పొలాల్లో సౌర ఫలకాలు
సాగుబడి
ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. ‘అగ్రివోల్టాయిక్స్’తో విద్యుత్ ఉత్పత్తికి, పంట దిగుబడికీ భద్రత
ప్యానెళ్ల నీడలో పెరిగే టొమాటో తోటపై 2 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుదల
సూక్ష్మ వాతావరణం వల్ల తేమ నష్టం ఏకంగా 43 శాతం తగ్గింది
ప్యానెళ్ల నీడలో పనిచేసే శ్రామికులకు సగటున 4 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గిన అనుభూతి
అమెరికాలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయ పరిశోధనలో వెల్లడి
ఎండ తీవ్రత నానాటికీ పెరుగుతున్న వేళ.. వ్యవసాయ రంగానికి, ఎండనక వాననక పొలాల్లో చెమటోడ్చే రైతులు, రైతు కూలీలకు ఊరటనిచ్చే సరికొత్త మార్గం వెలుగులోకి వచ్చింది. వ్యవసాయ భూముల్లో పంటల పైన సౌర ఫలకాలు (సోలార్ ప్యానెల్స్) అమర్చే ‘అగ్రివోల్టాయిక్స్’ విధానం ద్వారా కేవలం విద్యుత్ ఉత్పత్తి మాత్రమే కాకుండా, పంట దిగుబడులు కూడా రైతుకు అందుతాయి.
అయితే, ఈ రెంటికీ మించి పర్యావరణపరమైన సౌలభ్యాలు కూడా అదనంగా లభిస్తాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. సౌర ఫలకాల మధ్య పంటలు సాగు చేసే పొలాల్లో పనిచేసే రైతులు, రైతు కూలీలకు తీవ్రమైన ఉష్ణతాపం నుంచి ఉపశమనం కూడా లభిస్తుందని అమెరికాకు చెందిన ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చారు. ‘జర్నల్ ఆఫ్ అడ్వాన్సెస్ ఇన్ మోడలింగ్ ఎర్త్ సిస్టమ్స్’ పత్రికలో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి.
నీటి ఆదా.. ఉష్ణోగ్రత నియంత్రణ
పరిశోధకులు కంప్యూటర్ సిమ్యులేషన్ నమూనా ద్వారా టొమాటో తోటలపై సోలార్ ప్యానెళ్ల ప్రభావాన్ని విశ్లేషించారు. ప్యానెళ్ల నీడలో పెరిగే టొమాటో ఆకుల ఉష్ణోగ్రత సాధారణ తోటలతో పోలిస్తే సగటున 1.84 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది. ముఖ్యంగా మధ్యాహ్నపు మండుటెండల్లో ఏకంగా 7.56 డిగ్రీల వరకు చల్లదనం పెరిగింది. ఈ చల్లని మైక్రో–క్లైమేట్ (సూక్ష్మ వాతావరణం) వల్ల ఆకుల నుంచి నీటి ఆవిరి కావడం 22.4 శాతం తగ్గింది. అలాగే పంట, నేల నుంచి జరిగే మొత్తం తేమ నష్టం ఏకంగా 42.6 శాతం వరకు తగ్గింది. దీనివల్ల వేసవిలో సాగునీటి వినియోగాన్ని భారీగా ఆదా చేసుకోవచ్చని స్పష్టమైంది.
రైతు కూలీలకు వడదెబ్బ నుంచి రక్షణ
సాధారణంగా తీవ్రమైన ఎండల వల్ల పొలాల్లో పనిచేసే కూలీలు వడదెబ్బకు గురికావడం, అలసటతో పనిచేసే శక్తి, సమయం తగ్గిపోతూ ఉంటుంది. ఆ మేరకు పని ఉత్పాదకత తగ్గుతుంది. అయితే, ఈ ప్యానెళ్ల నీడలో పనిచేసే శ్రామికులకు సగటున 4.46 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత తగ్గిన అనుభూతి కలుగుతుందని గుర్తించారు. తీవ్ర ఎండలో 39 డిగ్రీలుగా ఉండే తాపం, ప్యానెళ్ల కింద సుమారు 35 డిగ్రీలకు తగ్గిపోతుంది. ఇది శ్రామికుల ఆరోగ్యానికి, పనితీరు మెరుగుదలకు దోహదం చేస్తుంది.
పంటలకు ప్యానెళ్లకూ ప్రయోజనం
అగ్రివోల్టాయిక్స్ పద్ధతిలో కేవలం పంటలకే కాక, సోలార్ ప్యానెళ్లకు కూడా లబ్ధి చేకూరుతుంది. పంటల నుంచి వెలువడే తేమ గాలిని చల్లబరచడం వల్ల సోలార్ ప్యానెళ్ల ఉష్ణోగ్రత 5.6 డిగ్రీల సెల్సియస్ తగ్గింది. ఫలితంగా అధిక వేడిమి వల్ల ప్యానెళ్లలో జరిగే విద్యుత్ సామర్థ్య నష్టం 15 శాతం వరకు తగ్గి, అధిక విద్యుత్ ఉత్పత్తికి కారణమైంది. ప్యానెళ్ల వల్ల పంటకు సూర్యరశ్మి 47 శాతం తగ్గినా, కిరణజన్య సంయోగక్రియ కేవలం 31 శాతమే తగ్గిందని, చల్లటి వాతావరణం వల్ల పంట ఎదుగుదల బాగానే ఉంటుందని పరిశోధకులు వివరించారు. భూగర్భ జలాలు తరుగుతున్న ప్రస్తుత రోజుల్లో విద్యుత్, నీరు, దిగుబడి మూడింటినీ కాపాడుకోవడానికి ‘అగ్రివోల్టాయిక్స్’ ఒక మేలైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది.
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్


