భూమిపై మరో సూర్యుడిని సృష్టిస్తున్న చైనా! | China East Reactor Artificial Sun Nuclear Fusion Energy | Sakshi
Sakshi News home page

భూమిపై మరో సూర్యుడిని సృష్టిస్తున్న చైనా!

Sep 5 2026 1:07 PM | Updated on Sep 5 2026 1:46 PM

China East Reactor Artificial Sun Nuclear Fusion Energy

చైనా అభివృద్ధి చేసిన ‘ఈస్ట్‌’ (ఎక్స్‌పరిమెంటల్‌ అడ్వాన్స్‌డ్‌ సూపర్‌ కండక్టింగ్‌ టోకమాక్‌) రియాక్టర్‌ ప్రపంచ శక్తి (ఎనర్జీ) రంగాన్ని సరికొత్త మలుపు తిప్పే దిశగా పురోగమిస్తోంది. సూర్యుడిలో నిరంతరం శక్తిని ఉత్పత్తి చేసే న్యూక్లియర్‌ ఫ్యూజన్‌  (అణు సంలీనం) ప్రక్రియను భూమిపై సురక్షితంగా పునఃసృష్టించడమే ఈ ప్రాజెక్ట్‌ ప్రధాన ఉద్దేశం.

రెండు తేలికపాటి పరమాణు కేంద్రకాలు అత్యధిక ఉష్ణోగ్రత, పీడనాల వద్ద ఒకదానికొకటి వేగంగా ఢీకొని, కలిసిపోయి ఒకే బరువైన పరమాణు కేంద్రకంగా మారడాన్ని అణు సంలీనం అంటారు. భూమిపై సూర్యుడిలోని గురు త్వాకర్షణ శక్తిని సృష్టించడం సాధ్యం కాదు. అందుకే టోకమాక్‌ అనే శక్తిమంతమైన అయస్కాంత క్షేత్రాలు కలిగిన డోనట్‌ ఆకారపు పరికరాన్ని ఉపయోగిస్తారు. ఇందులో హైడ్రోజన్‌ ఐసోటోప్‌లైన డ్యూటీరియం, ట్రిటియంలను వందల మిలియన్ల డిగ్రీల సెల్సియస్‌ వద్ద వేడి చేసి ప్లాస్మా రూపంలో బంధించి ఈ సంలీన ప్రక్రియను జరుపుతారు.

చైనా సైంటిస్టులు 12 కోట్ల డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద ప్లాస్మాను 101 సెకన్ల పాటు, అలాగే మరికొన్ని ప్రయోగాల్లో 1,000 సెకన్ల కంటే ఎక్కువ సమయం స్థిరంగా నిర్వహించి ప్రపంచ రికార్డులు నమోదు చేశారు. ఈ ప్రాజెక్ట్‌ చైనాలోని అనూయ్‌ ప్రావిన్స్‌లో ఉన్న ‘హెఫీ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ సైన్సెస్‌’ ఆధ్వర్యంలో నడుస్తోంది.

ప్రస్తుతం వాడుతున్న అణు విచ్ఛిత్తి వల్ల ప్రమాదకరమైన రేడియో యాక్టివ్‌ వ్యర్థాలు వస్తాయి. ఈ ఫ్యూజన్‌  సాంకేతికత వల్ల జీరో కార్బన్‌ ఉద్గారాలు, సురక్షితమైన శక్తి లభిస్తుంది. సముద్రపు నీటిలో లభించే డ్యూటీరియం, ట్రిటియం వంటి హైడ్రోజన్‌  ఐసోటోప్‌లను ఇంధనంగా వాడుతారు. నిజమైన సూర్యుడి కేంద్రకంలో ఉష్ణోగ్రత సుమారు 1.5 కోట్ల డిగ్రీల సెల్సియస్‌ ఉంటుంది. చైనా సృష్టించిన ఈ పరికరం ఏకంగా 16 కోట్ల డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను తాకి రికార్డు సృష్టించింది.

ప్లాస్మాను ఎక్కువసేపు స్థిరంగా ఉంచడం, ఉత్పత్తి అయ్యే శక్తిని సమర్థ వంతంగా విద్యుత్‌గా మార్చడం వంటి సాంకేతిక సవాళ్లు ఇంకా పరిష్కరించాల్సి ఉంది. చైనా మాత్రమే కాకుండా అమెరికా, యూరప్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా అణు సంలీన సాంకేతికతపై పరిశోధనలు చేస్తున్నాయి. చైనా ప్రయోగాలు కేవలం ఈస్ట్‌తోనే ఆగడం లేదు. తదుపరి తరం ప్రాజెక్ట్‌ ‘బెస్ట్‌’ (బర్నింగ్‌ ప్లాస్మా ఎక్స్‌పెరిమెంటల్‌ సూపర్‌ కండక్టింగ్‌ టోకమాక్‌)ను నిర్మిస్తున్నారు. 2030 నాటికి వాణిజ్యపరంగా విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన సాంకేతికతను సిద్ధం చేయాలనేది దీని లక్ష్యం.
– తరిగొప్పుల వీఎల్లెన్‌  మూర్తి, సీనియర్‌ జర్నలిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement