– లేటెస్ట్ వెర్షన్:2026
హ్యూమరమరాలు
ఒక తాబేలు తనదైన స్టైల్‌లో మెల్లగా నడుచుకుంటూ వెళుతుంటే... రన్నింగ్ సూట్‌లో ఎదురుగా వచ్చిన కుందేలు.... ‘ఇలా నడుచుకుంటూ మీ ఇంటికి వెళ్లాలంటే కనీసం సంవత్సర కాలం పడుతుంది’ అని వెక్కిరించింది. ‘ఇలా వెక్కిరించే అలనాడు మీ తాత అభాసుపాలైన విషయం మరిచిపోయావా మిత్రమా?’ అని పెద్దగా నవ్వింది తాబేలు. ‘అప్పటి విషయం ఇప్పుడు ఎందుకు? మనం పోటీ పడదాం’ అని సవాలు విసిరింది కుందేలు.
పోటీ మొదలైంది...
కాసేపట్లోనే కంటికి కనిపించనంత దూరం వెళ్లిపోయింది కుందేలు. తనతో రన్నింగ్‌లో పోటీ పెట్టుకోవడం ఎంత తెలివి తక్కువ విషయమో బాగా గుర్తు చేయడానికి, తాబేలు తన దగ్గరకు వచ్చేంత వరకు విశ్రాంతి తీసుకుందామని ఒకచోట ఆగింది కుందేలు. ఎంత ఎదురుచూసినా తాబేలు జాడ కనిపించలేదు. చల్లగాలి వీస్తుండడంతో కుందేలుకు నిద్ర ముంచుకొచ్చింది. ‘ఒక కునుకేద్దాం’ అని గాఢంగా నిద్రపోయింది కుందేలు.
చరిత్రను తిరగరాస్తూ కుందేలు ఘన విజయం సాధించింది! ‘గాఢంగా నిద్ర పోయినా కుందేలు ఎలా విజయం సాధించింది? దీనికి వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి?’ అంటూ పత్రికలలో విశ్లేషణాత్మక కథనాలు వచ్చాయి. టీవి చానల్స్‌లో వాడివేడిగా చర్చోపచర్చలు జరిగాయి. అఖిల భారత తాబేళ్ల సమాఖ్య(అబాతా) కుందేలు విజయాన్ని అంగీకరించలేదు. ‘కుందేలు విజయం అక్రమం’ అంటూ కోర్టులో దావా కూడా వేసింది. నిద్రపోయిన కుందేలు ఎలా గెలిచింది... ఇంతకీ ఏంజరిగింది?
అసలు ఏం జరిగిందటే...
గాఢనిద్రలో గుర్రు కొడుతున్న కుందేలును దాటి గమ్యస్థానానికి చాలా దగ్గరగా వచ్చింది తాబేలు. దారి పక్కన పొదల్లో దానికి ఐ ఫోన్ 17 కనిపించింది. ఆ సంతోషంలో ఎగిరి గంతేసింది తాబేలు. ఆ ఐ ఫోన్‌ను అపురూపంగా కాళ్లలోకి తీసుకొని జేమ్స్‌బాండ్ యాక్షన్–అడ్వెంచర్ గేమ్ ‘007 ఫస్ట్‌లైట్’ ఆడడం మొదలుపెట్టింది.
ఆటలో పీకలలోతు మునిగిపోయింది. ఈలోపు కుందేలు నిద్ర లేచింది. పరుగు ప్రారంభించి మెరువు వేగంతో గమ్యస్థానాన్ని చేరుకొని చరిత్రను తిరగరాసి విజేతగా నిలిచింది.
నీతి: గెలవడానికి సంకల్పబలమే కాదు... ఐ ఫోన్‌కు టెంప్ట్ కాని అసలు సిసలు మానసిక బలం కూడా ఉండాలి.
– యాకుబ్ పాషా


