ట్రెకింగ్
వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే నిరూపించాడు కేరళలోని వయనాడ్‌కు చెందిన 74 ఏళ్ల టి.జె. మార్స్. మైనస్ 20 డిగ్రీల చలిలో, గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వీచే మంచుగాలులను సైతం తట్టుకుని యూరప్‌లోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎల్బ్రస్‌ని అధిరోహించాడు. మౌంట్ ఎల్బ్రస్ ఎక్కిన అత్యంత వృద్ధ భారతీయుడిగా నిలిచి రికార్డు సృష్టించాడు.
ట్రెక్కింగ్‌పై ఆసక్తి ఉన్న టి.జె. మార్స్ మొదట తన 70 ఏళ్ల వయసులో (2021)లో చేంగేరి హిల్స్ ట్రెక్కింగ్‌తో తన ఈ నూతన ప్రయాణం ప్రారంభించాడు. ఆ తర్వాత కేరళలోని బ్రహ్మగిరి, బాణాసుర పర్వతాలను అధిరోహించాడు. అప్పటి నుంచి తనపై తనకు మరింత నమ్మకం కుదిరి 2024లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్, 2025లో ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన శిఖరం ‘మౌంట్ కిలిమంజారో’లను ఎక్కి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందారు.
ప్రస్తుతం తాను చేసిన మౌంట్ ఎల్బ్రస్ సాహస యాత్ర ఎంతో కష్టంతో కూడుకున్నదనీ... శారీరక దృఢత్వం కంటే మానసిక సంకల్పమే తనను ముందుకు నడిపిందని మార్స్ ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన ట్రెక్కింగ్ కేవలం ఈ పర్వతంతోనే ఆగిపోదని, వచ్చే ఏడాది మరొక ఎత్తైన పర్వతాన్ని అధిరోహిస్తానని ఉత్సాహంగా చెబుతున్నాడు 74 ఏళ్ల యువకుడు.


