సిరీస్ హ్యాంగోవర్
రాత్రి ఒంటి గంట. టీవీ తెర మీద ‘ది ఎండ్’. కింద క్రెడిట్స్ పరుగెడుతున్నాయి. రిమోట్ పక్కన పెట్టాం. లైట్ ఆర్పాం. కానీ నిద్ర రావడం లేదు. గత రెండు రోజులుగా మనతో పాటు నవ్విన, ఏడ్చిన, గొడవ పడిన ఓటిటి సిరీస్ కుటుంబం ఇప్పుడు లేదు. మిగిలింది మన గదిలోని నిశ్శబ్దం. ఇప్పుడేం చేయాలి? ఏదో ఖాళీ... ఈ ఖాళీకి ఒక పేరు ఉంది. ‘సిరీస్ హ్యాంగోవర్’... ఈ భ్రమాత్మక ఇరుగూ పొరుగుతో సహజీవనం ప్రమాదం సుమా!
మనకు మనిల్లు కాకుండా ఇంకొకరి ఇల్లు నచ్చడానికి మించిన విషాదం లేదు. మన ఇంటి నుంచి మనం పారిపోవడమే మనకు కావాలి. లేదా మన ఇంటి వాస్తవికత మీద కార్పెట్ పరిచి భ్రమా జగత్తులో మునిగిపోవాలి. అందుకో మార్గం ఓటిటి సిరీస్‌లు. ఒకప్పుడు ‘నుక్కడ్’, ‘బునియాద్’... టీవీలో వారానికి ఒక ఎపిసోడ్. ఇప్పుడు ఓటీటీలో ఒకేసారి 8 ఎపిసోడ్ లు. రెండు రోజుల్లో ఆ ఓటీటీలోని కుటుంబంతో, వ్యక్తులతో 6 గంటలు గడుపుతాం. వాళ్ల ఉద్వేగాల్లో మునిగిపోతాం. వాళ్ల జీవితాలు జీవించేస్తాం. ఆ జీవితాలు రెండు రోజుల పాటు మనకు అలవాటైపోతాయి. అందుకే లాస్ట్ ఎపిసోడ్ తర్వాత ఏదో బరువు. ఏదో కోల్పోయిన బాధ. ఎందుకు ఈ బాధ?
వెలితి మనలో ఉంది...
ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పరుగు. ఆఫీస్, ఇల్లు, పిల్లలు, బాధ్యతలు.... అందరికీ ఏదో కావాలి. కానీ మనకు ఎవరున్నారనే ప్రశ్నకు సమాధానం ఉండదు. చుట్టూ 50 మంది ఉంటారు. కానీ 10 నిమిషాలు మనసు విప్పి మాట్లాడే మనిషి ఉండడు. అలాంటి సమయంలో ఒక సిరీస్ వస్తుంది.
అక్కడ క్యారెక్టర్లు మనతో పేచీ పడవు. వాళ్ల జీవితంలోకి పిలుస్తాయి. ప్రతి ఐదు నిమిషాలకో ఉద్వేగం ఉంటుంది. మనం ఆ ఫిక్షన్‌లోకి పారిపోతాం. అక్కడ మనకు ఒంటరిగా లేము అనే భ్రమ దొరుకుతుంది. ఈ భ్రమే కొన్ని గంటల పాటు మనల్ని నిలబెడుతుంది.
‘పారాసోషల్’ మాయాజాలం!
నిజమైన మనుషులతో కాకుండా ఇలా తెర మీద, కృత్రిమ పాత్రలతో అనుబంధం పెంచుకోవడాన్ని మానసిక నిపుణులు ‘పారాసోషల్ రిలేషన్ షిప్’ అంటారు. అంటే, స్క్రీన్ మీద ఉన్న పాత్రలతో One sided relationship మన బ్రెయిన్ ఆ క్యారెక్టర్లను నిజమైన మనుషులుగా నమ్మడం మొదలుపెడుతుంది. మనం సిరీస్ చూస్తున్నంత సేపూ మెదడులో ‘డోపమైన్’ విపరీతంగా విడుదలవుతుంది. అది ఒక మత్తు లాంటిది. సిరీస్ అయిపోగానే ఆ హార్మోన్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోతాయి. దాంతో తీవ్రమైన డిప్రెషన్, ఖాళీతనం ఆవహిస్తాయి. ఆ నిశ్శబ్దాన్ని భరించలేక వెంటనే తర్వాతి వెబ్ సిరీస్ బటన్ నొక్కేస్తాం.
అసలు ఇంట్లోకి వద్దాం!
ఈ ‘సిరీస్ హ్యాంగోవర్’ మనకు గుర్తు చేసే విషయం ఏమిటంటే మనకు నిజమైన మనుషులు కావాలి... నిజమైన ఆత్మీయత కావాలి, నిజమైన ప్రేమ కావాలి.... సిరీస్‌లు చూడటం తప్పు కాదు... నిజమైన అనుబంధాలతో కనెక్షన్ కోల్పోయి ఈ తెరతో కనెక్షన్‌లో ఉండటం తప్పు. పైగా ఈ సిరీస్‌లన్నీ పాజిటివ్ కథలతో ఉండవు. క్రైమ్, నెగెటివిటీ, కుట్ర, హత్య, శారీరక సంబంధాలు... ఇవన్నీ మెదడు ఆరోగ్యాన్ని కలుషితం చేసేవే. ఆ కాసేపు మత్తు అనుభవించాక నిజ జీవితం మీద నిర్లిప్తత రావడం, దానిని ఎదుర్కొనే శక్తి సన్నగిల్లడం జరుగుతుంది.
మనతో మనం ఉండలేకపోవడం పెద్ద లోపం. అయినవారితో స్నేహితులతో కలగలిసి ఉండలేకపోవడం పెద్ద నష్టం. ఇక తెర మీద పాత్రలతో బతుకుతూ రావడం అతి పెద్ద రోగం. రాత్రిళ్లు నిద్ర మానుకుని సిరీస్‌లలో మునిగి ఉన్న ప్రతి ఒక్కరూ నిజమైన బంధాల వైపు అడుగులేయడమే ఇప్పుడు చేయాల్సింది.
స్త్రీల సంగతి
స్త్రీలు నిజ జీవితంలో ఇంట్లో, బయట వంక రాకుండా బతకాలి. అందరి బాధ్యత తీసుకోవాలి. కానీ తమ బాధ ఎవరికీ చెప్పుకోకూడదు. అలాంటప్పుడు తెర మీద కనిపించే స్త్రీ పాత్రలు అద్దంలా కనిపిస్తాయి. ఆ పాత్రల్లో ఐడెంటిఫై అయ్యేలా చేస్తాయి. వాటిని చూస్తుంటే ‘నేను ఒంటరిదాన్ని కాదు’ అని సగటు స్త్రీకి అనిపిస్తుంది. అందుకే సిరీస్ అయిపోయినప్పుడు ఏడుపు వస్తుంది. మనకు అర్థమైన ఒక మనిషిని కోల్పోయినట్టు ఉంటుంది.


