రసువాగఢి-కెరుంగ్ సరిహద్దు ప్రాంతంలో ఇరుదేశాల వైపునా ఈ ప్రభావం కనిపించిందని చైనా వెల్లడించింది.
175 మంది మృతి.. వందలాది మంది గల్లంతు
హిమాలయ ప్రాంతంలో సంభవించిన ఈ ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. నీరు, మట్టి, రాళ్లు, మంచు కలిసి వచ్చిన భారీ ప్రవాహం గ్రామాలను ముంచెత్తింది. ఇప్పటివరకు 175 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. 1,300 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. రోడ్లు, భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
నేపాల్ వైపు భిన్న వాదనలు
వర్షం లేకున్నా.. మెరుపు వరదలు ముంచెత్తడంపై రకరకాల థియరీలు తెరపైకి వచ్చాయి. తొలుత భూకంపమే కారణమని అనుమానాలు వ్యక్తమైనా.. అమెరికా భూగర్భ సర్వే సంస్థ (USGS) తాజా విశ్లేషణలో అది భూకంపం కాదని, గ్లేసియర్ కూలిపోవడం వల్లే భారీ ప్రకంపనలు, ఫ్లాష్‌ఫ్లడ్స్ సంభవించాయని వెల్లడించింది. భారత్‌కు చెందిన ఇస్రో మాత్రం తన ఉపగ్రహ చిత్రాల విశ్లేషణతో.. వరదలకు ముందు సంభవించిన భూకంపం.. గ్లేసియర్ కూలిపోవడానికి ట్రిగ్గర్‌గా మారి ఉండొచ్చని అంచనా వేస్తోంది.
మరోవైపు నేపాల్‌లో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. వరదలు టిబెట్ సరిహద్దు నుంచి నేపాల్ జిల్లాలకు చేరేందుకు రెండుగంటల సమయం పట్టిందని.. ఆ గ్యాప్‌లో చైనా నుంచి ముందస్తు హెచ్చరిక అందలేదని, దీనివల్ల నష్టం మరింత పెరిగిందన్న ఆరోపణలు వినిపించాయి. అయితే చైనా ఆరోపణలను తోసిపుచ్చుతోంది. ఇరు దేశాల మధ్య విపత్తులపై సహకార వ్యవస్థ ఉన్నప్పటికీ.. సరిహద్దు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, హిమపాతం వంటి ప్రమాదాలపై ముందస్తు హెచ్చరికలు ఇచ్చే ప్రత్యేక ద్వైపాక్షిక ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ మాత్రం లేదని తెలుస్తోంది.
Deeply saddened by the devastating natural disaster in the Gyirong–Rasuwagadhi border region, which has caused significant casualties and losses on both the Chinese and Nepali sides.
My deepest condolences to those who lost their lives, and my sincere sympathies to their…— Ambassador Zhang Maoming (@PRCAmbNepal) August 27, 2026
రంగంలోకి దిగిన చైనా
నేపాల్–టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ వరదలు, కొండచరియల విరిగిపడిన ఘటనపై చైనా త్వరగతిన స్పందించింది. ఈ విపత్తులో తమ వైపు కూడా నష్టం జరిగిందని పేర్కొంటూ.. సహాయక చర్యలను వేగవంతం చేసింది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగించాలని ఆదేశించారు. చైనా ప్రభుత్వం సరిహద్దు ప్రాంతమైన టిబెట్‌లో అత్యవసర ప్రతిస్పందన చర్యలు చేపట్టింది. రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బందిని రంగంలోకి దించింది. టెంట్లు, దుప్పట్లు, ఇతర సహాయక సామగ్రిని తరలించడంతో పాటు అత్యవసర నిధులను కూడా కేటాయించింది.
ఇదీ చదవండి: చైనా బ్రహ్మరాక్షసితో భారత్‌కే పెనుముప్పు?


