కృష్ణుడి గురించి ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి! | Krishna Avatar Divine Glory Dharma And Victory | Sakshi
Sakshi News home page

గోవిందుడు అందరివాడు

Sep 4 2026 7:55 AM | Updated on Sep 4 2026 9:47 AM

Krishna Avatar Divine Glory Dharma And Victory

నేడు శ్రీకృష్ణాష్టమి

సంఖ్యాకమైన భగవదావతారాలలో అతి విశిష్టమైనదీ, పరిపూర్ణమైనదీ కృష్ణావతారం. భావో ద్రేకాలు అధికమైన భక్తులకు శ్రీకృష్ణుడు మహానందాంగనా డింభకుడిగా, ముద్దుగారే యశోద ముంగిటి ముత్యంగా, అందమైన అల్లరి చేష్టల నవనీత చోరుడిగానే ముందు మనసుకు వచ్చి మురిపిస్తాడు కానీ ఆయన జగద్గురువు. యోగేశ్వరుడు. దేవదేవుడు. భూభారం తగ్గించటమే లక్ష్యంగా ఆయన ఎత్తిన కృష్ణావతారంలో ఆజన్మాంతం దుష్టశిక్షణా, సాధురక్షణా, ధర్మ సంస్థాపనా, జగదోద్ధరణా జరిగాయి. అన్ని అద్భుత ఘనకార్యాలు మరే అవతారంలోనూ కనబడవు. ఆ ‘భాగవత’మంతా పఠిస్తేనే చాలు, ‘బాగవుతాం’ అన్నారు పెద్దలు.

పుట్టిన మూడో నెలలో పూతనను మట్టుపెట్టడంతో ఆరంభించి, పసితనంలోనే ఆయన వల్ల మట్టిలో కలిసిన మహాబలులూ, మాయావులూ అయిన రాక్షసులకు లెక్క లేదు. ఏడేళ్ల వయస్సులో ఏకంగా కొండనే ఎత్తి, ఏడు రోజులు చిటికెన వేలుమీద స్థిరంగా నిలిపి ఉంచి, ప్రజారక్షణ చేసి, ఇంద్రుడికే సవాలు విసిరిన లీలాబాలుడికి ఎవరు సాటి? ఎందరు దుష్టులను దునుమాడినా, ఆయన ఎవరినీ ద్వేషించలేదు. ఆయన చేత వధించబడిన దుష్టులు ఆఖరికి సద్గతులే పొందారు.

కృష్ణావతారం నొక్కి వక్కాణించే సూత్రం ‘గోవిందుడు అందరివాడు’ అని. కామోత్కంఠతో గానీ, స్నేహంతో గానీ, చనువుతో గానీ, భక్తితో గానీ బాంధవ్యంతో గానీ, ప్రేమతో గానీ, చివరకు ఆయనపట్ల అమితమైన అకారణ ద్వేషంతో గానీ, ఆయన మీద మనసు లగ్నం చేయగలిగిన వాళ్ళందరికీ ఆయన శ్రేయస్సును ప్రసాదిస్తాడనేందుకు గోపికలూ, కుచేలుడూ, గోపాలకులూ, నారదాదులూ, యాదవులూ, పాండవ పరివారమూ, కంస–శిశుపాల–సాల్వ–కేశి–పౌండ్రక–దంత వక్త్ర– నరకాసురాదుల వృత్తాంతాలు తనువు పులకరింపజేసే తార్కాణాలు.

కార్య విజయాలనూ, జీవన సాఫల్యాన్నీ కాంక్షించే వారికి, సకల శాస్త్రవేత్తా, ధర్మమూర్తీ అయిన భీష్మాచార్యుడు నిర్ద్వంద్వంగా నిర్దేశించిన, ‘యతః ధర్మః తతః కృష్ణః, యతః కృష్ణః తతః జయః!’ (ఎక్కడ ధర్మం ఉంటే, అక్కడ కృష్ణుడుంటాడు. ఎక్కడ కృష్ణుడుంటే, అక్కడ విజయం ఉంటుంది) అన్న సూచన అందరికీ నిత్యస్మరణీయం, అనుసరణీయం.
– ఎం. మారుతి శాస్త్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement