ఉదయం లేవగానే లేదంటో సాయంత్రం పూటో షూస్ వేసుకుని వాకింగ్‌కు వెళ్లడం చాలామందికి రోజువారీ అలవాటు. నడక గుండె, ఊపిరితిత్తులు, కండరాల ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు ఒత్తిడిని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. అయితే వాక్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం ‘కాస్త అలసటే’ అనుకుని ముందుకు సాగుతుంటారు చాలామంది. అయితే అది ఎంతో ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్యం కోసం వేసే అడుగులే.. ఒక్కోసారి ప్రమాదాన్ని సూచించొచ్చు. నడుస్తున్నప్పుడు శరీరం ఇచ్చే ఈ హెచ్చరికలను గుర్తించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా గుండె లేదంటే ఊపిరితిత్తుల సమస్యలు, రక్తప్రసరణలో ఇబ్బందులు వంటి పరిస్థితుల్లో శరీరం ముందుగానే కొన్ని సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంటుంది.
ఛాతీలో బిగుతు.. నొప్పి
నడుస్తున్నప్పుడు ఛాతీలో ఒత్తిడి, బరువు లేదా బిగుతుగా అనిపించడం.. ముఖ్యంగా నొప్పి ఎడమ చేయి, భుజం, మెడ లేదా దవడ వైపు వ్యాపిస్తే వెంటనే నడక ఆపాలి. ఇది గుండెకు రక్తప్రసరణ తగ్గుతున్న సంకేతం కావచ్చు. నొప్పి తగ్గకపోతే ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి.
సాధారణ నడకకే ఊపిరి అందకపోతే..
రోజూ నడిచే వేగంలోనే నడుస్తున్నప్పటికీ తీవ్రంగా ఊపిరి ఆడకపోవడం, మాట్లాడటానికే ఇబ్బంది పడేంత శ్వాస తీసుకోవాల్సి రావడం సాధారణం కాదు. ఇలాంటి లక్షణాలు గుండె లేదా ఊపిరితిత్తుల సమస్యలకు సంకేతం కావచ్చు. వెంటనే విశ్రాంతి తీసుకుని పరిస్థితి తీవ్రంగా ఉంటే వైద్య సహాయం పొందాలి.
తల తిరుగుతోందా?
వాక్ మధ్యలో ఒక్కసారిగా తల తిరగడం, కళ్ల ముందు చీకట్లు కమ్ముకోవడం, తూలుతున్నట్లు అనిపించడం లేదా స్పృహ కోల్పోయే భావన రావడం కూడా నిర్లక్ష్యం చేయకూడని లక్షణాలే. డీహైడ్రేషన్, రక్తపోటు మార్పులు లేదా గుండె స్పందనలో సమస్యలు ఇందుకు కారణం కావచ్చు.
కాలు నొప్పి.. వాపు కనిపిస్తే
నడిచిన తర్వాత ఒక కాలిలో మాత్రమే అసాధారణమైన నొప్పి, వాపు, ఎర్రదనం లేదా వేడి కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇది రక్తనాళంలో రక్తం గడ్డకట్టడానికి సంబంధించిన సమస్యకు సంకేతం కావచ్చు. ముఖ్యంగా అకస్మాత్తుగా వచ్చిన ఇలాంటి లక్షణాలను స్వయంగా మసాజ్ చేసుకోవడం లేదంటే నొప్పి తగ్గే వరకు నడవడం మంచిది కాదు.
చల్లటి చెమటలు.. వికారం
వాతావరణం చల్లగా లేకపోయినా అకస్మాత్తుగా చల్లటి చెమటలు పట్టడం, వికారం లేదంటే వాంతి వచ్చినట్లు అనిపించడం, బలహీనంగా అనిపించడం కూడా గుండె సంబంధిత అత్యవసర పరిస్థితుల్లో కనిపించొచ్చు. కొందరిలో ముఖ్యంగా ఛాతీ నొప్పి స్పష్టంగా లేకుండానే ఇతర లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది.
ఎవరు మరింత అప్రమత్తంగా ఉండాలి?
40 ఏళ్లు దాటినవారు, మధుమేహం, అధిక రక్తపోటు లేదా కొలెస్ట్రాల్ ఉన్నవారు, ధూమపానం చేసేవారు, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు వాకింగ్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా వాకింగ్ ప్రారంభించేవారు లేదా చాలాకాలం తర్వాత వ్యాయామం మొదలుపెట్టేవారు తమ ఆరోగ్య పరిస్థితికి తగిన వ్యాయామ తీవ్రతపై వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
వాక్ ఇలా మొదలుపెట్టండి..
ఒక్కసారిగా వేగంగా నడవకుండా మొదటి 5–10 నిమిషాలు నెమ్మదిగా నడవాలి. శరీరం అలవాటు పడిన తర్వాత వేగాన్ని క్రమంగా పెంచాలి. తగినంత నీరు తీసుకోవడం, వాతావరణానికి అనుగుణంగా దుస్తులు, షూస్ ధరించడం కూడా ముఖ్యం.
అన్నింటికంటే ముఖ్యంగా.. వాకింగ్ చేస్తూ ఛాతీలో నొప్పి, తీవ్రమైన శ్వాస ఇబ్బంది, మూర్ఛ భావన వంటి లక్షణాలు వస్తే ‘ఇంకొంచెం నడిస్తే తగ్గిపోతుంది’ అని అనుకోవద్దు. వెంటనే ఆపి అవసరమైన వైద్య సహాయం తీసుకోవాలి. ఆరోగ్యం కోసం వేసే ప్రతి అడుగు మంచిదే.. కానీ శరీరం ఇచ్చే హెచ్చరికను వినడం అంతకంటే ముఖ్యం.
ఇదీ చదవండి: అవకాడోకు మోదీ ప్రమోషన్.. నిజంగానే మంచిదా?


