చెదల బెడదకు ఇంట్లోనే పరిష్కారం.. ఈ పద్ధతులు ట్రై చేయండి! | Natural Ways To Control Termites In Plants And Gardens | Sakshi
Sakshi News home page

చెదల బెడదకు ఇంట్లోనే పరిష్కారం.. ఈ పద్ధతులు ట్రై చేయండి!

Sep 4 2026 8:37 AM | Updated on Sep 4 2026 8:37 AM

Natural Ways To Control Termites In Plants And Gardens

సాగుబడి

ఇంటి పంట 17

మొక్కలకు, పెద్ద చెట్లకు చెద (టర్మైట్స్‌) పట్టటం ఒక పెద్ద సమస్య. అయితే దీనిని కొన్ని సులభమైన, మనకు అందుబాటులో ఉండేటువంటి పద్ధతులతో ఈ సమస్యను సునాయాసంగా అరికట్టవచ్చు. మరి అదేంటో చూద్దాం!

1.    మొక్కల మొదళ్లలో వేప పిండిని చల్లటం ద్వారా చెద పురుగులు రాకుండా నిరోధించవచ్చు.
2.   ఒక లీటరు నీటిలో 5–10 ఎం.ఎల్‌. వేప నూనె, కొద్దిగా లిక్విడ్‌ సోప్‌ కలిపి మొక్క మొదళ్లలో మట్టిపై వారానికి ఒకసారి పిచికారీ చేయాలి.
3.    చెదలు ఎక్కువగా ఉన్న చోట కట్టెల బూడిదను మట్టిపై చల్లితే చెద పురుగులు రావు.
4.    చెదలు పట్టిన మట్టిలో లేదా మొదళ్ళ వద్ద ఉప్పు నీటిని పోయటం ద్వారా చెదలను చంపవచ్చు.
5. వెల్లుల్లి రెబ్బలను నూరి నీటిలో కలిపి 24 గంటలు నానబెట్టి, ఆ ద్రావణాన్ని పిచికారీ చేయడం వల్ల కూడా చెదలను నివారించవచ్చు.

6.    చెదలు తేమను ఇష్టపడతాయి. కాబట్టి మొక్కల మొదళ్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
7. మొక్కల దగ్గర ఎండి /పాడైన కట్టెలు, ఎండు ఆకులు, చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉంచాలి.
8.    మొక్క కాండానికి పసుపు లేదా సున్నం పూయటం వల్ల చెదలు కాండం పైకి పాకకుండా నిరోధించవచ్చు.
9.    మొక్కల చుట్టూ ఉన్న మట్టిని తరచుగా తవ్వటం వల్ల చెదపుట్టలు నశిస్తాయి.
10. వట్టి వేరు మొక్క వేర్ల నుంచి వచ్చే ఒక రకమైన సువాసన చెదపురుగులకు అస్సలు పడదు. ఇది భూమిలో లోతుగా పెరిగి సహజమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది. కాబట్టి, మొక్కల పక్కనే ఒక వట్టి వేరు మొక్క వేసుకుంటే చెదలు రాదు.
11. బంతి పూల మొక్కలు తోటకు అందాన్నివ్వటమే కాకుండా, వాటి వేర్లు, ఆకులు విడుదల 
చేసే రసాయనాలు చెదపురుగులను దూరంగా ఉంచుతాయి.
12. లెమన్‌ గ్రాస్‌ (నిమ్మ గడ్డి)లో ఉండే సిట్రానెల్లా ఆయిల్‌ ఘాటైన వాసన చెదలను రాకుండా నిరోధిస్తుంది.

ఇవి కూడా చదవండి: రైతన్నకు మూడు లాభాలు.. ఇదే అగ్రివోల్టాయిక్స్‌!

13. పుదీనా ఆకుల నుంచి వచ్చే బలమైన సువాసన చెదలను నివారిస్తుంది. ఇది త్వరగా వ్యాపించి నేలపైన రక్షణగా ఉంటుంది.
14. వెల్లుల్లిలో ఉండే ఘాటైన వాసన చెదలను చంపడానికి లేదా దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది.
15. వేప మొక్క లేదా చెట్టు పెంచడం వల్ల దాని నుంచి వచ్చే రసాయనాలు నేలలో చెదలు చేరకుండా చూస్తాయి.
16. చామంతి మొక్కల్లో ‘పైరెత్రిన్‌’ అనే సహజ కీటకనాశిని ఉంటుంది. ఇది చెద నివారణకు బాగా ఉపయోగపడుతుంది.
17. ఆముదం మొక్క వేర్ల నుంచి విడుదలయ్యే కొన్ని రసాయనాలు చెదపురుగులకు విషపూరితంగా మారుతాయి.
18. పెద్ద మొక్కల దగ్గరలో నేల మీద పైన చెప్పిన మొక్కలు నాటటం ద్వారా చెదలను నివారించవచ్చు.

- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్‌: 94906 02366

  • నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement